Recurring deposit: రికరింగ్ డిపాజిట్ చేయాల‌నుకుంటున్నారా? ఇవి తెలుసుకోండి..

భారత్‌లోని దాదాపు అన్ని ప్ర‌భుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, బ్యాంకింగేత‌ర సంస్థ‌లు ఆర్‌డీ ఖాతాను అందిస్తున్నాయి.

Updated : 13 Apr 2022 15:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రికరింగ్ డిపాజిట్‌ (ఆర్‌డీ) ఖాతాతో వినియోగ‌దారులు సుల‌భంగా డ‌బ్బు ఆదా చేయ‌వ‌చ్చు. ప్ర‌తినెలా తమకు నచ్చిన మొత్తాన్ని, ఎంచుకున్న కాల‌ప‌రిమితికి పెట్టుబ‌డులు పెట్టే సౌల‌భ్యాన్ని అందిస్తుంది. భారత్‌లోని దాదాపు అన్ని ప్ర‌భుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, బ్యాంకింగేత‌ర సంస్థ‌లు ఆర్‌డీ ఖాతాను 6 నెలల నుంచి 10 సంవత్సరాల వ‌ర‌కు వివిధ‌ కాలపరిమితుల‌తో అందిస్తున్నాయి. సాధారణంగా వడ్డీ రేటు.. సాధారణ పౌరులకు ఏడాదికి 3.50 - 5.50 శాతం వరకు ఉంటుంది. సీనియర్ సిటిజన్ల‌కు అన్ని కాలవ్య‌వ‌ధుల‌కు 0.50 - 0.80 శాతం వరకు అదనపు వడ్డీ ల‌భిస్తుంది.

ఆర్‌డీ ఖాతా తీసుకున్న వారు ముందుగా నిర్ణయించిన కాల‌వ్య‌వ‌ధిలో ముందుగానే నిర్ణ‌యించిన మొత్తాన్ని పెట్టుబ‌డులు పెట్టాల్సి ఉంటుంది. పెట్టుబడి పెట్టిన మొత్తంపై స్థిర వడ్డీ వ‌స్తుంది. కాల‌వ్య‌వ‌ధి ముగిసిన త‌ర్వాత మెచ్యూరిటీ మొత్తాన్ని (పెట్టుబ‌డి + సేక‌రించిన వ‌డ్డీ) చెల్లిస్తారు. 

ఫీచ‌ర్లు, ప్ర‌యోజ‌నాలు..

  • క్ర‌మ‌శిక్ష‌ణ‌తో నిర్ణీత స‌మ‌యానికి పొదుపు చేయడం అలవాటు చేస్తుంది.
  • వ్య‌క్తులు, 10 ఏళ్ల పైన వ‌య‌సున్న మైన‌ర్లు (గార్డియ‌న్ సంర‌క్ష‌ణ‌లో) ఖాతాను తెర‌వ‌చ్చు.
  • క‌నీస మొత్తం బ్యాంకు, బ్యాంకుకి మారుతుంది. కనీస కాల‌వ్య‌వ‌ధి 6 నెల‌లు, గ‌రిష్ఠ కాల‌వ్య‌వ‌ధి 10 సంవ‌త్స‌రాలు
  • వ‌డ్డీ రేటు బ్యాంకులు అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్ రేటుతో స‌మానంగా ఉంటుంది.
  • ముంద‌స్తు విత్‌డ్రాల‌ను అనుమ‌తించ‌రు.
  • ఆర్‌డీ డిపాజిట్‌పై రుణం పొందే వీలుంది. డిపాజిట్ విలువ‌లో 80 నుంచి 90 శాతం రుణం పొందొచ్చు. అయితే, ఇది అన్ని బ్యాంకుల‌కు ఒకే విధంగా ఉండ‌దు.
  • పొదుపు లేదా క‌రెంట్ ఖాతా నుంచి ప్ర‌తి నెలా నిర్ధిష్ట మొత్తాన్ని బ‌దిలీ చేయాలని ఖాతాదారులు బ్యాంకుల‌కు సూచ‌న‌లు చేయొచ్చు.

ఆర్‌డీ ఖాతా తెరిచే ముందు ఈ  విష‌యాలు తెలుసుకోండి..

కాల‌ప‌రిమితి: బ్యాంకులు వివిధ కాల‌ప‌రిమితుల‌తో ఆర్‌డీ ఖాతాను అందిస్తుంటాయి. ముఖ్యంగా ఇందులో మూడు ర‌కాల కాల‌వ్య‌వ‌ధులు అందుబాటులో ఉంటాయి. 
1. స్వ‌ల్ప‌వ్య‌వ‌ధి..ఆరు నెల‌ల నుంచి ఒక సంవ‌త్స‌రం లోపు మెచ్యూరిటీ పిరియ‌డ్‌తో కూడిన డిపాజిట్లు స్వ‌ల్ప‌వ్య‌వ‌ధి డిపాజిట్ల కింద‌కి వ‌స్తాయి.
2. మ‌ద్య‌స్థ కాల‌వ్య‌వ‌ధి.. ఏడాది పైన, 5ఏళ్ల లోపు డిపాజిట్లు
3. దీర్ఘ‌కాల వ్య‌వ‌ధి.. 5ఏళ్ల పైన, 10 ఏళ్లలోపు డిపాజిట్లు
మీరు ఆర్‌డీ ఖాతాను ఏ ల‌క్ష్యం కోసం డ‌బ్బు స‌మకూర్చుకునేందుకు తెరుస్తున్నారు? అందుకు ఉన్న కాల‌ప‌రిమితుల‌ను అంచ‌నావేసి త‌ద‌నుగుణంగా కాల‌ప‌రిమితిని ఎంచుకోవాలి. 

వ‌డ్డీరేటు: ఆర్‌డీ ఖాతా వ‌డ్డీ రేటు మీరు ఎంచుకున్న బ్యాంక్‌, కాల‌వ్య‌వ‌ధుల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. సాధార‌ణంగా స్వ‌ల్ప కాల‌, దీర్ఘ‌కాల వ్య‌వ‌ధుల కంటే మ‌ధ్య‌స్థ కాల‌వ్య‌వ‌ధి గ‌ల డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేటు ఎక్కువ ఉండే అవ‌కాశం ఉంటుంది. అందువ‌ల్ల ఖాతాను తెరిచేముందు వివిధ బ్యాంకులు ఆఫ‌ర్ చేస్తున్న వ‌డ్డీ రేట్ల‌ను ముందుగా తెలుసుకోవాలి.

పాక్షిక విత్‌డ్రాలు: ఆర్‌డీ ఖాతాపై బ్యాంకులు పాక్షిక విత్‌డ్రాల‌ను అనుమ‌తించ‌వు. అయితే, రుణ స‌దుపాయంతో పాటు ఓవ‌ర్‌డ్రాఫ్ట్ స‌దుపాయాన్ని కూడా కొన్ని బ్యాంకులు అందిస్తున్నాయి. 

ఖాతా మధ్యలో నిలిపేస్తే?
ఖాతాను మధ్యలో నిలిపివేస్తే.. బ్యాంకులు జరిమానా విధిస్తాయి. సాధారణంగా ఇచ్చే వడ్డీ రేట్ల కంటే తక్కువగా వ‌డ్డీ అందిస్తాయి. ఇప్పుడు రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేటు 5 శాతం అనుకుంటే, గడువు ముగియక ముందే విత్‌డ్రా చేసుకుంటే 4 శాతం వడ్డీ రేటు మాత్ర‌మే ల‌భించ‌వ‌చ్చు. పెనాల్టీ కూడా మీకు ఖాతా ఉన్న బ్యాంకు నియ‌మాల‌ను అనుస‌రించి 1 శాతం నుంచి 2 శాతం వ‌ర‌కు ఉండొచ్చు. ప్ర‌తి నెలా నిర్ణీత స‌మ‌యానికి డ‌బ్బు డిపాజిట్ చేయ‌క‌పోయిన‌ప్ప‌టికీ పెనాల్టీ వ‌ర్తిస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలో సమయానికి డిపాజిట్ చేయకపోతే నెలకు రూ.100 కి రూ.150 వ‌ర‌కు జరిమానా విధిస్తారు.

ముంద‌స్తు విత్‌డ్రా సౌల‌భ్యం..
దాదాపు అన్ని బ్యాంకులు ఆర్‌డీ ఖాతాల‌ను అందిస్తున్న‌ప్ప‌టికీ కొన్ని మాత్ర‌మే ముందుస్తు విత్‌డ్రాల‌ను కొంత పెనాల్టీతో అనుమతిస్తున్నాయి. ఎంతకాలం ఖాతా కొన‌సాగించారనే దానిపై ఆధార‌ప‌డి వ‌డ్డీని లెక్కిస్తారు. అందువ‌ల్ల ఖాతా తెరిచే ముందు అధిక వ‌డ్డీ రేటుతో, ముందస్తు విత్‌డ్రాల‌పై త‌క్కువ పెనాల్టీ వ‌సూలు చేసే బ్యాంకును ఎంచుకోవ‌డం మంచిది. 

పన్నులు ఏ విధంగా ఉంటాయి?
రికరింగ్ డిపాజిట్లపై వచ్చే వ‌డ్డీ ఆదాయంపై ప‌న్ను పడుతుంది. దీనిని ఇతర ఆదాయ వనరుగా లెక్కించి మీ మొత్తం ఆదాయానికి కలిపి పన్ను లెక్కిస్తారు. ఉదాహరణకు మీరు 30 శాతం శ్లాబులో ఉంటే అదే రేటులో పన్ను ఉంటుంది. వడ్డీ ఆదాయం రూ.10 వేలు దాటితే టీడీఎస్ పడుతుంది. ఖాతాకు పాన్ నంబర్ జతచేయకపోతే 20 శాతం పన్ను విధిస్తారు.

ఆర్‌డీ ఖాతాను ఎలా మూసివేయాలి..
ఆఫ్‌లైన్ ద్వారా మీ బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లి ఖాతా ర‌ద్దు చేయాల్సిందిగా అభ్య‌ర్థ‌న ప‌త్రం ఇవ్వ‌చ్చు. అలాగే, ఆన్‌లైన్ ద్వారా అంటే నెట్ బ్యాంకింగ్‌, మొబైల్ బ్యాంకింగ్ అప్లికేష‌న్ ద్వారా ఖాతాను మూసివేయ‌వ‌చ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని