IRCTC: ప్రయాణికుల డేటా మానిటైజేషన్‌‌.. వెనక్కి తగ్గిన ఐఆర్‌సీటీసీ

ప్రయాణికుల వివరాలతో కూడిన డిజిటల్‌ డేటాను మానిటైజ్‌(Monetisation Digital Data) చేయాలని భావించిన ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(IRCTC)...

Published : 26 Aug 2022 23:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రయాణికుల వివరాలతో కూడిన డిజిటల్‌ డేటాను మానిటైజ్‌(Monetisation Digital Data) చేయాలని భావించిన ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(IRCTC).. తాజాగా తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ‘వ్యక్తిగత డేటా గోప్యత’పై పెద్దఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతోన్న క్రమంలో.. ఈ ప్రక్రియ కోసం ఇటీవల ఓ కన్సెల్టెంట్‌ను నియమించుకునేందుకు ఆహ్వానించిన టెండర్‌ను ఉపసంహరించుకున్నట్లు శుక్రవారం వెల్లడించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై ఏర్పాటయిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ఐఆర్‌సీటీసీ అధికారులు ఇదే విషయాన్ని తెలియజేశారు.

ఇటీవల డిజిటల్ డేటా మానిటైజేషన్‌పై వెలువడిన కథనాలపై స్పందించిన పార్లమెంటరీ ప్యానెల్.. ఈ వ్యవహారంపై వివరణ కోరుతూ సంబంధిత అధికారులను తమముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఐఆర్‌సీటీసీ ఎండీ, ఛైర్‌పర్సన్‌ రజ్నీ హసిజా, ఇతర అధికారులు శుక్రవారం ప్యానెల్ ముందు హాజరయ్యారు. ‘డేటా ప్రొటెక్షన్‌ బిల్లు’ ఆమోదం పొందని నేపథ్యంలో.. ఆ టెండర్‌ను ఉపసంహరించుకున్నట్లు ప్యానెల్‌కు తెలియజేశారు. ఈ విచారణకు ముందే నిర్వహించిన ఐఆర్‌సీటీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

రైల్వే టికెటింగ్‌లో ఏకఛత్రాధిపత్యం కలిగి ఉన్న ఐఆర్‌సీటీసీ వద్ద పెద్దఎత్తున ప్రయాణికుల వివరాలతోపాటు, వారి లావాదేవీల వివరాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఈ డిజిటల్‌ డేటాను మానిటైజ్‌ చేసి.. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉన్న టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌, హోటల్స్‌, ఫైనాన్సింగ్‌, ఇన్సూరెన్స్‌, వైద్య సంస్థలతో వ్యాపారం చేసేందుకు సిద్ధమైంది. తద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని భావించింది. ఇందుకోసం ఓ కన్సెల్టెంట్‌ను నియమించుకునేందుకు టెండర్‌ను ఆహ్వానించింది.

అయితే, ఈ వార్త బయటకు రావడంతో.. ప్రయాణికుల వ్యక్తిగత డేటా గోప్యతపై ఆందోళనలు వెల్లువెత్తాయి. ఇది వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడమే అవుతుందన్న వాదనలూ వినిపించాయి. వివరాలన్నీ థర్డ్‌ పార్టీ చేతికెళ్తే దుర్వినియోగం అవుతాయన్న నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే ఐఆర్‌సీటీసీ.. తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. 2019లోనూ ఐఆర్‌సీటీసీ డిజిటల్‌ ఆస్తుల మానిటైజ్‌ గురించి ఆసక్తి వ్యక్తీకరణకు టెండర్‌ను ఆహ్వానించి.. ఎందుకనో వెనక్కి తగ్గింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని