Stock market: మరోసారి భారీగా మార్కెట్‌ పతనం!

దేశీయ స్టాక్ మార్కెట్‌ (Stock Market) సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ ప్రతికూలతలతో బేర్‌ బెంబేలెత్తిస్తోంది....

Updated : 25 Jan 2022 09:47 IST

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ (Stock Market) సూచీలు మంగళవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ ప్రతికూలతలతో బేర్‌ బెంబేలెత్తిస్తోంది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు, ద్రవ్యోల్బణ భయాలకు రష్యా-ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలు ఆజ్యం పోయడంతో సూచీలు భారీగా పతనమవుతున్నాయి. ఫలితంగా వరుసగా ఆరో రోజూ దేశీయ సూచీలు నష్టాలు చవిచూస్తున్నాయి.

రష్యా-ఉక్రెయిన్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. అమెరికా మార్కెట్లలో సోమవారం భారీగా ఊగిసలాట ధోరణి కనిపించింది. ఉదయం సెషన్‌లో 1000 పాయింట్లు పడిన డోజోన్స్‌ మధ్యాహ్నం సెషన్‌లో అనూహ్యంగా పుంజుకొని లాభాల్లోకి ఎగబాకింది. అక్కడ మిగిలిన రెండు ప్రధాన సూచీలైన ఎస్‌అండ్‌పీ 500, నాస్‌డాక్‌ సైతం ఇదే ధోరణిలో పయనించాయి. తూర్పు ఐరోపాలో బలగాలను ప్రస్తుతానికి స్టాండ్‌బైలో ఉంచుతున్నట్లు నాటో ప్రకటించడంతో నిన్న అమెరికా సూచీలు కనిష్ఠాల నుంచి కోలుకున్నాయి. 

ఇక దేశీయంగా చూస్తే సోమవారం విదేశీ సంస్థాగత మదుపర్లు (FII) రూ.3,750 కోట్లకు పైగా అమ్మకాలకు పాల్పడ్డారు. దేశీయ మదుపర్లు మాత్రం రూ.74.88 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. మరోవైపు కొత్త తరం కంపెనీల షేర్ల పతనం కొనసాగుతోంది. రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, విప్రో వంటి దిగ్గజ షేర్లలో అమ్మకాలు కొనసాగుతున్నాయి.    

ఈ పరిణామాల నేపథ్యంలో ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 654 పాయింట్ల నష్టంతో 56,836 వద్ద, నిఫ్టీ 188 పాయింట్లు నష్టపోయి 16,961 వద్ద ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 1000 పాయింట్ల నష్టాన్ని చవిచూసి తిరిగి కొంత పుంజుకొంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.62 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో యాక్సిస్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఏషియన్‌ పెయింట్స్‌, విప్రో, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, నెస్లే ఇండియా, టైటన్‌, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టపోతున్న వాటిలో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని