RBI: కరెన్సీనోట్లపై గాంధీ ఫొటో మార్పు.. క్లారిటీ ఇచ్చిన ఆర్‌బీఐ

కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ పొటోను మార్చి కొత్త నోట్లను ముద్రించనున్నారంటూ వస్తోన్న వార్తలను భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఖండించింది. అలాంటి ప్రతిపాదనేదీ లేదని తేల్చి చెప్పింది.

Updated : 06 Jun 2022 18:25 IST

ముంబయి: కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ పొటోను మార్చి కొత్త నోట్లను ముద్రించనున్నారంటూ వస్తోన్న వార్తలను భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఖండించింది. అలాంటి ప్రతిపాదనేదీ లేదని తేల్చి చెప్పింది.

కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ చిత్రానికి బదులుగా రబీంద్రనాథ్‌ ఠాగూర్‌, అబ్దుల్‌ కలాం వంటి ప్రముఖుల ఫొటోలతో కొత్త బ్యాంకు నోట్లను తీసుకొచ్చేందుకు ఆర్‌బీఐ, ఆర్థిక శాఖ సన్నాహాలు చేస్తున్నట్లు కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించి ప్రణాళికలు, డిజైన్లు కూడా పూర్తయినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి.

దీంతో ఈ వార్తలపై స్పందించిన కేంద్ర బ్యాంకు వదంతులను కొట్టిపారేసింది. ఈ మేరకు నేడు ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘ప్రస్తుతమున్న కరెన్సీ నోట్లకు మార్పులు చేస్తున్నామని, గాంధీ ఫొటోకు బదులుగా ఇతరుల చిత్రాలతో నోట్లను ముద్రించనున్నామని కొన్ని మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. కానీ, అలాంటి ప్రతిపాదనేదీ లేదు’’ అని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని