RBI Repo rate: ఊహించిందే జరిగింది.. వడ్డీరేట్లు పెరిగాయ్‌!

ఊహించినట్లుగానే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక వడ్డీరేట్లను మరోసారి పెంచింది....

Updated : 08 Jun 2022 17:02 IST

ముంబయి: ఊహించినట్లుగానే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక వడ్డీరేట్లను మరోసారి పెంచింది. అధిక ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు రెపో రేటు (Repo Rate)ను పెంచుతున్నట్లు ప్రకటించింది. సోమవారం ప్రారంభమైన పరపతి విధాన కమిటీ (MPC) మూడు రోజుల సమావేశ నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ (Shaktikanta Das) బుధవారం ప్రకటించారు.

రెపో రేటు (Repo Rate)ను గత నెలలోనే 40 బేసిస్‌ పాయింట్ల మేర పెంచగా, తాజాగా మరో 50 బేసిస్‌ పాయింట్లు పెంచారు. దీంతో రెపో రేటు (Repo Rate) 4.90 శాతానికి చేరింది. అధిక ద్రవ్యోల్బణం (Inflation) దృష్ట్యా ద్రవ్య విధాన వైఖరిని క్రమక్రమంగా కఠినతరం చేయనున్నట్లు ఆర్‌బీఐ (RBI) గతంలోనే సంకేతాలిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆర్‌బీఐ (RBI) ఆ దిశగానే నిర్ణయాలు తీసుకుంది. ఇలా క్రమంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఆర్‌బీఐ రెపో రేటును 5.6 శాతానికి చేరుస్తుందన్న అంచనాలు వెలువడుతున్నాయి.

వరుస పెంపునకు కారణాలివే..

పరపతి విధాన నిర్ణయాలకు ఆర్‌బీఐ పరిగణనలోకి తీసుకునే రిటైల్‌ ద్రవ్యోల్బణం (Retail Inflation) ఏప్రిల్‌లో 7.79 శాతానికి చేరింది. ఇది ఎనిమిదేళ్ల గరిష్ఠ స్థాయి. ఈ నేపథ్యంలో కీలక రేట్ల పెంపు ఎక్కువగా ఉండొచ్చనే అభిప్రాయాన్ని మార్కెట్‌ నిపుణులు ముందే వ్యక్తం చేశారు. అయితే ద్రవ్యోల్బణం (Inflation) పెరగడానికి కమొడిటీలు, ముడి చమురు ధరలే కారణం. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాలు ఇందుకు అధిక కారణమన్నది గమనార్హం. టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 13 నెలలుగా రెండంకెల స్థాయిల్లో నమోదవుతూ, ఏప్రిల్‌లో రికార్డు గరిష్ఠమైన 15.08 శాతాన్ని చేరింది. ఇవన్నీ రేట్ల పెంపునకు దారితీసిన అంశాలే. 2022లో ఇప్పటివరకు అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాల్లో 45 దేశాల కేంద్ర బ్యాంకులు కీలక రేట్లను పెంచాయి. తాజాగా ఆస్ట్రేలియా బ్యాంకు మంగళవారం వడ్డీరేట్లను 2 శాతం మేర పెంచింది.

పెరగనున్న ఈఎంఐల భారం..

కీలక వడ్డీ రేట్లను ఆర్‌బీఐ సవరించిన నేపథ్యంలో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సైతం వడ్డీ రేట్లను పెంచనున్నాయి. ముఖ్యంగా గృహ వినియోగదారులకు ఈఎంఐ భారం కానుంది. ఇక ఇప్పటికే రుణం తీసుకున్న వారికి బ్యాంకులు ఈఎంఐలలో ఎలాంటి మార్పూ చేయనప్పటికీ ఈఎంఐలు కట్టాల్సిన నెలల సంఖ్య పెరుగుతుంది. ఆ లెక్కన సుదీర్ఘకాలం పాటు ఈఎంఐలు కట్టినప్పుడు ఆ విధంగా కట్టే వడ్డీ మొత్తం పెరుగుతుంది.

ఎంపీసీలో తీసుకున్న మరిన్ని కీలక నిర్ణయాలు...

* మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ (MSF), బ్యాంకు రేటును 4.65% నుంచి 5.15% పెంచారు.

* కరోనా సంక్షోభం నేపథ్యంలో అనుసరించిన సర్దుబాటు వైఖరిని పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఆర్‌బీఐ నిర్ణయించింది.

* రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణాన్ని లక్షిత పరిధి అయిన 6 శాతానికి తీసుకొచ్చే విధంగానే తమ నిర్ణయాలు ఉంటాయని శక్తికాంత దాస్‌ స్పష్టం చేశారు.

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి మూడు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణ లక్షిత పరిధి అయిన 6 శాతానికి ఎగువనే ఉండనున్నట్లు ఎంపీసీ అంచనా వేసింది.

* పట్టణ ప్రాంతాల్లో గిరాకీ పుంజుకోగా.. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నట్లు శక్తికాంత దాస్‌ తెలిపారు.

* సాధారణ వర్షపాతం వల్ల ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని ఆర్‌బీఐ అంచనా వేసింది.

* రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదని గవర్నర్‌ తెలిపారు. తాజాగా టమాటాలు, ముడి చమురు ధరలు పెరగడాన్ని ఈ సందర్భంగా ఉటంకించారు.

* 2022-23 ద్రవ్యోల్బణ అంచనాలను ఆర్‌బీఐ 5.7 శాతం నుంచి 6.7 శాతానికి పెంచింది. తొలి త్రైమాసికం (క్యూ1)లో 7.5 శాతం, క్యూ2లో 7.4 శాతం, క్యూ3లో 6.2 శాతం, క్యూ4లో 5.8 శాతం ఉండనున్నట్లు అంచనా వేసింది.

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటును 7.2 శాతంగా అంచనా వేశారు.

* అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు ఇప్పటికీ దేశీయ ఆర్థిక వ్యవస్థకు సవాల్‌ విసురుతున్నాయని శక్తికాంత దాస్‌ తెలిపారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం వల్లే సరఫరా వ్యవస్థల్లో ఇబ్బందులు తలెత్తి ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరిగిందని వివరించారు.

* గ్రామీణ సహకార బ్యాంకులు కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌కు రుణాలిచ్చేందుకు ఆర్‌బీఐ అనుమతిస్తున్నట్లు గవర్నర్‌ ప్రకటించారు.

* పట్టణ సహకార బ్యాంకులు ఇంటివద్దకే బ్యాంకింగ్‌ సేవలను ప్రారంభించేందుకు ఆర్‌బీఐ అనుమతిచ్చింది.

* క్రెడిట్‌ కార్డులను యూపీఐ ప్లాట్‌ఫామ్స్‌కు అనుసంధానించాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది.

* డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేసేలా ఆర్‌బీఐ పలు చర్యలను ప్రకటించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని