నకిలీ ధ్రువపత్రాల కేసులో 32 మందికి జైలుశిక్ష

నకిలీ సర్టిఫికెట్ల కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం 32 మంది నిందితులకు శిక్ష విధిస్తూ సీఐడీ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

Published : 10 Jun 2023 04:34 IST

25 ఏళ్ల కిందటి సీఐడీ కేసులో తీర్పు

అనంతపురం(మూడోరోడ్డు), న్యూస్‌టుడే: నకిలీ సర్టిఫికెట్ల కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం 32 మంది నిందితులకు శిక్ష విధిస్తూ సీఐడీ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 1997లో 35 మంది విద్యార్థులు పదో తరగతి నకిలీ ధ్రువపత్రాలతో అనంతపురంలోని పీవీకేకే కళాశాలలో చేరారు. వారి ధ్రువపత్రాలపై అనుమానం రావడంతో ప్రిన్సిపల్‌ సుబ్బన్న వాటిని పదో తరగతి బోర్డుకు పంపడంతో అవి నకిలీవని తేల్చారు. ప్రిన్సిపల్‌ ఫిర్యాదుతో 1998లో అనంతపురం జిల్లా గుంతకల్లు ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో 38 మందిపై కేసు నమోదు చేశారు. అంతకంటే ముందు మరో ముగ్గురు విద్యార్థులు తమకు నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చి మోసం చేశారని ఫిర్యాదు చేశారు. ఈ రెండు కేసులనూ సీఐడీకి అప్పగించారు. వీటికి సంబంధించి నకిలీ సర్టిఫికెట్ల సృష్టికర్త గ్లెయిన్‌ బ్రిగ్స్‌ (ఏ1), న్యాయవాది హనుమన్న(ఏ4), అబ్కారీ శాఖ కానిస్టేబుల్‌ బందుక అక్కులన్న(ఏ5)లతో పాటు నకిలీ ధ్రువపత్రాలు కొనుగోలు చేసిన వారినీ నిందితులుగా చేర్చారు. విచారణ నివేదికను 2005లో కోర్టుకు అందజేయగా, 50 మంది సాక్షులను విచారించగా, 278 సెట్ల దస్త్రాలను పరిశీలించింది. అనంతరం గ్లెయిన్‌ బ్రిగ్స్‌, హనుమన్న, బందుక అక్కులన్నలకు మూడేళ్లు జైలుశిక్ష, రూ.30 వేలు జరిమానా, మిగతా 29 మందికి ఆరు నెలల జైలుశిక్ష, రూ.2,500 జరిమానా చొప్పున విధిస్తూ సీఐడీ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఓంకార్‌ శుక్రవారం తీర్పు వెలువరించారు. ఈ కేసు విచారణలో ఉండగా ఆరుగురు నిందితులు చనిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని