కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీ కొట్టిన ద్విచక్రవాహనం

కల్వకుర్తి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రయాణిస్తున్న కారును.. ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యాయి.

Published : 07 May 2024 06:28 IST

బైక్‌పై వెళ్తున్న ఇద్దరి మృతి
ఎమ్మెల్యేకు తప్పిన ప్రాణాపాయం

తలకొండపల్లి, న్యూస్‌టుడే: కల్వకుర్తి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రయాణిస్తున్న కారును.. ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్‌లో సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నారాయణరెడ్డి.. తిరిగి కారులో కల్వకుర్తి వెళుతుండగా రామాసిపల్లి మైసమ్మ ఆలయం వద్ద ఈ ఘటన జరిగింది. రహదారిపై ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం వీరి కారును ఢీ కొట్టింది. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయిన కారు.. పక్కనే ఉన్న రాళ్ల గుట్టలపై నుంచి నీలగిరి తోటలోకి దూసుకుపోవడంతో ధ్వంసమైంది. కారులో బెలూన్లు తెరుచుకోవడంతో స్వల్ప గాయాలతో ఎమ్మెల్యే బయట పడ్డారు. ద్విచక్ర వాహనంపై వస్తున్న పబ్బతి నరేశ్‌ (25) అక్కడికక్కడే మృతి చెందగా.. బైరపాక పరశురాములు (35) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. తలకొండపల్లి మండలం వెంకటాపూర్‌కు చెందిన వీరిద్దరూ బైక్‌పై మిడ్జిల్‌ వెళ్లి వస్తూ ఎమ్మెల్యే కారును ఢీకొన్నారు. ఎమ్మెల్యేను కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి, తర్వాత హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందించారు. ఎస్సై శ్రీకాంత్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని