Updated : 26 Nov 2021 15:19 IST

జీవిత బీమా పాల‌సీ ప్రీమియం ఒక్కొక్కరికీ ఒక్కోలా ఎందుకు..?

ఇంటర్నెట్ డెస్క్‌: బీమా ప‌ట్ల ప్ర‌జ‌ల్లో పెరిగిన అవ‌గాహ‌న‌తో చాలా మంది ఇప్పుడు బీమా పాల‌సీల‌ను కొనుగోలు చేసేందుకు ముందుకు వ‌స్తున్నారు. అయితే, ఒక్కోసారి మీరు, మీ స్నేహితుడు ఒకే బీమా కంపెనీ నుంచి ఒకే ర‌క‌మైన పాల‌సీ తీసుకున్న‌ప్ప‌టీ చెల్లించే ప్రీమియంలో వ్యత్యాసాన్ని మీరు గమనించి ఉంటారు. ఎందుక‌లా జరిగిందని ఎప్పుడైనా ఆలోచించారా? ఇంతకీ ఆ తేడా ఎందుకో ఇప్పుడు చదివేయండి..

బీమా అనేది.. పాల‌సీలో పేర్కొన్న విధంగా అనుకోని సంఘ‌ట‌న ఎదురైన‌ప్పుడు నిర్ధిష్ట ప్రయోజనాలను పాల‌సీదారుడు లేదా అత‌డు/ఆమె కుటుంబానికి అంద‌జేస్తామ‌ని పాల‌సీదారునికి బీమా సంస్థ చేసే వాగ్ధానం. ఉదాహ‌ర‌ణ‌కు ట‌ర్మ్ బీమాను తీసుకున్నప్పుడు అనుకోకుండా పాల‌సీదారుడు మ‌ర‌ణిస్తే అత‌డి కుటుంబానికి హామీ మొత్తం చెల్లించి ఆర్థికంగా చేయూతనందిస్తుంది బీమా సంస్థ‌. అయితే ఒకే బీమా సంస్థ‌లో ఒకేర‌క‌మైన పాల‌సీని ఇద్ద‌రు వ్య‌క్తులు తీసుకున్నప్పటికీ ఇద్ద‌రికీ ప్రీమియం ఒకేవిధంగా ఉండదు. పాల‌సీ తీసుకున్న వ్య‌క్తి జెండర్‌, అతడు/ఆమె స్వీయ‌, కుటుంబ ఆరోగ్య ప‌రిస్థితులతోపాటు, ఆ వ్య‌క్తి జీవ‌న‌శైలి, అభిరుచులు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం వంటివి కూడా ప్రీమియం మొత్తాన్ని ప్ర‌భావితం చేస్తాయి.

పాల‌సీ ర‌కం, పాల‌సీ ప్ర‌యోజ‌నాలు.. ప్రీమియంను ప్ర‌భావితం చేసే అంశాల‌లో అన్నింటికన్నా ముఖ్య‌మైన‌వి. ట‌ర్మ్ పాల‌సీలో పాల‌సీదారుడు మ‌ర‌ణిస్తేనే హామీ మొత్తం చెల్లిస్తారు కాబ‌ట్టి ప్రీమియం త‌క్కువగా ఉంటుంది. అదే ప్రీమియం తిరిగి చెల్లించే పాల‌సీల్లో ప్రీమియం ఎక్కువుంటుంది. పైన తెలిపిన వ్య‌క్తి గ‌త కార‌ణాల‌తో పాటు ఈ కింది కార‌ణాల వ‌ల్ల కూడా ప్రీమియంలో హెచ్చు త‌గ్గులు ఉంటాయి.

పాల‌సీ కాల‌ప‌రిమితి, చెల్లింపుల వ్య‌వ‌ధి: పాల‌సీ తీసుకునే వ్య‌క్తి వ‌య‌సుతో పాటు.. ఎన్ని సంవ‌త్స‌రాలు ప్రీమియం చెల్లిస్తున్నారు? ఎంత కాలం పాల‌సీ క‌వ‌ర‌వుతుంది? అనే అంశాల‌పై కూడా ప్రీమియం ఆధార‌ప‌డి ఉంటుంది. ప్ర‌స్తుతం కొన్ని సంస్థ‌లు దీర్ఘ‌కాల పాల‌సీకి సంబంధించిన‌ పూర్తి ప్రీమియంల‌ను 5 నుంచి 7 సంవ‌త్స‌రాల‌లో చెల్లించే విధంగా అవకాశం ఇస్తున్నాయి. ఇలా చెల్లించ‌డం వ‌ల్ల ప్రీమియం త‌గ్గుతుంద‌ని చెప్తాయి. కానీ నిజానికి ప్రీమియం పెరుగుతుంది.

ఉదాహ‌ర‌ణకు మీరు 40 ఏళ్ల కాల‌వ్య‌వ‌ధితో ట‌ర్మ్ ప్లాన్ తీసుకున్నార‌నుకుందాం. పాల‌సీ తీసుకున్న 5, 6 ఏళ్ల‌లో మొత్తం ప్రీమియం చెల్లిస్తే, ద్ర‌వ్యోల్భ‌ణాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఈ 5, 6 ఏళ్ల‌లో మీరు పెట్టిన పెట్టుబ‌డి మొత్తం 40 ఏళ్ల‌లో చెల్లించాల్సిన‌ ప్రీమియం కంటే అనేక రెట్లు ఎక్కువ ఉంటుంది. అలాగే ట‌ర్మ్ బీమాలో అనుకోకుండా వ్య‌క్తి మ‌ర‌ణిస్తే, అప్ప‌టి నుంచి అతడి కుటుంబం ప్రీమియం చెల్లించ‌న‌వ‌స‌రం లేదు. ఏ ర‌కంగా చూసినా ఇది న‌ష్టం క‌లిగిస్తుంది. కాబ‌ట్టి ఏ సంవ‌త్స‌రానికి ఆ సంవ‌త్స‌రం ప్రీమియం చెల్లించ‌డం మంచిది. వైక‌ల్యం లేదా మ‌ర‌ణం, అనారోగ్యం వంటి క‌వ‌ర్‌ల‌ను పాల‌సీతోపాటు అంత‌ర్గంగా తీసుకుంటే కూడా ప్రీమియం పెరుగుతుంది. 

జీవన శైలి: పాల‌సీదారుడు నివ‌సిస్తున్న ప్రాంతం, ప‌నిచేస్తున్న ప్ర‌దేశం కూడా ప్రీమియంను ప్ర‌భావితం చేస్తుంది. రిస్క్ ఎక్కువ‌గా ఉండే ప్రాంతంలో, అలాగే మెరుగైన జీవన ప్రమాణాలు, స‌దుపాయాలు లేని ప్రాంతం, రిస్క్ ఎక్కువ‌గా ఉన్న ఉద్యోగాలు చేసే వారి ప్రీమియం కొంచెం ఎక్కువ ఉండే అవ‌కాశం ఉంటుంది.

వైద్య ప‌రీక్ష‌లు: కొన్నిసార్లు ఎలాంటి వైద్య ప‌రీక్ష లేకుండానే లేదా పాయింట్ ఆఫ్ సేల్‌గా పాల‌సీ జారీ చేస్తారు. ఇటువంటి పాల‌సీల్లో అండర్ రైటింగ్ తక్కువగా ఉంటుంది కాబట్టి అధిక ప్రీమియంల‌కు దారితీయ‌వ‌చ్చు.

పాల‌సీ జారీ ఖ‌ర్చు: పాల‌సీ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే ప్రీమియం త‌క్కువ ఉంటుంది. దీనికి కార‌ణం ఆన్‌లైన్‌లో వ్య‌క్తి నేరుగా సంస్థ నుంచి పాల‌సీ కొనుగోలు చేస్తాడు. ఏజెంట్ లేదా మ‌ధ్య‌వ‌ర్తి ఉండ‌డు కాబ‌ట్టి కమీష‌న్ మొత్తం ఆదా అవుతుంది. దీంతో ఖ‌ర్చు త‌గ్గి ఆ ప్ర‌యోజ‌నాన్ని పాల‌సీదారునికి అందిస్తాయి బీమా సంస్థ‌లు. బీమా పాల‌సీలు మీ జీవితాల‌కు అందించే ర‌క్ష‌ణ అమూల్య‌మైన‌ది.

గమనిక: బీమా పాలసీ ఎంచుకునేటప్పుడు ప్రీమియం మాత్రమే కాకుండా కంపెనీ సెటిల్మెంట్ నిష్పత్తి, ఇతర సేవలు లాంటి వాటిని కూడా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది.

Read latest Business News and Telugu News

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని