khammam: ఇద్దరు చిన్నారులతో తల్లి ఆత్మహత్య

పచ్చగా సాగిపోతున్న ఆ కుటుంబంలో షేర్లలో పెట్టుబడులు, బెట్టింగులు చిచ్చుపెట్టాయి. షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి దివాలా తీసిన భర్త...పుట్టింటినుంచి కట్నంగా ఇచ్చిన ఆస్తిని తీసుకురమ్మని వేధించడంతో భార్య ఇద్దరు పిల్లలతో చెరువులో దూకి తనువు చాలించింది.

Updated : 10 May 2023 08:46 IST

భర్త వేధింపులు భరించలేక బలవన్మరణం
కుటుంబంలో చిచ్చుపెట్టిన బెట్టింగులు షేర్లలో పెట్టుబడులు

సత్తుపల్లి, న్యూస్‌టుడే: పచ్చగా సాగిపోతున్న ఆ కుటుంబంలో షేర్లలో పెట్టుబడులు, బెట్టింగులు చిచ్చుపెట్టాయి. షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి దివాలా తీసిన భర్త...పుట్టింటినుంచి కట్నంగా ఇచ్చిన ఆస్తిని తీసుకురమ్మని వేధించడంతో భార్య ఇద్దరు పిల్లలతో చెరువులో దూకి తనువు చాలించింది. సత్తుపల్లి సీఐ కరుణాకర్‌, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటకు చెందిన అడపా కృష్ణారావు కుమార్తె మృదుల (38)ను సత్తుపల్లిలోని ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి పాటిబండ్ల ప్రశాంత్‌కు ఇచ్చి 2009లో వివాహం చేశారు. తర్వాత అమెరికా వెళ్లి ఉద్యోగం చేస్తూ మూడేళ్లపాటు భార్యతో నివాసం ఉన్నారు. అక్కడే పెద్దకుమారుడు ప్రజ్ఞాన్‌(7) జన్మించాడు. అయిదేళ్ల క్రితం తిరిగి హైదరాబాద్‌ వచ్చి హయత్‌నగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఆ తర్వాత మహాన్‌(5) పుట్టాడు. ప్రజ్ఞాన్‌ రెండో తరగతి, మహాన్‌ యూకేజీ చదువుతున్నారు. ఈ క్రమంలో షేర్లలో పెట్టుబడులు, బెట్టింగ్‌లతో అప్పులు కావడంతో కొండాపూర్‌లో ఉన్న ప్లాట్‌ను రూ.65 లక్షలకు అమ్మేసి అప్పులు తీర్చారు. భార్యకు కట్నంగా ఇచ్చిన రూ.2  కోట్ల విలువ చేసే ఏడున్నర ఎకరాల జీడిమామిడి తోటను కూడా అమ్మేయాలని ఏడాది నుంచి గొడవపడుతుండేవాడు. ఇదే విషయాన్ని మృదుల తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకుపోగా ‘ఇప్పటికే అన్నీ అమ్మేసుకుంటున్నారు. ఈ తోటను కూడా అమ్మేసుకోవద్దు’ అని వారు పలుమార్లు చెప్పారు. అయినా వినకుండా భార్యను వేధింపులకు గురి చేస్తుండటంతో ఓ సందర్భంలో ఆమె తల్లిదండ్రులు భర్తను వదిలేసి ఇంటికొచ్చేయమని చెప్పారు.

తోటను విక్రయించేందుకు వారం క్రితమే వచ్చి...

జీడిమామిడి తోటను అమ్మేందుకు వారం క్రితమే ప్రశాంత్‌ తన భార్య మృదుల, కుమారులు ప్రజ్ఞాన్‌, మహాన్‌లతో సత్తుపల్లిలోని తన సొంతింటికి వచ్చారు. మృదుల కుమారులతో కలిసి తన పుట్టింటికి వెళ్లి మూడు రోజులున్నారు. నాలుగు రోజుల క్రితమే దామెర చెరువు సమీప పిరమిడ్‌ ధ్యానమందిరంలో పెద్ద కుమారుడి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. విజయవాడలో ఉన్న తన పెద్దమ్మను మృదుల ఆదివారం సాయంత్రం పరామర్శించారు. సోమవారం రాత్రి సత్తుపల్లి బస్టాండ్‌కు చేరుకుని ఆమెకు ఫోన్‌ చేశారు. భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెప్పారు. తర్వాత ఆటోలో నేరుగా అయ్యగారిపేట శివారులోని దామెర చెరువుకు చేరుకున్నారు. బ్యాగు, ఫోన్‌ను చెరువు ఒడ్డున పెట్టారు. ప్రజ్ఞాన్‌ కాలికి చున్నీతో కట్టి, మహాన్‌ను ఎత్తుకుని చెరువులోకి దిగి బలవన్మరణానికి పాల్పడ్డారు. మంగళవారం తెల్లవారుజామున చెరువులో వారి మృతదేహాలను కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తాను చనిపోతే పిల్లలు అనాథలవుతారనుకుని.. వారితో కలిసి ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని