TCS: నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటేనే వేతన పెంపు: టీసీఎస్‌

TCS: అభ్యర్థుల నైపుణ్యాల ఆధారంగానే వేతనాన్ని చెల్లిస్తున్నామని టీసీఎస్‌ మానవ వనరుల విభాగాధిపతి మిలింద్‌ లక్కడ్‌ తెలిపారు.

Updated : 12 Jan 2024 15:25 IST

TCS | చెన్నై: ప్రస్తుతం సెంటిమెంట్‌ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ.. ఇప్పటికీ దేశంలో చాలా మంది ఐటీ సర్వీసెస్‌నే తమ కెరీర్‌ ఆప్షన్‌గా ఎంచుకుంటున్నారు. అయితే, ఈ రంగంలోని కంపెనీలు కొత్త వారికి గత కొన్నేళ్లుగా వార్షిక వేతనాన్ని రూ.3-4 లక్షలకే పరిమితం చేస్తున్నాయి. దీనిపై తాజాగా ప్రముఖ ఐటీ సంస్థ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS)’ స్పందించింది.

టీసీఎస్‌ (TCS) మానవ వనరుల విభాగాధికారి మిలింద్‌ లక్కడ్‌ మాట్లాడుతూ.. అభ్యర్థుల నైపుణ్యాల ఆధారంగానే తాము వేతనాన్ని చెల్లిస్తున్నామన్నారు.  కొత్త వారైనా లేక ఇతర సంస్థల నుంచి వచ్చి చేరే వారైనా తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటే రెండింతల వేతనం పొందొచ్చని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రతిభ చూపిన వారి వేతనాన్ని రూ.10 లక్షల వరకు పెంచుతున్నామని వెల్లడించారు. కంపెనీలో చేరిన తర్వాత ఫ్రెషర్లు తమ నైపుణ్యాలను పెంచుకోవడంపై దృష్టి సారించాలని సూచించారు.

ఈ ఏడాదీ కళాశాల ప్రాంగణాల్లో ఎంపికలు నిర్వహిస్తామని లక్కడ్‌ తెలిపారు. డిసెంబరు ఆఖరుకు టీసీఎస్‌లో నికరంగా ఉద్యోగుల సంఖ్య 10,669 మంది తగ్గి 6,03,305కు చేరిందని వెల్లడించారు. కృత్రిమమేధలో ఇప్పటివరకు 1.68 లక్షల మంది ఉద్యోగులకు శిక్షణ ఇప్పించామని, జెనరేటివ్‌ ఏఐలో 14,000 మంది నిపుణులకు శిక్షణ ఇచ్చామని, మరో 17,000 మంది ఇదే ప్రక్రియలో ఉన్నారని తెలిపారు. తమ మొత్తం సిబ్బందిలో 65% మంది కార్యాలయాలకు రోజూ వస్తుండగా, మిగిలిన వారు హైబ్రిడ్‌ విధానంలో పనిచేస్తున్నారని చెప్పారు.

డిసెంబరు త్రైమాసికంలో టీసీఎస్‌ (TCS) రూ.11,735 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.  ఇది 2022-23 త్రైమాసిక లాభం కంటే 8.2% అధికం. ఆదాయం కూడా రూ.58,228 కోట్ల నుంచి 4% పెరిగి రూ.60,583 కోట్లకు చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని