Health Insurance: `ఓపీడీ` ప్ర‌యోజ‌నాల‌తో ఆరోగ్య బీమా

కొన్ని బీమా సంస్థ‌లు ఔట్ పేషెంట్ ఖ‌ర్చులైన డాక్ట‌ర్ ఫీజులు, డ‌యాగ్న‌స్టిక్ ఖ‌ర్చులు, ఫార్మ‌సీ వంటి ఇత‌ర ఖ‌ర్చుల‌తో పాటు ఆరోగ్య సేవ‌లు పొంద‌డానికి `OPD` సొల్యూష‌న్‌ల‌ను ప్రారంభించాయి.

Updated : 13 Nov 2021 12:17 IST

కోవిడ్‌-19.. ఆరోగ్య బీమా ప‌ట్ల ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెర‌గ‌డానికి దోహ‌దంచేసింది. ఆరోగ్య బీమా అనేది ఒక ఎంపిక‌గా కాకుండా, ఒక అవ‌స‌రంగా ప‌రిగ‌ణించ‌బ‌డింది. అయితే ప్రాథ‌మిక ఆరోగ్య బీమా పాల‌సీలు వైద్యుల ఫీజులు, డ‌యాగ్న‌స్టిక్ ఛార్జీలు, హోమ్‌కేర్ ప్యాకేజీలు వంటి గృహ చికిత్స‌ ఖ‌ర్చుల‌ను మిన‌హాయించి ఇన్‌పేషెంట్ ఖ‌ర్చుల‌ను మాత్ర‌మే క‌వ‌ర్ చేస్తున్నాయి. దీనివ‌ల్ల‌ సాధార‌ణ వైద్య ఖ‌ర్చుల కోసం 60 శాతానికి పైగా వ్య‌యాన్ని జేబు నుంచే ఖ‌ర్చుపెట్టాల్సి వ‌స్తుంది. ఈ ఖ‌ర్చుల‌ను త‌గ్గించ‌డానికి ఇటీవ‌ల కొన్ని బీమా సంస్థ‌లు ఔట్ పేషెంట్ ఖ‌ర్చులైన డాక్ట‌ర్ ఫీజులు, డ‌యాగ్న‌స్టిక్ ఖ‌ర్చులు, ఫార్మ‌సీ వంటి ఇత‌ర ఖ‌ర్చుల‌తో పాటు ఆరోగ్య సేవ‌లు పొంద‌డానికి `OPD` సొల్యూష‌న్‌ల‌ను ప్రారంభించాయి.

ఇటీవ‌లే `ఐసీఐసీఐ లాంబార్డ్‌`  బీఫిట్‌(BeFit) అనే రైడ‌ర్‌ను ప్రారంభించింది. ఇది దాని `ఐఎల్ టేక్‌కేర్‌(ILTakeCare)` యాప్ ద్వారా సేవ‌లు అందిస్తుంది. `ఓపీడీ` సేవ‌ల‌ను న‌గ‌దు ర‌హిత ప‌ద్ధ‌తిలో క‌వ‌ర్ చేస్తుంది. ఇక్క‌డ సాధార‌ణ‌, స్పెష‌లిస్ట్‌, సూప‌ర్ స్పెష‌లిస్ట్ వైద్యులు, అలాగే ఫిజియోథెర‌పీ సెష‌న్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో ఫిజిక‌ల్‌, వ‌ర్చువ‌ల్ క‌న్స‌ల్టేష‌న్‌ను బుక్ చేసుకోవ‌చ్చు. ఈ బీమా సంస్థ 20 న‌గ‌రాల్లో 11 వేల మందికి పైగా వైద్యుల‌తో జ‌త‌క‌ట్టింది. 24x7 అన్ని వేళ‌లా టెలి, వ‌ర్చువ‌ల్ సేవ‌లు అందిస్తుంది.  ఇది పాల‌సీదారుల‌కు అవుట్ పేషంట్ సేవ‌ల‌ను న‌గ‌దు ర‌హితంగా అందించ‌డంతో పాటు.. పేషంట్‌ ఆసుప‌త్రిలో చేరే అవ‌స‌రం రాకుండానే.. ఆరోగ్య‌ స‌మ‌స్య‌ల‌ను ప్రారంభ ద‌శ‌లోనే ప‌రిష్క‌రిస్తుంద‌ని సంస్థ తెలిపింది. 

ప్ర‌స్తుతం మార్కెట్‌లో రిల‌య‌న్స్ జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్ అందిస్తున్న‌ `డిజిట‌ల్ కేర్ మేనేజ్‌మెంట్` పాల‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్ వారి `హెల్త్ వాలెట్` పాల‌సీ, బ‌జాజ్ అల‌య‌న్జ్ జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్  అందిస్తున్న‌ `టాక్స్ గెయిన్` పాల‌సీ వంటి కొన్ని ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.  `OPD` ప్లాన్‌ని కొనుగోలు చేసే ముందు డాక్ట‌ర్‌తో త్వ‌రిత‌గ‌తిన సంప్ర‌దింపుల కోసం త‌గిన‌న్ని నెట్‌వ‌ర్క్ ఆసుప‌త్రులు ఉన్నాయా.. లేవా.. అని చూసుకోవాలి. ఈ సౌక‌ర్యం రోజంతా అందుబాటులో ఉండాలి. ఐసీఐసీఐ లాంబార్డ్ కొత్త ప్లాన్ అయితే న‌గ‌దు ర‌హిత సేవ‌ల‌ను అందిస్తుంది. ఇక్క‌డ ఎవ‌రైనా ఆన్‌లైన్ ద్వారా డాక్ట‌ర్ అపాయింట్‌మెంట్ తీసుకోవ‌చ్చు. ఇందులో చేసే క్లెయిమ్స్.. యాప్ ద్వారా ప‌రిష్క‌రిస్తారు. 

అయితే భార‌త్‌లో `OPD` ప్లాన్‌లు చాలా త‌క్కువ ఆరోగ్య బీమా కంపెనీలు మాత్ర‌మే అందిస్తున్నాయి. వీటి ప్రీమియంలు కూడా సాధార‌ణ ఆరోగ్య బీమా ప్రీమియంల‌తో పోల్చుకుంటే చాలా ఎక్కువ‌నే చెప్పాలి. వ‌య‌స్సుని బ‌ట్టి ప్రీమియం రేట్లు మార‌తాయి. మీరు `OPD` క‌వ‌రేజీని అంత‌ర్నిర్మిత బేస్ ప్లాన్‌గా కూడా కొనుగోలు చేయ‌వ‌చ్చు. లేదా ప్రాథ‌మిక పాల‌సీతో రైడ‌ర్‌గా కొనుగోలు చేయ‌వ‌చ్చు. కొనుగోలు చేసే ముందు క‌వ‌రేజ్‌, మిన‌హాయింపులు, మీ ప్రాంతంలో అందుబాటులో ఉన్న వైద్యుల నెట్‌వ‌ర్క్‌ని చెక్ చేసుకోగ‌ల‌రు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని