Tata Technologies IPO: టాటా టెక్నాలజీస్‌ ఐపీఓకు సెబీ ఆమోదం

Tata Technologies IPO: 19 ఏళ్ల తర్వాత టాటా గ్రూప్‌ నుంచి వస్తున్న ఐపీఓకు సెబీ ఆమోదం తెలిపింది. ఈ ప్రక్రియ పూర్తి ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (OFS) ప్రక్రియ ద్వారా జరగనుంది.

Published : 27 Jun 2023 16:22 IST

ముంబయి: మదుపరులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న టాటా టెక్నాలజీస్‌ పబ్లిక్‌ ఇష్యూ (Tata Technologies IPO)కు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) ఆమోదం తెలిపింది. ఈ ప్రక్రియ పూర్తి ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (OFS) ప్రక్రియ ద్వారా జరగనుంది. ఐపీఓలో భాగంగా 23.6 శాతం వాటాకు సమానమైన 9.57 లక్షల కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. ఇందులో భాగంగా టాటా టెక్నాలజీస్‌ మాతృ సంస్థ టాటా మోటార్స్‌ 8.11 కోట్ల షేర్లను లేదా 20 శాతం వాటాను వదులుకోనుంది. దీంతో పాటు టాటా మోటార్స్‌ అనుబంధ సంస్థలైన ఆల్ఫా టీసీ హోల్డింగ్స్‌, టాటా క్యాపిటల్‌ గ్రోత్‌ ఫండ్‌కు చెందిన కంపెనీల షేర్లను సైతం విక్రయించనున్నారు. 

టాటా గ్రూప్‌ నుంచి 2004లో చివరగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) ఐపీఓకు వచ్చింది. అంటే టాటా గ్రూప్‌ నుంచి దాదాపు 19 ఏళ్ల తర్వాత మరో ఐపీఓ ఇది. ఇందుకోసం ఈ ఏడాది మార్చిలో సెబీకి సంబంధిత పత్రాలను సమర్పించింది. టాటా టెక్నాలజీస్‌ ఐపీఓ పరిమాణాన్ని కంపెనీ వెల్లడించనప్పటికీ.. రూ.4,000 కోట్లు ఉండొచ్చని తెలుస్తోంది. పబ్లిక్‌ ఆఫర్‌లో 50 శాతం క్వాలిఫైయింగ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్స్‌ (QIBs), 35 శాతం రిటైల్‌ ఇన్వెస్టర్లకు, 15 శాతం సంస్థాగతేతర పెట్టుబడిదారులకు కేటాయించారు. టాటా టెక్నాలజీస్‌తో పాటు మార్కెట్‌ నుంచి నిధులు సమీకరించేందుకు గాంధార్‌ ఆయిల్‌ రిఫైనరీ (ఇండియా), ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీ ఎస్‌బీఎఫ్‌సీ ఫైనాన్స్‌కు సైతం సెబీ ఆమోదం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని