రిస్క్‌లేని పెట్టుబ‌డుల‌కు మ‌హిళ‌ల ప్రాధాన్యం

యాబై కంటే ఎక్కువ శాతం మ‌హిళ‌లు రిస్క్ తీసుకోకుండా త‌మ‌ పెట్టుబ‌డుల‌ను ఎఫ్‌డీ, పీపీఎఫ్‌లో పెట్టేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు..........

Updated : 01 Jan 2021 19:02 IST

యాబై కంటే ఎక్కువ శాతం మ‌హిళ‌లు రిస్క్ తీసుకోకుండా త‌మ‌ పెట్టుబ‌డుల‌ను ఎఫ్‌డీ, పీపీఎఫ్‌లో పెట్టేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు.

దేశంలో మ‌హిళ‌లు రిస్క్ లేకుండా చేసే పెట్టుబ‌డుల‌కే ప్రాధాన్యం ఇస్తున్న‌ట్లు ఒక స‌ర్వే తెలిపింది. 58 శాతం మంది ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా పీపీఎప్ పెట్టుబ‌డుల‌వైపే మొగ్గుచూపుతున్న‌ట్లు వెల్ల‌డైంది. మ‌రో 6 శాతం మ‌హిళ‌లు బంగారం కొన‌డానికి ఆస‌క్తి చూపిస్తుండ‌గా,15 శాతం మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను ఎంచుకుంటున్నారు.

అక్టోబ‌ర్ 2019 లో జ‌రిపిన ఆన్‌లైన్ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ సంస్థ‌ స్క్రిప్‌బాక్స్, స‌ర్వేలో 54 శాతం మిలీనియ‌ల్స్ (40 ఏళ్ల లోపు వారు) ఉండ‌గా, 46 శాతం ఇత‌రులు ఉన్నారు. ఈ యువ మ‌హిళా పెట్టుబ‌డుదారుల్లో మూడో వంతు మ‌హిళ‌లు పొదుపు చేసేంద‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆరుగురిలో ఒక‌రు ప‌ర్య‌ట‌న‌ల కోసం డ‌బ్బును దాచుకుంటున్నారు.

మిలీనియల్స్ కానివారిలో సగం మంది రిటైర్మెంట్ కోసం నిధిని ఏర్పాటు చేసుకోవ‌డం లేదా వారి పిల్లల విద్య కోసం నిధులను కేటాయించడం వంటి పెట్టుబడి లక్ష్యాలను అనుసరిస్తున్నారు. ప‌న్ను ఆదా కోసం పీపీఎఫ్‌, బీమా వంటివి ఎంచుకుంటున్నారు. ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌నే 33 శాతం మంది ముఖ్య‌మైన పెట్టుబ‌డి సాధనాలుగా ఎంచుకుంటున్నారు. 26 శాతం మంది మ్యూచువ‌ల్ ఫండ్ల ద్వారా ఆర్థిక ల‌క్ష్యాల‌ను నేరవేర్చుకోవ‌చ్చ‌ని తెలుసుకున్న‌ట్లు చెప్పారు. క‌ష్టపడి సంపాదించిన డబ్బును ఆదా చేసేటప్పుడు లేదా పెట్టుబడి పెట్టేటప్పుడు తమ డబ్బును సులభంగా పొందడం తమకు ముఖ్యమని దాదాపు 44 శాతం మంది మహిళలు అభిప్రాయ‌ప‌డ్డారు.

పొదుపు, పెట్టుబ‌డులు రెండూ ఒక నాణేనికి రెండు వైపుల వంటివి. అయితే వాటి ద్వారా వ‌చ్చే రాబ‌డిలో తేడా ఉంటుంది. పొదుపు అనేది డ‌బ్బును కొంత దాచుకోవ‌డం. దాని నుంచి రాబ‌డిని ఆశించలేం. ఇక పెట్టుబ‌డుల విష‌యానికొస్తే సంప‌ద‌ను మ‌రింత పెంచుకునేందుకు క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బును ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం రాబ‌డి పొందేలా వివిధ ప‌థ‌కాల‌లో పెట్టుబ‌డులుగా పెట్ట‌డం. భ‌విష్య‌త్తులో వ‌చ్చే ఖ‌ర్చులు, ఆర్థిక ల‌క్ష్యాలను దృష్టిలో పెట్టుకొని ద్ర‌వ్యోల్బ‌ణాన్ని అదిగ‌మించేలా ఈ పెట్టుబ‌డులు ఉండాలి.

స‌ర్వే ప్ర‌కారం, రిస్క్ లేకుండా పెట్టే పెట్టుబ‌డుల‌ను మ‌హిళ‌లు ఎంచుకుంటున్నారు. 36 శాతం మంది అత్య‌వ‌స‌ర నిధిని ఏర్పాటు చేసుకుంటుండ‌గా, పిల్ల‌ల చ‌దువుల కోసం 28 శాతం, ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం 26 శాతం మంది డ‌బ్బును పొదుపు చేస్తున్నారు. ఇక్క‌డ చెప్పుకోవాల్సిన ఇంకో విష‌యం ఏంటంటే మ‌రో 25 శాతం మ‌హిళ‌లు అస‌లు ఆర్థిక విష‌యాల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. భ‌విష్య‌త్తు ఆర్థిక అవ‌స‌రాల గురించి ఎలాంటి ఆలోచ‌న‌లు లేకుండా ఉన్నారు.

28 శాతం మంది వారి ఆర్థిక ప్ర‌ణాళిక‌తో ల‌క్ష్యాల‌ను చేరుకుంటామ‌నే విష‌యంలో న‌మ్మ‌కంగా ఉన్నారు. 15 శాతం మ‌హిళ‌లు ఆర్థిక విష‌యాల గురించి ఇత‌ర కుటుంబ స‌భ్యులు చూసుకుంటార‌ని చెప్తున్నారు. 44 శాతం మంది ఆర్థిక అవ‌గాహ‌న పెంచుకునేందుకు ఆస‌క్తి చూపిన‌ట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని