Passenger vehicle retail sales: పుంజుకున్న చిప్‌ల సరఫరా.. పెరిగిన వాహన విక్రయాలు!

సెమీకండక్టర్ల సరఫరా మెరుగుపడడంతో జూన్‌ నెలలో ప్రయాణికుల వాహన రిటైల్‌ విక్రయాలు పెరిగాయి...

Published : 05 Jul 2022 13:11 IST

దిల్లీ: సెమీకండక్టర్ల సరఫరా మెరుగుపడడంతో జూన్‌ నెలలో ప్రయాణికుల వాహన రిటైల్‌ విక్రయాలు పెరిగాయి. విక్రయాల్లో దాదాపు 40 శాతం వృద్ధి నమోదైనట్లు వాహన పరిశ్రమ సమాఖ్య ఫాడా తెలిపింది. గత ఏడాది జూన్‌లో 1,85,998 యూనిట్లు అమ్ముడు కాగా.. ఈసారి ఆ సంఖ్య 2,60,683కు చేరింది. అయితే, సెమీకండక్టర్ల కొరత ఇంకా పూర్తిగా తొలగిపోకపోవడంతో కాంపాక్ట్‌ ఎస్‌యూవీ, ఎస్‌యూవీ కార్ల కోసం మాత్రం చాలాకాలం వేచి చూడాల్సి వస్తోందన్నారు. అయినప్పటికీ ముందస్తు బుకింగ్‌లు ఏమాత్రం తగ్గడం లేదన్నారు.

ద్విచక్ర వాహనాల రిటైల్‌ విక్రయాలు గత నెల 20 శాతం పెరిగి 11,19,096 యూనిట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది జూన్‌ నెలలో ఈ సంఖ్య 9,30,825 యూనిట్లుగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో గిరాకీ నెమ్మదించడం, ధరలు పెరగడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు విక్రయాలపై ప్రభావం చూపాయని ఫాడా అధ్యక్షుడు వింకేశ్‌ గులాటీ తెలిపారు. అందువల్లే ద్విచక్రవాహన విక్రయాలు కాస్త నెమ్మదించాయని తెలిపారు.

వాణిజ్య వాహనాల రిటైల్ విక్రయాలు కూడా జూన్‌లో 89 శాతం వృద్ధితో 67,696 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది జూన్‌లో 14,735 యూనిట్ల నుంచి త్రిచక్ర వాహన రిజిస్ట్రేషన్లు గత నెలలో 46,040 యూనిట్లకు పెరిగాయి. అంతేకాకుండా, ట్రాక్టర్ రిటైల్ అమ్మకాలు కూడా జూన్ 2021లో 52,289 యూనిట్లతో పోలిస్తే గత నెలలో 10 శాతం పెరిగి 57,340 యూనిట్లుగా నమోదయ్యాయి. జూన్‌లో మొత్తం వాణిజ్య వాహనాల రిటైల్ విక్రయాలు 27 శాతం పెరిగి 15,50,855 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇది 12,19,657 యూనిట్లుగా ఉన్నాయి. అయితే, జూన్ 2019, కరోనా వెలుగులోకి రావడానికి ముందు నెలతో పోల్చినప్పుడు, గత నెల మొత్తం అమ్మకాలు ఇప్పటికీ 9 శాతం తగ్గాయని గులాటీ పేర్కొన్నారు.

దాదాపు అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో సామాన్యుల కుటుంబ బడ్జెట్‌పై ఒత్తిడి పడిందని గులాటీ అన్నారు. పైగా అధిక ఇంధన ధరలు రవాణాను ఖరీదుగా మార్చాయన్నారు. ఈ ప్రభావం వాహన విక్రయాలపై కూడా ఉందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని