Crime news: బాలికపై గ్యాంగ్‌రేప్‌, హత్య.. గోనె సంచిలో మృతదేహం

తొమ్మిది రోజుల క్రితం కనిపించకుండాపోయిన 14 ఏళ్ల బాలిక శవమై తేలింది. పాక్షికంగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మైనర్‌ మృతదేహాన్ని.......

Updated : 21 Feb 2022 17:32 IST

దిల్లీ: తొమ్మిది రోజుల క్రితం కనిపించకుండాపోయిన 14 ఏళ్ల బాలిక శవమై తేలింది. పాక్షికంగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మైనర్‌ మృతదేహాన్ని ఔటర్ దిల్లీలోని నరేలా ప్రాంతంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆ తర్వాత గొంతు నులిమి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. గోనె సంచిలో శవాన్ని కుక్కి ఓ దుకాణం సమీపంలో పడేశారని తెలిపారు.

ఈ ఘటనలో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినట్లు డీసీపీ బ్రిజేంద్ర కుమార్ యాదవ్ వెల్లడించారు. సదరు వ్యక్తి స్థానికంగా ఓ దుకాణంలో పనిచేసేవాడని.. దిల్లీ నుంచి ముంబయికి పారిపోతుండగా సన్నోత్‌ గ్రామంలో అతడిని పట్టుకున్నట్లు వివరించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే అరెస్టు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

డీసీపీ వివరాల ప్రకారం.. నరేలా ప్రాంతానికి చెందిన ఓ బాలిక ఫిబ్రవరి 12 నుంచి కనిపించకుండా పోయింది. ఆమె కోసం గాలించిన తల్లిదండ్రులు ఆచూకీ లభించకపోవడంతో మూడు రోజుల తర్వాత పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ శనివారం నరేలాలోని ఓ దుకాణ యజమాని నుంచి పోలీసులకు ఫోన్‌ వెళ్లింది. తన షాప్ సమీపంలో తీవ్ర దుర్గంధం వెలువడుతోందని పేర్కొన్నాడు. దీంతో  పోలీసులు వెళ్లి తనిఖీ చేయగా.. ఓ గోనె సంచిలో పాక్షికంగా కుళ్లిన శవం బయటపడింది. కాగా అది కిడ్నాప్‌కు గురైన​  బాలికదేనని నిర్ధరించారు.

తన దుకాణంలో పనిచేసే వ్యక్తి మూడు రోజులుగా కనిపించడం లేదని ఫోన్‌ చేసిన వ్యక్తి సమాచారం ఆధారంగా టెక్నికల్ సర్వైలెన్స్​తో ఆ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. స్నేహితుడితో కలిసి మద్యం సేవించి తర్వాత.. బాలికకు నిందితుడు ఫోన్ చేశాడు. ఏదో పనిఉందని పిలిపించాడు. అతడి మాటలు నమ్మివచ్చిన బాలికను కిడ్నాప్‌ చేసి.. నిందితులిద్దరు ఒకరి తర్వాత మరొకరు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక ధరించిన ప్యాంటుతోనే ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు డీసీపీ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని