Stock Market: లాభాల్లో ముగిసిన మార్కెట్‌ సూచీలు.. 17,150 ఎగువకు నిఫ్టీ

Stock Market: సెన్సెక్స్‌ (Sensex) 139.91 పాయింట్ల లాభంతో 58,214.59 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 44.40 పాయింట్లు లాభపడి 17,151.90 దగ్గర ముగిసింది.

Updated : 22 Mar 2023 16:22 IST

Stock Market Update | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు బుధవారం లాభాలతో ముగిశాయి. వరుసగా రెండోరోజూ మార్కెట్లు లాభాలను నిలబెట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య ట్రేడింగ్‌ను సానుకూలంగా ప్రారంభించిన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. అయితే, ఈరోజు రాత్రి వడ్డీరేట్ల పెంపుపై అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ కీలక ప్రకటన చేయనుంది. ఈ నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఐరోపా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. యూఎస్‌ ఫ్యూచర్స్‌ నష్టాల్లోకి దిగజారాయి.   

ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 58,074.68 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 58,418.78- 58,063.50 మధ్య కదలాడింది. చివరకు 139.91 పాయింట్ల లాభంతో 58,214.59 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 17,177.45 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 17,207.25- 17,107.85 మధ్య ట్రేడైంది. చివరకు 44.40 పాయింట్లు లాభపడి 17,151.90 దగ్గర ముగిసింది.

సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో జబాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, సన్‌ఫార్మా, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, టీసీఎస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, పవర్‌గ్రిడ్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు  లాభపడ్డ జాబితాలో ఉన్నాయి. ఎన్‌టీపీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, కొటాక్ మహీంద్రా బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, టాటా స్టీల్‌, టైటన్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎస్‌బీఐ నష్టపోయాయి.

మార్కెట్‌లోని ఇతర విషయాలు..

భవిష్యత్‌ వృద్ధిపై సానుకూల అంచనాల నేపథ్యంలో అనుపమ్‌ రసాయన్‌ షేరు రాణిస్తోంది. గత ఐదు వారాల్లో ఈ స్టాక్‌ 40 శాతం లాభపడింది. ఈరోజు ఇంట్రాడేలో రూ.859 దగ్గర గరిష్ఠాన్ని తాకింది. చివరకు 1.93 శాతం లాభంతో రూ.823 వద్ద స్థిరపడింది.

ప్రముఖ స్థిరాస్తి సంస్థ శోభా లిమిటెడ్‌ షేరు ఈరోజు భారీగా కుంగింది. తమ రిజిస్టర్డ్‌ కార్యాలయంలో ఆదాయ పన్ను విభాగం సోదాలు నిర్వహిస్తోన్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో స్టాక్‌ విలువ 12.78 శాతం పతనమై రూ.452.90 వద్ద ముగిసింది.

మాలుర్‌ యూనిట్‌లో లక్ష యూనిట్ల తయారీ మైలురాయిని చేరుకున్నట్లు వీఎస్‌టీ టిల్లర్స్‌ అండ్‌ ట్రాక్టర్స్‌ ప్రకటించింది. మరోవైపు దేశంలో ప్రస్తుతం టిల్లర్‌ పరిశ్రమ 60,000 యూనిట్లుగా ఉందని తెలిపింది. 2025 నాటికి అది 1 లక్ష యూనిట్లకు చేరుతుందని అంచనా వేసింది. దీంతో కంపెనీ షేరు ఈరోజు 8.05 శాతం పెరిగి రూ.2,341 వద్ద ముగిసింది.

అదానీ గ్రూప్‌ నమోదిత సంస్థల్లో అదానీ పోర్ట్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ మినహా అన్ని షేర్లు లాభపడ్డాయి. అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ అప్పర్‌ సర్క్యూట్‌ని తాకాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని