ఆస్తి కోసం తండ్రిని కడతేర్చిన తనయుడు

ఆస్తి కోసం ఓ వ్యక్తి తన తండ్రినే కడతేర్చాడు. ఉరి వేసి కొన ఊపిరితో ఉండగా పురుగుల మందు తాగించి ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశాడు. గ్రామస్థుల అనుమానం మేరకు పోలీసులు హతుడి కొడుకును అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్లు నేరం ఒప్పుకొన్నాడు.

Published : 03 Jan 2020 07:33 IST

- ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం

చేవెళ్ల : ఆస్తి కోసం ఓ వ్యక్తి తన తండ్రినే కడతేర్చాడు. ఉరి వేసి కొన ఊపిరితో ఉండగా పురుగుల మందు తాగించి ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశాడు. గ్రామస్థుల అనుమానం మేరకు పోలీసులు హతుడి కొడుకును అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్లు నేరం ఒప్పుకొన్నాడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని ఎన్కెపల్లి గ్రామంలో రైతు హత్య కేసును ఛేదించినట్లు ఏసీపీ రవీందర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ బాలకృష్ణ, ఎస్సై రేణుకారెడ్డి తెలిపారు.  వారు తెలిపిన వివరాల ప్రకారం..

తండ్రి బతికి ఉంటే..
ఎన్కెపల్లి గ్రామానికి చెందిన బొమ్మిడి బుచ్చిరెడ్డి (55)కి విక్రంరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి కొడుకులు. బుచ్చిరెడ్డి తండ్రి చిన్న నారాయణరెడ్డి తమకున్న ఆస్తిలో మూడెకరాలను అదే గ్రామానికి చెందిన వారికి కొన్నేళ్ల క్రితం దానమిచ్చాడు. ప్రస్తుతం ఆ భూమి విలువ రూ.లక్షలు పలుకుతోంది. ఈ నేపథ్యంలో బుచ్చిరెడ్డి కొడుకులు ఆ భూమి తమకే చెందుతుందని కోర్టులో కేసు వేశారు. కుటుంబ తగాదాల నేపథ్యంలో రెండేళ్లుగా తండ్రిని సరిగ్గా చూసుకోవడం లేదు. తన తండ్రి భూమి సాగు చేసుకుంటున్న వారి దగ్గర డబ్బులు తీసుకుని రాజీ అవడానికి యత్నిస్తున్నాడని పెద్ద కొడుకు విక్రంరెడ్డికి అనుమానం వచ్చింది. తండ్రి బతికి ఉంటే ఆస్తి తమకు రాదని అంతం చేయాలని నిర్ణయానికి వచ్చాడు.

ఇద్దరి సహకారంతో హత్య..
తన తోడల్లుడైన వికారాబాద్‌ జిల్లా కొండాపూర్‌ గ్రామానికి చెందిన దామోదర్‌రెడ్డి, మామ నారాయణరెడ్డికి చెప్పి వారి సాయం కోరాడు. డిసెంబరు 27న వికారాబాద్‌ కోర్టులో కేసు విచారణ కోసం హాజరయ్యేందుకు బుచ్చిరెడ్డి రాగా పథకం ప్రకారం దామోదర్‌రెడ్డి అతన్ని మద్యం తాగుదామని తన పొలం (తరిగోపుల గ్రామం) వద్దకు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ కాపుకాసి ఉన్న విక్రంరెడ్డి.. తన తండ్రి మద్యం తాగి మత్తులోకి జారుకోగానే వెనుక నుంచి వచ్చి టవల్‌తో మెడకు చుట్టి  ఆత్మహత్యగా చిత్రీకరించాలని పురుగుల మందు తాగించి హత్య చేశాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత గోధుమగూడకు చెందిన నవీన్‌రెడ్డిని రప్పించి  టవేరా వాహనంలో మృతదేహాన్ని స్వగ్రామమైన ఎన్కెపల్లికి తరలించారు.

విక్రంరెడ్డిని ప్రశ్నించగా..
దాయాదులైన గుండ్ల నర్సింహులు పొలం వద్ద మృతదేహాన్ని పడవేసి ఏమీ తెలియనట్లు ఇళ్లకు వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం అటుగా వెళ్లిన వారు మృతదేహాన్ని గమనించి కుటుంబ సభ్యులకు తెలపగా వారు వచ్చి మృతుడి నోరు, ముక్కు నుంచి రక్తం కారినట్లు ఉండటంతో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో తాను చేసిన నేరాన్ని కుమారుడు ఒప్పుకోవడంతో సహకరించిన ముగ్గురిని కూడా పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని