జెఫ్‌ బెజోస్‌..ఇక ఏం చేస్తారో!

ప్రపంచ కుబేరుడు జెఫ్‌బెజోస్‌ 27 ఏళ్ల కిందట తాను స్థాపించిన ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌   ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) బాధ్యతల నుంచి తప్పుకున్నారు. జులై 5న సీఈఓ పగ్గాలను యాండీ జాస్సీకి అప్పగించారు. భవిష్యత్‌లో ఆయన ఏం  చేయబోతున్నారు.....

Published : 06 Jul 2021 17:48 IST

అమెజాన్‌ సీఈఓ బాధ్యతలకు వీడ్కోలు

యాండీ జాస్సీకు పగ్గాలు అప్పగింత

ప్రపంచ కుబేరుడు జెఫ్‌బెజోస్‌ 27 ఏళ్ల కిందట తాను స్థాపించిన ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌   ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) బాధ్యతల నుంచి తప్పుకున్నారు. జులై 5న సీఈఓ పగ్గాలను యాండీ జాస్సీకి అప్పగించారు. భవిష్యత్‌లో ఆయన ఏం  చేయబోతున్నారు? ఏ రంగంపై ఎక్కువగా దృష్టి   సారించనున్నారు? అనేది అంతర్జాతీయంగా  జరుగుతున్న చర్చ.

1994లో అమెజాన్‌ను బెజోస్‌ స్థాపించారు. ఆన్‌లైన్‌లో పుస్తకాల విక్రయం ద్వారా మొదలైన ఆ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద ఇకామర్స్‌ కంపెనీల్లో ఒకటిగా నిలిచి 1.7 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్‌ విలువకు చేరేవరకు బెజోస్‌ దగ్గరుండి చూసుకున్నారు. ప్రైమ్‌ వీడియో, అమెజాన్‌వెబ్‌ సర్వీసెస్‌ వంటి ఇతరత్రా సేవలనూ అందిస్తూ, అందరి ఇళ్లలోకి చేరేలా చేశారు. ఇపుడు బెజోస్‌ 201 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు. యాండీకి బాధ్యతలను అప్పగించినప్పటికీ.. అమెజాన్‌కు సంబంధించి పెద్ద నిర్ణయాలను మాత్రం బెజోసే తీసుకోవచ్చని కొంత మంది అధికారులు అంటున్నారు. ఎందుకంటే ఆయనే ఇప్పటికీ కంపెనీలో అతిపెద్ద వాటాదారు. పైపెచ్చు ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ కూడా.

సరికొత్త ఉత్పత్తులపై..

బెజోస్‌ తన శక్తిసామర్థ్యాలను సరికొత్త ఉత్పత్తులు, సరికొత్త అంశాలపై వినియోగించనున్నట్లు ఉద్యోగులకు రాసిన లేఖలో ఇది వరకే స్పష్టం చేశారు. కంపెనీ నుంచి ‘పదవీ విరమణ’ చేయట్లేదని కూడా తెలిపారు. అమెజాన్‌ నిధుల మద్దతు ఉన్న ‘రివియాన్‌’ అనే అంకురం నిర్మించిన ఒక విద్యుత్‌ పికప్‌ ట్రక్కు చక్రం వద్ద నిలబడి ఉన్న ఒక ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి తన అభిమతాన్ని చెప్పకనే చెప్పారు. అంటే ఆయన అంకురాలు, సరికొత్త వెంచర్లపై ఆయన దృష్టి సారించేందుకు అవకాశం లేకపోలేదు.

జులై 20న అంతరిక్షంలోకి

బెజోస్‌కు ఎంతో ఇష్టమైన అంతరిక్షయానం ఉండనే ఉంది. తన స్పేస్‌ కంపెనీ ‘బ్లూఆరిజన్‌’లో ఎక్కువ సమయం గడపొచ్చు. అంతరిక్షంలో 20-30 లక్షల మందికి హోటళ్లు, అమ్యూజ్‌మెంట్‌పార్కులు, కాలనీలు ఏర్పాటు చేయాలని బెజోస్‌ తన యుక్త వయసులో కల కన్నారట. ఈ కలను సాకారం చేసుకునేందుకు తొలి అడుగుగా బెజోస్‌ తన సోదరుడు మార్క్‌తో కలిసి జులై 20న అంతరిక్షయానం చేయనున్నారు. తొలి ఫ్లైట్‌స్పేస్‌ క్యాప్సూల్‌ ‘న్యూ షెఫర్డ్‌’లో ఈ పయనానికి శ్రీకారం చుడుతున్నారు.  ఈ ప్రయాణం తర్వాత మీడియా వ్యాపారంపైనా తన సమయాన్ని వెచ్చించే అవకాశం ఉంది. 2013లో ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ను 250 మిలియన్‌ డాలర్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

విరాళం

2020లో 100 మి. డాలర్లను ఫీడ్‌ అమెరికా అనే లాభాపేక్ష రహిత సంస్థకు విరాళం ఇచ్చారు. దీని ద్వారా దేశంలో ఆకలితో ఉన్న వారికి చేయూతనిచ్చారు.కరోనా సమయంలోనూ 1,75,000 మందిని నియమించుకున్నారు.

కలల సౌధం

డేవిడ్‌ జిఫెన్‌ను చెందిన వార్నర్‌ ఎస్టేట్‌ను 175 మి. డాలర్ల(దాదాపు రూ.1300 కోట్లు)తో కొనుగోలు చేశారు. ఇంత కంటే విలాసవంత కలల సౌధం ఈ ప్రపంచంలో ఉండదని వినికిడి.

ట్రిలియన్‌ డాలర్ల సంపద?

2026 కల్లా లక్ష కోట్ల డాలర్ల (ట్రిలియన్‌ డాలర్లు)ను సాధించే తొలి వ్యక్తి ఈయనే అవుతారన్న అంచనా ఉంది.

భార్యకు 63 బి. డాలర్లు

గతేడాది తన భార్యతో విడాకులకు సంబంధించిన సెటిల్‌మెంట్‌ కింద 25 శాతం వాటాను ఇచ్చేశారు. ఆ వాటా విలువ ఇపుడు 63 బి. డాలర్ల(రూ.4.72 లక్షల కోట్లు)కు పైమాటే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని