TCSలో భారీగా మహిళా ఉద్యోగుల వలసలు.. కారణమిదే!

టీసీఎస్‌కు మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున రాజీనామా చేస్తున్నారు. వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌కు టీసీఎస్‌ స్వస్తి పలకడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

Published : 13 Jun 2023 19:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాటా గ్రూప్‌నకు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS)కు కొత్త సమస్య ఎదురైంది. సంస్థలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు (Female Employees) పెద్ద ఎత్తున ఉన్నట్టుండి కంపెనీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. ఇందుకు వేరే కారణాలు ఉన్నప్పటికీ.. కొవిడ్‌ సమయంలో ఇచ్చిన వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ సంస్కృతికి టీసీఎస్‌ స్వస్తి పలకడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని తేలింది. కంపెనీనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది.

సంస్థలో భారీ సంఖ్యలో మహిళా ఉద్యోగులు వైదొలగడాన్ని అసాధారణ పరిస్థితిగా టీసీఎస్‌ చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఆఫీసర్‌ మిలింద్‌ లక్కడ్‌ పేర్కొన్నారు. కంపెనీలో పని సంస్కృతి, ఇతరులతో కలిసి పనిచేయాలన్న ఉద్దేశంతో వర్క్‌ ఫ్రమ్‌ ఆఫీసును తాము ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అయితే, వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ లేకపోవడం వల్ల మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో సంస్థను వీడుతున్నారని ఇటీవల వెలువరించిన వార్షిక నివేదికలో ఆయన అభిప్రాయపడ్డారు.

సాధారణంగా ఇతర కంపెనీలతో పోలిస్తే టీసీఎస్‌లో మహిళలకు ప్రాతినిధ్యం ఎక్కువ ఉంటుంది. జెండర్‌ డైవర్సిటీకి ప్రాధాన్యం ఇచ్చే టీసీఎస్‌లో 2022 డిసెంబర్‌ నాటికి మొత్తం ఉద్యోగుల్లో  మహిళా ఉద్యోగుల వాటా 35 శాతంగా ఉంది. కొంతకాలం క్రితం వరకు మహిళా ఉద్యోగుల వలసల రేటు పురుషుల కంటే తక్కువ లేదంటే వారితో సమానంగా ఉండేది. 2023 ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఈ సంఖ్య భారీగా పెరిగిందని లక్కడ్‌ తెలిపారు. దీంతో కంపెనీ మహిళా ప్రాతినిధ్యం పెంచాలన్న టీసీఎస్‌ ఆశయాలకు ఈ రాజీనామాల పర్వం గండికొడుతోంది. అయితే, వలసల రేటు ఎంతనేది మాత్రం టీసీఎస్‌ వెల్లడించలేదు. మరోవైపు ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేందుకు ఐటీ కంపెనీలు చాలా కష్టపడుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు