SBI కొత్త మైలురాయి.. 5 ట్రిలియన్‌ క్లబ్‌లోకి ప్రభుత్వ రంగ బ్యాంక్‌

SBI market cap: ప్రభుత్వ రంగానికి చెందిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) అరుదైన ఘనత సాధించింది. 5 ట్రిలియన్‌  రూపాయల (5 లక్షల కోట్లు) మార్కెట్‌ విలువను అందుకున్న తొలి ప్రభుత్వరంగ బ్యాంకుగా నిలిచింది.

Updated : 14 Sep 2022 15:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వ రంగానికి చెందిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) అరుదైన ఘనత సాధించింది. మార్కెట్‌ విలువ పరంగా సరికొత్త మైలురాయిని అందుకుంది. 5 ట్రిలియన్‌ రూపాయల (5 లక్షల కోట్లు) మార్కెట్‌ విలువను అందుకున్న తొలి ప్రభుత్వరంగ బ్యాంకుగా నిలిచింది. ఈ విషయంలో బ్యాంకింగ్‌ రంగంలో మూడో బ్యాంక్‌గా ఎస్‌బీఐ నిలవగా.. అన్ని కంపెనీలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఏడో స్థానంలో నిలిచింది. బుధవారం నాటి ట్రేడింగ్‌లో దాదాపు 1 శాతం మేర ఆ బ్యాంక్‌ షేరు లాభపడడంతో ఈ మైలురాయిని అందుకుంది.

ఎస్‌బీ షేర్లు గడిచిన కొద్ది రోజులుగా లాభాల్లో పయనిస్తున్నాయి. గడిచిన ఏడాదిలో ఆ బ్యాంక్‌ షేరు 22 శాతం లాభపడగా.. గడిచిన మూడు నెలల్లో ఏకంగా 26 శాతం మేర ఎగిసింది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ గడించిన 13.9 శాతం కంటే ఇది అధికం. బుధవారం నాటి ట్రేడింగ్‌లో ఎస్‌బీఐ షేరు గరిష్ఠంగా రూ.5664.45 శాతానికి చేరడంతో ఈ మైలురాయిని చేరుకొంది. ఈ విషయంలో బ్యాంకింగ్‌ రంగంలో ఇంతకుముందు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ మాత్రమే ఈ మైలురాయిని అందుకొన్నాయి.

ఇదీ కారణం..

రుణాల్లో వృద్ధి పెరుగుతోందని ఇటీవల ఆర్‌బీఐ ఇచ్చిన డేటా ఎస్‌బీఐ సహా ఇతర బ్యాంక్‌ షేర్లు రాణించడానికి ప్రధాన కారణం. దేశీయ బ్యాంకుల రుణాలు తొమ్మిదేళ్ల గరిష్ఠానికి చేరాయని ఆర్‌బీఐ గత నెల డేటా వెలువరించింది. దీంతో కొన్ని సెషన్లుగా బ్యాంకింగ్‌ షేర్లు రాణిస్తున్నాయి. గడిచిన ఐదు సెషన్లను పరిగణనలోకి తీసుకుంటే..  ఐసీఐసీఐ బ్యాంక్‌ 5 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 3 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు 7.5 శాతం చొప్పున రాణించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని