logo

వంట ఆలస్యమైందని భార్య హత్య

ఉపాధి నిమిత్తం ఇతర రాష్ట్రం నుంచి నాలుగు రోజుల క్రితం నగరానికి వలసొచ్చిన ఆ కుటుంబం మనుగడ మూణ్నాళ్ల ముచ్చటైంది. వంట ఆలస్యంపై దంపతుల మధ్య తలెత్తిన వివాదంలో క్షణికావేశానికి లోనైన భర్త ఇటుకతో భార్య తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

Updated : 01 May 2024 09:15 IST

నవీన్‌ దుర్వే

నిజాంపేట, న్యూస్‌టుడే: ఉపాధి నిమిత్తం ఇతర రాష్ట్రం నుంచి నాలుగు రోజుల క్రితం నగరానికి వలసొచ్చిన ఆ కుటుంబం మనుగడ మూణ్నాళ్ల ముచ్చటైంది. వంట ఆలస్యంపై దంపతుల మధ్య తలెత్తిన వివాదంలో క్షణికావేశానికి లోనైన భర్త ఇటుకతో భార్య తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. బాచుపల్లి ఎస్సై జి.రమేశ్‌ వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన రవీనా దూబే(26), నవీన్‌ దుర్వే దంపతులు ఈ నెల 26న నగరానికి వలసొచ్చారు. ప్రగతినగర్‌లోని కళాశాల వసతిగృహం సమీపంలోని గుడిసెలో తాత్కాలికంగా నివాసముంటున్నారు. ఇద్దరు కుమార్తెలను సొంతూరులోనే ఉంచి.. ఏడాది వయసున్న బాబుతో ఇక్కడికి వచ్చారు. సోమవారం సాయంత్రం భార్యాభర్తలు బయటకు వెళ్లి రాత్రి 9 గంటలకు తిరిగి వచ్చారు. వంట త్వరగా చేయాలని నవీన్‌.. భార్యను తొందరపెట్టాడు. ఆమె కొంత ఆలస్యం చేసింది. ఈ విషయంపై వారి మధ్య వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన భర్త గుడిసె ఆవరణలో ఉన్న ఇటుకను తీసుకొని భార్య తల వెనుక భాగంలో బలంగా కొట్టాడు. ఆమె అక్కడికక్కడే మరణించింది. నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని