పదవీ విరమణ అనంతరం ఉత్తమంగా జీవించడానికి మార్గాలు

ఉదాహరణకు ప్రకాష్ తండ్రి 15 సంవత్సరాల క్రితం వారి సొంత పట్టణంలోని ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయునిగా పదవీ విరమణ చేశారు. చాలా మంది వారు మంచి జీవితాన్ని అనుభవిస్తున్నారని భావిస్తున్నారు.....

Updated : 02 Jan 2021 14:48 IST

ఉదాహరణకు ప్రకాష్ తండ్రి 15 సంవత్సరాల క్రితం వారి సొంత పట్టణంలోని ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయునిగా పదవీ విరమణ చేశారు. చాలా మంది వారు మంచి జీవితాన్ని అనుభవిస్తున్నారని భావిస్తున్నారు. అయితే వాస్తవానికి, అతని తల్లిదండ్రులు ప్రకాష్ మీద ఆధారపడి జీవిస్తున్నారు, ప్రత్యేకించి అతని తల్లికి నాలుగు సంవత్సరాల క్రితం ముఖ్యమైన శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. ఇప్పుడు అతని తండ్రి గుండె సంబంధిత చికిత్స చేయించుకున్నారు. అతని తండ్రికి వచ్చే పెన్షన్ వారి జీవన వ్యయాలకు, కొన్ని సాధారణ వైద్య ఖర్చులుకు సరిపోతుంది. కానీ వీటికి మించి ఏవైనా ఖర్చులు అయితే క‌చ్చితంగా వారు ప్రకాష్ పై ఆధారపడవలసి ఉంటుంది. సుమారు 40 సంవత్సరాల దగ్గరలో ఉన్న ప్రకాష్ ముఖ్య లక్ష్యం. ప‌ద‌వీవిర‌మ‌ణ అనంత‌రం తాను, త‌న భార్య స్వతంత్రమైన జీవితం గడిపేలా ప్రణాళికను రూపొందించుకోవడం. ప్రస్తుత రోజుల్లో ప్రకాష్ లాగా చాలామంది ఉద్యోగస్తులు వృద్ధాప్యంలో ఎవరి మీద ఆధారపడకుండా జీవించాలని కోరుకుంటున్నారు. సరైన సమయంలో, సరైన ప్రణాళికను రూపొందించుకోవడం ద్వారా, ప్రతి ఒక్కరూ తమ జీవనశైలికి అనుగుణంగా సౌకర్యవంతమైన పదవీవిరమణ జీవితాన్ని గ‌డ‌ప‌వ‌చ్చు.

ప్రశాంతమైన పదవీవిరమణ కోసం దృష్టి కేంద్రీకరించవలసిన మూడు ముఖ్యమైన విషయాలను కింద చూద్దాం :

  1. ఆరోగ్య అవసరాల కోసం సిద్ధంగా ఉండడం

పాత రోజుల్లో ఆరోగ్యం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండేది కాదు. ఆలాగే ఆరోగ్య ఖర్చులకు ఎక్కువ వ్యయం కూడా అయ్యేది కాదు.
వైద్య రంగంలో అభివృద్ధి, సాంకేతిక‌త వ‌ల్ల‌ వైద్య ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఒకవేళ మీకు క్లిష్టమైన రోగాలు వచ్చినప్పుడు మీరు అప్పటివరకు పొదుపు చేసుకున్న మొత్తంలో ఎక్కువ భాగాన్ని వైద్యం కోసం ఖర్చు పెట్టవలసి ఉంటుంది.

పదవీ విరమణ సమయంలో ఆరోగ్య ఖర్చులు కోసం కొంత మొత్తాన్ని సిద్ధం చేసుకోడానికి మూడు విషయాలను తెలుసుకోవడం మంచిది :

a. మీకు, మీ భార్య కోసం తగిన ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేయండి. చిన్న వయస్సులో ఆరోగ్య బీమా తీసుకోవడం ద్వారా తక్కువ ప్రీమియం, ఎక్కువ కవరేజ్, డిస్కౌంట్లు మొదలైనవి పొందవచ్చు.

b. గుండె జబ్బు, స్ట్రోక్, క్యాన్సర్, కిడ్నీ వైఫల్యం వంటి ప్రధాన వ్యాధుల చికిత్సకు సరిపోయేంత మొత్తంతో క్లిష్టమైన ఆరోగ్య బీమాను తీసుకోండి.

c. మెడికల్ ఖర్చులు కోసం మీకు పొందిన పదవీ విరమణ ఫండ్ లోని కొంత భాగాన్ని కేటాయించండి.

  1. తెలివిగా ప్లాన్ చేసి తగినంత ఆదా చేసుకోండి.

పదవీవిరమణ అనంత‌ర జీవ‌నం చాలా ముఖ్య‌మైన‌ది. కాబ‌ట్టి దాని కోసం మీరు ప్రణాళికను రూపొందించుకోవాలి. భారతీయ కుటుంబం, సమాజ విలువలు మీ పిల్లల విద్య, వివాహం కోసం పొదుపు చేయాలనే బాధ్యతను కలిగించేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పదవీ విరమణ అవసరాలను పిల్లల విద్య, వివాహం కంటే ముఖ్యమైన లక్ష్యంగా చూడాలి. మీ పొదుపు, పెట్టుబడులకు అనుగుణంగా ప్రణాళికను రూపొందించుకోవాలి.

పదవీవిరమణ‌ కోసం ఎంత మొత్తాన్ని పొదుపు చేయాలనేది, పదవీ విరమణ సమయానికి ఎంత మొత్తం నిధిని కలిగి ఉన్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ కార్పస్ అనేది పదవీ విరమణ అనంతరం మీ జీవ‌నానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. మీ ప్రస్తుత జీవన వ్యయాలు (ఈఏంఐ లను మినహాయించి, పిల్లలపై చేసే ఖర్చు, ప్రయాణం), పదవీ విరమణకు మిగిలివున్న సంవత్సరాలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. నెలసరి ఆదాయంలో 20 శాతం పొదుపు చేయాలనీ లక్ష్యంగా పెట్టుకోండి. అలాగే ఇతర బాధ్యతలను జాగ్రత్తగా చూసుకుంటూ పొదుపును 40 నుంచి 50 శాతానికి పెంచుకోండి. వ్యక్తిగత పరిస్థితుల ఆధారంగా పొదుపు చేసే శాతం ఒక్కో వ్యక్తికి ఒక్కోలా ఉంటుంది.

  1. పదవీ విరమణకు ముందు తెలివిగా పెట్టుబడి పెట్టండి

15 నుంచి 25 సంవత్సరాల పదవీ విరమణ కోసం అవసరమైన వ్యయాలను కవర్ చేయడానికి కేవలం కష్టపడి పొదుపు చేసిన మొత్తం ఒక్కటే సరిపోదు. పొదుపు చేసిన మొత్తాన్ని పెంచుకోవడానికి తెలివిగా, సరైన పెట్టుబడి మార్గాల్లో పెట్టుబడిగా పెట్టాలి. ఒకవేళ మీరు పదవీ విరమణకు 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉన్నట్లయితే, మీరు పొదుపు చేసుకున్న మొత్తంలో కొంత భాగాన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టండి. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ప్రణాళికలను రూపొందించుకునే సమయంలో, ద్రవ్యోల్బణాన్ని మించిన రాబ‌డిని అందించే పెట్టుబ‌డుల‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఈక్విటీ ఫండ్లు ఆ కోవ‌కు చెందిన‌వే.

పదవీ విరమణ చేసిన తర్వాత, మీరు పొందిన నిధిని ఎందులో పెట్టుబడి పెట్టాలనే విషయంలో తెలివైన నిర్ణయం తీసుకోవడం చాలా కీలకమైన విషయం. బ్యాంకు సిబ్బంది, ఏజెంట్లు సూచించిన పెట్టుబడి ఆప్షన్ల విషయంలో జాగ్రత్త వహించండి.

ప‌ద‌వీ విర‌మ‌ణ అనంత‌రం మీరు ఉద్యోగ స‌మయంలో పొదుపు చేసిన నిధి నుంచి క్రమ పద్ధతిలో కొంత మొత్తాన్ని ఉపసంహరిస్తూ ఉంటారు. దానిని జాగ్రత్తగా సరైన పెట్టుబడి మార్గంలోకి తరలించండి.

ఒక మంచి ఆర్థిక ప్రణాళికాదారుని సంప్రదించడం ద్వారా ప్ర‌ణాళిక ను క‌చ్చితంగా వేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. వారు మీ వ్యక్తిగత లక్ష్యాలను, ఆర్థిక పరిస్థితిని అధ్యయనం చేసి లక్ష్యాలను సాధించడానికి ఒక రోడ్ మ్యాప్ ను రూపొందించడంలో సహాయం చేస్తారు. పెట్టుబ‌డి ప‌థ‌కాల‌ను ఎంచుకోవ‌డంలోనూ, మీ ఆర్థిక పురోగతిని పర్యవేక్షించడంలో మీకు సహాయం చేస్తారు. అవసరమైతే మార్పులు కూడా చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని