అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ప్రవాసాంధ్రుడి దుర్మరణం

అమెరికాలోని బోస్టన్‌ నగరంలో గల లోగాన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో మార్చి 28న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోళ్ల విశ్వచంద్‌ (47) మృతిచెందారు.

Updated : 04 Apr 2023 06:30 IST

 బోస్టన్‌ విమానాశ్రయంలో దుర్ఘటన

న్యూయార్క్‌: అమెరికాలోని బోస్టన్‌ నగరంలో గల లోగాన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో మార్చి 28న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోళ్ల విశ్వచంద్‌ (47) మృతిచెందారు. అక్కడి టకెడా ఫార్మాస్యూటికల్‌ సంస్థలో విశ్వచంద్‌ డేటా విశ్లేషకుడిగా పనిచేస్తున్నారు. మసాచుసెట్స్‌ రాష్ట్ర పోలీసుల కథనం మేరకు.. విశ్వచంద్‌ గత నెల 28న సాయంత్రం 5 గంటలకు తన మిత్రుడైన సంగీత కళాకారుడిని తోడ్కొని వచ్చేందుకు విమానాశ్రయానికి వెళ్లారు. టెర్మినల్‌ ‘బి’లోని కింది అంతస్తులో తన కారు ఆపి, పక్కనే నిల్చున్నారు. అదే సమయంలో డార్ట్‌మౌత్‌ రవాణా సంస్థకు చెందిన బస్సు విశ్వచంద్‌ను ఢీకొట్టి కొంతదూరం లాక్కెళ్లింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ నర్సు అతన్ని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఘటనాస్థలంలోనే క్షతగాత్రుడు ప్రాణాలు కోల్పోయాడు. బస్సు నడిపిన మహిళా డ్రైవర్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై మృతుడి కుటుంబానికి సానుభూతి ప్రకటించిన డార్ట్‌మౌత్‌ సంస్థ.. పోలీసుల విచారణకు సహకరిస్తామని తెలిపింది. మృతుడి కుటుంబాన్ని ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటామని టకెడా సంస్థ ప్రకటించింది. మరోపక్క విశ్వచంద్‌ బంధువులు విరాళాల సేకరణ చేపట్టారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు