GST: జీఎస్టీ 5% శ్లాబు ఎత్తివేతపై నిర్ణయం తీసుకున్నారా?

జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణపై ఏర్పాటైన మంత్రుల బృందం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అధికారిక వర్గాలు తెలిపాయి....

Published : 19 Apr 2022 14:09 IST

దిల్లీ: జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణ (GST Rationalisation)పై ఏర్పాటైన మంత్రుల బృందం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. జీఎస్టీ శ్లాబుల మార్పులు సహా ఇతర సవరణలపై కేంద్ర ప్రభుత్వం గత ఏడాది కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ ఎస్‌ బొమ్మై నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో పశ్చిమ బెంగాల్‌, కేరళ, గోవా, బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ వచ్చే నెల ఆరంభంలో భేటీ కానుంది.

ఐదు శాతం శ్లాబుని 8 శాతం శ్లాబుగా మార్చాలన్న ప్రతిపాదనను మంత్రుల బృందం ఇంకా పరిగణనలోకి తీసుకోలేదని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ కమిటీ చేసే సిఫార్సులన్నింటినీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సహా రాష్ట్రాల ప్రతినిధులు సభ్యులుగా ఉన్న జీఎస్టీ మండలి ముందు పెడతామని పేర్కొన్నారు. రేట్ల సవరణ రాజకీయ అంశాలతో ముడిపడిన అంశమని అభిప్రాయపడ్డారు. పైగా నిత్యావసరాల ధరలు పెరిగిన నేపథ్యంలో రేట్లలో మార్పుపై ఆచితూచి నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు. ఇప్పటి వరకు మండలి సమావేశానికి సంబంధించిన తేదీలను ఖరారు చేయలేదు. మే ద్వితీయార్ధంలో భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం.

జీఎస్టీ విధానంలో 5 శాతం శ్లాబును ఎత్తివేసి ఈ పరిధిలో ఉన్న కొన్ని వస్తువులను 3 శాతానికి, మిగిలిన వాటిని 8 శాతం విభాగాలకు మార్చే అవకాశం ఉందని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జీఎస్‌టీ విధానంలో 5%, 12%, 18%, 28% పన్ను రేట్లు ఉన్నాయి. పసిడి, పసిడి ఆభరణాలపై 3% పన్ను విధిస్తున్నారు. అన్‌బ్రాండెడ్‌, అన్‌ప్యాక్డ్‌ ఆహార వస్తువులకు పన్ను మినహాయింపు ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని