Savings Account: బ్యాంక్‌ పొదుపు ఖాతా.. ర‌కాలు

పొదుపు ఖాతా నిర్వహించేందుకు కనీసం మూడు నెలలకు ఒక్కసారైనా లావాదేవీ జరపాల్సి ఉంటుంది.

Updated : 01 Dec 2021 17:16 IST

ఈ రోజు పొదుపు చేసిన‌ డబ్బే రేప‌టి అవ‌స‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. పొదుపు చేసే అలవాటును పెంపొందించడమే పొదుపు ఖాతా ముఖ్య ఉద్దేశ్యం. ఈ ఖాతాలను అర్హత కలిగిన వ్యక్తులు ఎవరైనా తెరవచ్చు. సొమ్ము నిల్వ ఉంచుకొని అవసరమైనప్పుడు తీసుకునేందుకు పొదుపు ఖాతాలు చక్కగా ఉపయోగపడతాయి. 

పొదుపు ఖాతా ర‌కాలు..
సాధార‌ణ పొదుపు ఖాతా..

ప్ర‌స్తుతం బ్యాంకుల‌కు సంబంధించి ఏలాంటి లావాదేవీలు చేయాలన్నా ముఖ్యంగా ఉండాల్సిందే పొదుపు ఖాతా. పొదుపు ఖాతాను ఎవ‌రైనా తెర‌వ‌చ్చు. కేవైసీ నిబంధనల ప్ర‌కారం వ్యక్తులు, వ్యక్తిగత, చిరునామా గుర్తింపు పత్రాలను బ్యాంకులో సమర్పించి సాధార‌ణ పొదుపు ఖాతాను తెరుచుకునే వీలుంది. పొదుపు ఖాతా నిర్వహించేందుకు కనీసం మూడు నెలలకు ఒక్కసారైనా లావాదేవీ జరపాల్సి ఉంటుంది. ఖాతాలో కనీస నిల్వను ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈ కనీస నిల్వ కన్నా తక్కువ సొమ్ము ఉన్నట్లయితే బ్యాంకులు రుసుములు విధిస్తాయి. పొదుపు ఖాతాలో నిల్వ చేసిన మొత్తంపై వ‌డ్డీ ల‌భిస్తుంది, బ్యాంకుల‌ను బ‌ట్టి వ‌డ్డీ మారుతుంటుంది. 

జీతం ఆధారిత పొదుపు ఖాతాలు..
సంస్థ‌లు త‌మ ఉద్యోగుల కోసం ఈ ఖాతాల‌ను తెరుస్తాయి. నెల‌వారి ప్రాతిప‌దిక‌న ఉద్యోగుల జీతాన్ని ఈ ఖాతాలో జ‌మ చేస్తాయి. సంస్థ‌ల‌ అభ్య‌ర్థ‌న మేర‌కు ఉద్యోగుల కోసం బ్యాంకులు ఈ ఖాతాల‌ను అందిస్తున్నాయి. ఈ ఖాతాల‌కు కొన్ని ప్రాధాన్య‌త‌లు, నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయి. జీతం చెల్లించే స‌మ‌యంలో సంస్థ య‌జ‌మాని సూచించిన మేర‌కు బ్యాంకులు సంస్థ‌ ఖాతా నుంచి డ‌బ్బును డెబిట్ చేసి ఉద్యోగుల ఖాతాల‌కు క్రెడిట్ చేస్తాయి. క‌నీస బ్యాలెన్స్‌ను నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం లేదు. మూడు నెల‌ల పాటు వ‌రుస‌గా జీతం ఖాతాకి క్రెడిట్ కాక‌పోతే ఆ ఖాతా సాధార‌ణ పొదుపు ఖాతాగా మారుతుంది. 

సీనియ‌ర్ సిటిజ‌న్స్ సేవింగ్స్ అక్కౌంట్‌..
ఈ ఖాతా సాధార‌ణ పొదుపు ఖాతా మాదిరిగానే ప‌నిచేస్తుంది.  కానీ వ‌డ్డీ రేట్లు సాధార‌ణ ఖాతా కంటే కాస్త ఎక్కువ ఉంటాయి. ప‌ద‌వీ విర‌మ‌ణ ఖాతా నుంచి లేదా పెన్ష‌న్ ఫండ్ల నుంచి నిధుల‌ను పంప‌డం కోసం ఇత‌ర సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లతో అనుసంధానమై ఉంటాయి. బ్యాంకు ఖాతా కింద‌ అన్ని నిధులను ఏకీకృతం చేస్తాయి.

మైన‌ర్ల పొదుపు ఖాతాలు..
పొదుపు, బ్యాంకింగ్ లావాదేవీల గురించి పిల్ల‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఉద్దేశించినది. ఈ ఖాతాల‌లో క‌నీస నిల్వ అవ‌స‌రం లేదు. 10 సంవ‌త్స‌రాల లోపు పిల్ల‌లు, త‌ల్లిదండ్రులు లేదా గార్డియన్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఖాతాను నిర్వ‌హించ‌వ‌చ్చు. 10 సంవ‌త్సార‌లు నిండిన పిల్ల‌లు స్వంతంగా ఖాతాను ఆప‌రేట్ చేయవ‌చ్చు. పిల్ల‌లకు 18 సంవ‌త్స‌రాలు నిండిన త‌రువాత సాధార‌ణ పొదుపు ఖాతాగా మారుస్తారు. 

జిరో బ్యాలెన్స్ పొదుపు ఖాతా..
ఈ ఖాతా కూడా సాధార‌ణ పొదుపు ఖాతా మాదిరిగానే ప‌నిచేస్తుంది. కానీ క‌నీస బ్యాలెన్స్ నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం లేదు. ఉప‌సంహ‌ర‌ణ మొత్తాల‌పై ప‌రిమితులు ఉంటాయి. 

మ‌హిళల పొదుపు ఖాతా..
నేటి త‌రం మ‌హిళ‌లు ఆర్థికంగా ముందుకు సాగేందుకు ఈ ఖాతాలు రూపొందించారు. ఇవి కొన్ని ప్ర‌త్యేక ఫీచ‌ర్ల‌తో వ‌స్తాయి. నిర్ధిష్ట కొనుగోళ్ల‌పై రాయితీలు ఉంటాయి. త‌క్కువ వ‌డ్డీ రేటుకే రుణం ల‌భిస్తుంది. డీమ్యాట్ ఖాతా చార్జీలు ఉండ‌వు. ఈ ఫీచ‌ర్లు బ్యాంకును బ‌ట్టి మారుతుంటాయి.

పొదుపు ఖాతా ఫీచ‌ర్లు..
*
ఎన్ని సార్లు డిపాజిట్లు చేయాలన్న దానిపై కనీస పరిమితులు ఉండవు.
* విత్‌డ్రాల విషయంలో మాత్రం కొన్ని పరిమితులు ఉంటాయి.
* ఈసీఎస్‌ (ఎలక్ట్రానిక్‌ క్లియరింగ్ సర్వీస్‌) ద్వారా చెల్లింపులు చేసే సదుపాయం ఉంటుంది.
* జీతం లేదా పింఛను వచ్చే ఖాతాలైతే తాత్కాలిక ఓవర్‌ డ్రాఫ్టులు తీసుకునే వీలుంది.
* పొదుపు ఖాతాలో వడ్డీని మూడు లేదా ఆరు నెలలకు ఒకసారి జమచేస్తారు.

పొదుపు ఖాతాపై బ్యాంకులు అందించే సదుపాయాలు..
* నగదు లావాదేవీలు
* ఏటీఎంలు, షాపింగ్‌ టెర్మినళ్ల దగ్గర ఉపయోగించుకునేందుకు డెబిట్‌ కార్డులు
* ఏటీఎంల ద్వారా లావాదేవీలు(ఉచిత లావాదేవీలపై ప‌రిమితి ఉంటుంది)
* స్థానిక చెక్కుల క్లియరెన్స్‌
* ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను పొదుపు ఖాతాతో అనుసంధానం
* ఫోన్‌ బ్యాంకింగ్‌ సేవలు
* మొబైల్‌ బ్యాంకింగ్‌ సేవలు
* ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సేవలకు వెసులుబాటు
* కరెంటు, ఫోన్‌ బిల్లులు చెల్లించేందుకు ఎలక్ట్రానిక్‌ క్లియరెన్స్‌ సేవల సదుపాయం

పొదుపు ఖాతా ద్వారా అందించే విలువ ఆధారిత సేవలు..
* నగదు, చెక్కులను అందించేందుకు, పొందేందుకు హోమ్‌ డెలివరీ సదుపాయం
* ఎక్కడైనా బ్యాంకింగ్‌ చేసుకునే సదుపాయం
* ఏటీఎంల నుంచి పెద్ద మొత్తాలో నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశం
* ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి సొమ్ము తీసుకునే సదుపాయం
* ఫోన్‌ బ్యాంకింగ్‌ ద్వారా సత్వర స్పందన వచ్చే సేవలు
* సత్వర సేవలకు బ్యాంకులో ప్రత్యేక కౌంటర్లు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని