MP: ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. ఎనిమిది మంది మృతి!

ఓ ప్రైవేటు ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందినట్టు అధికారులు .....

Published : 01 Aug 2022 17:52 IST

జబల్పూర్‌: మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. అగ్నికీలలు ఎగసిపడుతుండటంతో ఆస్పత్రిలో రోగుల్ని ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. జబల్‌పూర్‌లోని గొహల్పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దామోహ్‌ నాకా ప్రాంతంలోని న్యూ లైఫ్‌ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఈ సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించినట్టు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ బహుగుణ తెలిపారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా తెలుస్తోందన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక యంత్రాలు, సహాయక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటివరకు మృతిచెందిన ఎనిమిది మందిలో ఐదుగురు రోగులు, ముగ్గురు ఆస్పత్రిసిబ్బంది ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అలాగే, డజన్‌ మందికి పైగా గాయాలపాలయ్యారని వివరించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

సీఎం శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ దిగ్భ్రాంతి..
ఆస్పత్రిలో అగ్నిప్రమాదం ఘటనపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటన తననెంతగానో కలిచివేసిందన్నారు. స్థానిక అధికారులు, కలెక్టర్‌తో తాను టచ్‌లోనే ఉన్నానని.. ఈ వ్యవహారంపై దృష్టిపెట్టాలని సీఎస్‌కు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. ఈ ఘటనలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు చొప్పున సాయం అందించనున్నట్టు ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఆయన.. వారి వైద్య సాయానికి అవసరమైన ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని