ఏడుగురిపై అత్యాచారం.. బ్లాక్‌మెయిలింగ్‌.. అరెస్ట్‌

మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ 40 ఏళ్ల వ్యాపార వేత్త ఏడుగురిపై అత్యాచారం చేసి బ్లాక్‌మెయిలింగ్‌కు దిగాడు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఆరుగురు మహిళలు...

Updated : 15 Sep 2020 17:03 IST

ఓ యువతి ఫిర్యాదుతో కటకటాలపాలైన వ్యాపారవేత్త

సాత్నా: మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ 40 ఏళ్ల వ్యాపార వేత్త ఏడుగురిపై అత్యాచారం చేసి బ్లాక్‌మెయిలింగ్‌కు దిగాడు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఆరుగురు మహిళలు వెనకడుగు వేయగా.. ఓ 16 ఏళ్ల బాధితురాలు మాత్రం ధైర్యం చేయడంతో నిందితుడు కటకటాలపాలైన సంఘటన సాత్నా జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా ఎస్పీ రియాజ్‌ ఇక్బాల్‌ కథనం ప్రకారం.. 16 ఏళ్ల యువతిని సమీర్‌ అనే పేరుతో రెండేళ్ల కిందట సదరు వ్యాపారవేత్త పరిచయం చేసుకున్నాడు. మాయమాటలు చెప్పి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని హెచ్చరించడంతోపాటు.. బ్లాక్‌మెయిలింగ్‌కు దిగేవాడు. అయితే నిందితుడి చర్యలతో విసిగిపోయిన బాధితురాలు కొల్గావాన్‌ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని గత శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అయితే, విచారణలో పలు దిగ్భ్రాంతికర విషయాలు బయటకొచ్చాయి. సమీర్‌ అలియాస్‌ అతీక్‌కు రెండు పేర్లతో పాస్‌పోర్టులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 

బాధిత యువతితో పరిచయం కాకముందు నిందితుడు పలువురు మహిళలను ఇదే విధంగా బ్లాక్‌మెయిల్‌ చేసేవాడని విచారణలో పోలీసులు తేల్చారు. ఓ మహిళను పెళ్లి చేసుకుని ఆమెను వేరే మతంలోకి మార్చేసి, 2017లో ఆమెకు విడాకులు ఇచ్చేసిన తర్వాత కూడా బెదిరింపులకు దిగేవాడు. మహిళలతో కొంతకాలం సంబంధాలు కొనసాగించి ఆ తర్వాత బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడి పెద్ద మొత్తంలో సొమ్మును డిమాండ్‌ చేసేవాడని గుర్తించినట్లు ఎస్పీ రియాజ్‌ ఇక్బాల్‌ తెలిపారు. విచారణ సందర్భంగా తమ బాధలను పోలీసులకు వివరించిన మహిళలు ఎఫ్‌ఐఆర్‌ మాత్రం నమోదు చేయొద్దని వాపోయారు. ఇంకా తమ విచారణలో ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన పలు నకిలీ లెటర్ హెడ్స్‌ దొరికాయని చెప్పారు. వీటిని ఉపయోగించి వీఐపీ కోటాలో రైళ్లలో ప్రయాణించేవాడన్నారు. అక్రమంగా సొమ్మును రుణాలుగా ఇచ్చేవాడని వివరించారు. నిందితుడికి సంబంధించి నేరాలను విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందంను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రియాజ్‌ ఇక్బాల్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని