Stock Market Closing Bell: ఆఖర్లో అమ్మేశారు!

లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు చివరకు నష్టాలతో ముగిశాయి....

Updated : 29 Apr 2022 16:17 IST

ముంబయి: అంతర్జాతీయ సానుకూల సంకేతాల మధ్య ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు చివరకు నష్టాలతో ముగిశాయి. దాదాపు చివరి గంటన్నర వరకు లాభాల్లో పయనించిన సూచీలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఆఖరి అరగంటలో మాత్రం అమ్మకాలు వెల్లువెత్తాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌, మారుతీ వంటి దిగ్గజ షేర్ల పతనం సూచీలను కిందకు లాగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లలోని అనిశ్చితి నేపథ్యంలో సోమవారానికి పరిస్థితులు ఏ మలుపు తీసుకుంటాయోనన్న ఆందోళనలో మదుపర్లు కీలక కౌంటర్లలో లాభాలు స్వీకరించేశారు. మిశ్రమ కార్పొరేట్‌ ఫలితాలు, ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు (Fed Rate Hike), రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం తీవ్ర కావడం వంటి పరిణామాలు మదుపర్లను కలవరపెడుతున్నాయి. చైనాలో కరోనా (China Corona) వ్యాప్తి కూడా సెంటిమెంటును దెబ్బతీసింది. మరోవైపు అమెరికా ఫ్యూచర్స్‌ ప్రతికూలంగా కదలాడుతున్నాయి. ఈ పరిణామాలు ఆఖర్లో అమ్మకాలకు మొగ్గుచూపేలా చేశాయి.

ఉదయం సెన్సెక్స్‌ 57,817.51 వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 57,975.48 -  56,902.30 మధ్య కదలాడింది. చివరకు 460.19 పాయింట్ల నష్టంతో 57,060.87 వద్ద ముగిసింది. 17,329.25 వద్ద లాభాలతో ప్రారంభమైన నిఫ్టీ చివరకు 142.25 పాయింట్లు నష్టపోయి 17,102.55 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 17,377.65 - 17,053.25 మధ్య చలించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.76.42 వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో కొటాక్ మహీంద్రా బ్యాంక్‌, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎంఅండ్‌ఎం, అల్ట్రాటెక్ సిమెంట్స్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, విప్రో, మారుతీ, పవర్‌గ్రిడ్‌, ఎస్‌బీఐ, టైటన్‌, ఎన్‌టీపీసీ, టెక్ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి.

మార్కెట్‌లోని మరిన్ని సంగతులు..

* యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు ఈరోజు భారీ నష్టాల్ని చవిచూశాయి. ఇంట్రాడేలో ఆరు శాతం వరకు నష్టపోయాయి. గత ఏడాది నాలుగో త్రైమాసికంలో లాభాలు పెరిగినప్పటికీ.. నికర వడ్డీ ఆదాయం ఆశించిన స్థాయిలో పెరగకపోవడం మదుపర్ల సెంటిమెంటును దెబ్బతీసింది.

* నిఫ్టీలోని అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. అత్యధికంగా నిఫ్టీ మీడియా 2.87 శాతం కుంగింది. తర్వాత పీఎస్‌యూ బ్యాంక్‌, స్థిరాస్తి, ఆటో రంగ షేర్లు కుదేలయ్యాయి. టీవీ18 షేర్లు ఏకంగా 12 శాతం మేర నష్టపోవడం గమనార్హం.

* గత మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలను మారుతీ సుజుకీ ప్రకటించింది. ఏకీకృత ప్రాతిపదికన కంపెనీ నికర లాభం రూ.1,875 కోట్లుగా నమోదైంది. ఆదాయం రూ.26,749గా, ఎబిట్‌డా రూ.2,427 కోట్లుగా నివేదించింది.

* నేడు త్రైమాసిక ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో విప్రో షేర్లు ఇంట్రాడేలో 2.5 శాతానికి పైగా నష్టపోయి 11 వారాల కనిష్ఠానికి చేరాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు