Crime News: కరీంనగర్‌లో కారు బీభత్సం.. నలుగురి దుర్మరణం

నగరంలో కారు బీభత్సం సృష్టించింది. కమాన్‌ వద్ద తెల్లవారుజామున కారు అదుపుతప్పి రోడ్డు పక్కన కొలిమి పనులు చేస్తున్న వారి మీదకు దూసుకెళ్లింది.

Updated : 30 Jan 2022 15:41 IST

కరీంనగర్‌: నగరంలో కారు బీభత్సం సృష్టించింది. కమాన్‌ వద్ద తెల్లవారుజామున కారు అదుపుతప్పి రోడ్డు పక్కన కొలిమి పనులు చేస్తున్న వారి మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మహిళా కూలీలు దుర్మరణం చెందారు. ముగ్గురికి గాయాలయ్యాయి. మృతిచెందిన వారిని ఫరియాద్‌, సునీత, లలిత, జ్యోతిలుగా గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన వారిని కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిలోనే జ్యోతి మృతిచెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మిగతా ముగ్గురు చనిపోయారు. 

ప్రమాదం జరిగిన అనంతరం కారును వదిలేసి నలుగురు యువకులు పరారయ్యారు. కారుపై 9 ఓవర్‌ స్పీడ్‌ చలాన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

కమాన్‌ ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతుండటంతో మున్సిపాలిటీ అధికారులు గతంలో ఇక్కడున్న గుడిసెలు తొలగించారు. దీంతో గుడిసెల్లో ఉండే వారు కోతిరాంపూర్‌లో నివాసం ఉంటున్నారు. రోజూ ఉదయాన్నే వివిధ పనుల కోసం వచ్చి కమాన్‌ వద్ద కూర్చుంటారు. మరికొందరు రోడ్డు పక్కన కొలిమి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కారు వేగంగా దూసుకొచ్చి పనులు చేసుకుంటున్న తమ వారి ప్రాణాలు తీసిందని మృతుల బంధువులు వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

మంత్రి గంగుల ఆర్థిక సాయం

రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు మంత్రి గంగుల కమలాకర్‌ ఆర్థికసాయం ప్రకటించారు. తక్షణసాయంగా రూ.10వేలు పంపించారు. ఈ సాయాన్ని ఆర్ఢీవో ఆనంద్‌కుమార్‌ మృతుల కుటుంబాలకు అందజేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని