PPF loan: పీపీఎఫ్ నుంచి రుణం తీసుకోవాలనుకుంటున్నారా? ఇవి తెలుసుకోండి..

పీపీఎఫ్‌లో ఒక‌సారి తీసుకున్న రుణాన్ని పూర్తిగా చెల్లించిన త‌ర్వాత మాత్ర‌మే రెండ‌వ సారి రుణం తీసుకునేందుకు అనుమ‌తిస్తారు.  

Published : 29 Jun 2022 18:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పీపీఎఫ్ ఖాతాకు 15 ఏళ్ల లాక్-ఇన్ పిరియ‌డ్ ఉంటుంది. ఇది పూర్తయిన త‌ర్వాత మాత్ర‌మే వ‌డ్డీతో స‌హా మెచ్యూరిటీ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునేందుకు వీలుంటుంది. ఒక‌వేళ ఈ లోపు డ‌బ్బు అవ‌సరం అయితే.. రుణం (PPF Loan), పాక్షిక విత్‌డ్రా వంటి ఆప్ష‌న్లు అందుబాటులో ఉన్నాయి. ఖాతాలో సేక‌రించిన మొత్తం ఆధారంగా కొన్ని నియ‌మ‌ నిబంధ‌న‌లకు లోబ‌డి రుణం, పాక్షిక విత్‌డ్రాల‌ను అనుమ‌తిస్తారు. రుణం తీసుకోవాల‌నుకునేవారు ఖాతా ప్రారంభించిన త‌ర్వాత ఎప్పుడు రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు? ఎంత వ‌ర‌కు రుణం ల‌భిస్తుంది? ఎంత వ‌డ్డీ వ‌ర్తిస్తుంది? చెల్లింపులు ఎలా చేయాలి? త‌దిత‌ర విష‌యాల‌ను తెలుసుకుందాం.. 

ఎవ‌రు రుణం తీసుకోవ‌చ్చు? ఎప్ప‌టి నుంచి? 
చందాదారులందరికీ పీపీఎఫ్ ఖాతాపై రుణం (PPF Loan) పొందేందుకు అర్హ‌త ఉంటుంది. అయితే ఖాతా తెరిచిన మూడో ఆర్థిక‌ సంవ‌త్స‌రం నుంచి ఆరో సంవ‌త్స‌రం వ‌ర‌కు మాత్ర‌మే రుణ స‌దుపాయం అందుబాటులో ఉంటుంది.

మూడో ఆర్థిక సంవ‌త్స‌రం అంటే..
ఉదాహ‌ర‌ణ‌కు ఓ వ్య‌క్తి 2021 జ‌న‌వ‌రి 15లో పీపీఎఫ్ ఖాతా ప్రారంభించాడనుకుందాం. అత‌డు/ఆమెకు 2022 ఏప్రిల్ 1 నుంచి రుణ స‌దుపాయం అందుబాటులో ఉంటుంది.

  • 2020-21 (ఏప్రిల్ 1, 2020 నుంచి మార్చి 31, 2021)
  • 2021-22 (ఏప్రిల్ 1, 2021 నుంచి మార్చి 31, 2022)
  • 2022-23 (ఏప్రిల్ 1, 2022 నుంచి మార్చి 31, 2023)

పీపీఎఫ్ ఖాతాలో ఆర్థిక సంవ‌త్స‌రాల‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుంటారు. మీరు 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి 31లోపు ఎప్పుడు ఖాతా తెరిచినా అది 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రంలోకి వ‌స్తుంది. అందువ‌ల్ల పై ఉదాహ‌ర‌ణ‌లో 2021 జ‌న‌వ‌రి 15లో ఖాతా తెరిచారు కాబ‌ట్టి 2021 మార్చి 31 నాటికి మొద‌టి ఆర్థిక సంవ‌త్స‌రం పూర్త‌వుతుంది. 2022 ఏప్రిల్ 1 నుంచి మూడో ఆర్థిక సంవ‌త్స‌రం (2022-23) ప్రారంభ‌మ‌వుతుంది కాబ‌ట్టి అప్ప‌టి నుంచి రుణ స‌దుపాయం అందుబాటులో ఉంటుంది. ఆరో ఆర్థిక సంవ‌త్స‌రం అంటే (2026-27) వ‌ర‌కు రుణ స‌దుపాయం అందుబాటులో ఉంటుంది. ఆ త‌ర్వాత నుంచి రుణ స‌దుపాయం అందుబాటులో ఉండ‌దు. ఖాతా ప్రారంభించిన ఏడో సంవ‌త్స‌రం నుంచి పాక్షిక విత్‌డ్రాల‌కు అనుమ‌తిస్తారు.

ఎంత రుణం ల‌భిస్తుంది?

పీపీఎఫ్ ఖాతా ఆరంభించిన రెండో ఏడాది చివరి నాటికి.. ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌లో 25 శాతం వ‌ర‌కు రుణం రూపంలో తీసుకోవ‌చ్చు. లేదా ఎప్పుడు రుణం కోసం దాఖలు చేస్తున్నారో ఆ ఏడాదికి ముందు ఏడాది ఖాతాలో ఉన్న మొత్తంపై 25 శాతం వ‌ర‌కు రుణంగా లభిస్తుంది. ఉదాహరణకు మీరు మొదటి రెండేళ్లు ఏడాదికి రూ.1.50 లక్షలు (గ‌రిష్ఠ ప‌రిమితి) డిపాజిట్ చేస్తే మీ ఖాతాలో వడ్డీతో కలిపి రెండో ఏడాది చివరి నాటికి దాదాపు రూ.3.35 లక్షలు ఉంటాయి. ఇప్పుడు మూడో ఏడాదిలో రుణం కోసం దరఖాస్తు చేస్తే రూ.3.35 లక్షల్లో 25 శాతం, అంటే సుమారుగా రూ.83 వేల వ‌ర‌కు మీకు రుణం లభిస్తుంది. అదే నాలుగు, ఐదు లేదా ఆరో ఏడాదిలో ఖాతాలో జ‌మ అయిన‌ మొత్తం పెరుగుతుంది కాబ‌ట్టి మ‌రింత‌ ఎక్కువ రుణం లభించే అవకాశం ఉంటుంది. అయితే, తీసుకున్న రుణం తిరిగి 36 నెలల్లోపు చెల్లించాల్సి ఉంటుంది. ఒకేసారి ఏక‌మొత్తంగా గానీ, వాయిదాల్లో గానీ తిరిగి చెల్లించవచ్చు.

గ‌మ‌నిక‌: ఇక్క‌డ ఆర్థిక సంవ‌త్స‌రం మొద‌ట్లో పెట్టుబ‌డులు చేస్తే వ‌చ్చే మొత్తాన్ని ప్ర‌స్తుత వ‌డ్డీ రేటు 7.10 శాతం చొప్పున లెక్కించి రెండో సంవ‌త్స‌రం చివ‌రి నాటికి ఖాతాలో ఖాతాలో జ‌మ‌య్యే మొత్తాన్ని లెక్కించ‌డం జ‌రిగింది. పీపీఎఫ్ వడ్డీ ప్రతి నెలా లెక్కించి ఏడాది చివర్లో ఖాతాలో క్రెడిట్ చేస్తారు. అందువ‌ల్ల మీరు ఏ నెల‌లో ఖాతా ప్రారంభించారు? ఏ నెల‌లో ఎంత డిపాజిట్ చేస్తున్నారు? అనేదానిపై ఆధార‌ప‌డి వ‌డ్డీ వ‌స్తుంది. ఇక్క‌డ ఉదాహ‌ర‌ణ కోసం మాత్ర‌మే గ‌రిష్ఠ‌ మొత్తాన్ని తీసుకుని చూపించ‌డం జ‌రిగింది.

వ‌డ్డీ రేటు.. 

పీపీఎఫ్ ఖాతా బ్యాలెన్స్‌ నుంచి ల‌భించే వ‌డ్డీ రేటు కంటే.. రుణంపై 1 శాతం ఎక్కువ వ‌డ్డీని వ‌సూలు చేస్తారు. పీపీఎఫ్ వ‌డ్డీ రేటు మార్పు చెందిన ప్ర‌తిసారీ రుణ వ‌డ్డీ రేటు కూడా అందుకు అనుకూలంగా మారుతుంది. అయితే ఒక వ్య‌క్తి రుణం తీసుకున్న‌ప్పుడు అత‌డు/ఆమెకు ఏదైతే వ‌డ్డీ రేటు వ‌ర్తిస్తుందో.. అది కాలప‌రిమితి పూర్తయ్యేంత వరకు స్థిరంగానే ఉంటుంది. ప్ర‌స్తుతం పీపీఎఫ్ ఖాతాపై 7.10 శాతం వ‌డ్డీ వ‌స్తుంది. కాబ‌ట్టి ఇప్పుడు రుణం తీసుకుంటే 1 శాతం అద‌నంగా, అంటే 8.10 శాతం వ‌ర‌కు వ‌డ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది గృహ రుణంతో పోలిస్తే కాస్త ఎక్కువ అయిన‌ప్ప‌టికీ, వ్య‌క్తిగ‌త రుణాల కంటే త‌క్కువ‌నే చెప్పాలి. తీసుకున్న రుణం మొత్తాన్ని వ‌డ్డీతో స‌హా 36 నెల‌ల్లో చెల్లిస్తే 1 శాతం మాత్ర‌మే అద‌న‌పు వ‌డ్డీ వ‌ర్తిస్తుంది. లేదంటే 1 శాతం బ‌దులుగా 6 శాతం చెల్లించాల్సి ఉంటుంది.

పీపీఎఫ్ ఖాతాలో రుణ మొత్తాన్ని (అస‌లు వ‌డ్డీతో స‌హా) ఒకేసారి చెల్లించొచ్చు. లేదా వాయిదాల్లో చెల్లించ‌వ‌చ్చు. వాయిదాల్లో చెల్లించేవారు అస‌లు మొత్తాన్ని చెల్లించిన త‌ర్వాత‌, దానిపై వ‌ర్తించే వ‌డ్డీని చెల్లించాల్సి ఉంటుంది. వ‌డ్డీ మొత్తాన్ని రెండు లేదా అంత‌కంటే త‌క్కువ వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. కాల‌ప‌రిమితి పూర్తయ్యే  నాటికి అస‌లు చెల్లించి, వ‌డ్డీ చెల్లించ‌లేక‌పోతే.. పీపీఎఫ్ ఖాతా అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ నుంచి ఈ మొత్తాన్ని తీసివేస్తారు. పీపీఎఫ్‌లో ఒక‌సారి తీసుకున్న రుణాన్ని పూర్తిగా చెల్లించిన త‌ర్వాత మాత్ర‌మే రెండోసారి రుణం తీసుకునేందుకు అనుమ‌తిస్తారు.

రుణం తీసుకోవ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నాలు..

  • పీపీఎఫ్ ఖాతాలో రుణం కోసం తాక‌ట్టు అవ‌స‌రం లేదు.
  • తిరిగి చెల్లింపుల‌కు 36 నెల‌ల కాల‌వ్య‌వ‌ధి ఉంటుంది కాబ‌ట్టి సుల‌భంగా రుణం చెల్లించ‌వ‌చ్చు.
  • రుణం మంజూరు చేసిన త‌దుప‌రి నెల నుంచి కాల‌వ్య‌వ‌ధిని లెక్కిస్తారు. అంటే మీరు 2022 జ‌న‌వ‌రి 1లో రుణం తీసుకున్న‌ట్ల‌యితే 2022 ఫిబ్ర‌వ‌రి 1 నుంచి 36 నెల‌ల‌ను లెక్కిస్తారు. 
  • పీపీఎఫ్ ఖాతాపై వ‌ర్తించే వ‌డ్డీ రేటు వ్య‌క్తిగ‌త రుణం, క్రెడిట్ కార్డు రుణంపై వ‌ర్తించే వ‌డ్డీ రేటు కంటే త‌క్కువే ఉంటుంది.
  • రుణ మొత్తాన్ని ఒకేసారి లేదా వాయిదాల్లో చెల్లించే వీలుంది కాబ‌ట్టి మీ వీలును బ‌ట్టి డ‌బ్బు చెల్లించ‌వ‌చ్చు.

ఎందుకు తీసుకోకూడ‌దంటే..?

పీపీఎఫ్ దీర్ఘకాలిక పెట్టుబడి, పదవీ విరమణ వంటి దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల కోసం ఇందులో పెట్టుబ‌డులు పెడుతుంటారు. కాబ‌ట్టి స్వల్పకాలిక అవసరాల కోసం దీర్ఘకాలిక పెట్టుబడులను క‌ద‌ప‌క‌పోతేనే మంచిది. దీనివ‌ల్ల‌ దీర్ఘకాలిక చక్ర వడ్డీ ప్రభావాన్ని కోల్పోతారు. పీపీఎఫ్ ద్రవ్యోల్బణాన్ని అధిగ‌మించిన పన్ను రహిత, రిస్క్ లేని రాబ‌డినిస్తుంది. అందువల్ల ఆర్థిక అవసరాలకు ఇతర ప్రత్యామ్నాయాలను చూడాలి. అంతేకాకుండా, దీనిపై లభించే రుణ మొత్తం కూడా తక్కువగానే ఉంటుంది. మీ అవసరాలకు ఇది సరిపోకపోవచ్చు. అయితే, ప్రత్యామ్నాయం లేనప్పుడు, డబ్బు అత్యవసరం అయినప్పుడు ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని