Suicide: నలుగురు పిల్లల్ని చంపేసి.. ఆత్మహత్య చేసుకున్న తల్లి!

రాజస్థాన్‌లో ఓ మహిళ తన నలుగురు పిల్లల్ని చంపేసి.. ఆపై ఉరివేసుకొని ఆత్మహత్యకు (Suicide) పాల్పడింది.

Updated : 04 Jun 2023 23:26 IST

బాడ్మేర్‌: ఏం కష్టమొచ్చిందో ఏమో.. ఓ మహిళ తన నలుగురు పిల్లల్ని చంపేసి బియ్యం డబ్బాలో కుక్కేసింది. అనంతరం పశువుల పాకలో ఉరివేసుకొని ఆత్మహత్యకు (Suicide) పాల్పడింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని (Rajasthan) బాడ్మేర్‌ (Barmer) జిల్లా మాండ్లీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జేతా రామ్‌, ఊర్మిళ భార్యాభర్తలు. వీరికి భావన (8), విక్రమ్‌ (5), విమల్‌ (3), మనీషా (2) సంతానం. ఊర్మిళ గృహిణి కాగా.. భర్త కూలీ పనులకు వెళ్తుంటాడు. శనివారం ఉదయం జేతారామ్‌ పని కోసం జోధ్‌పూర్‌ వెళ్లాడు. భర్త బయటకి వెళ్లిన తర్వాత ఊర్మిళ తన పిల్లల్ని చంపేసి బియ్యం డబ్బాలో కుక్కేసింది. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. సాయంత్రం ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మొత్తం 5 మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతులను కుటుంబ సభ్యులకు అప్పగించారు.

భర్తే చంపేశాడు: ఉర్మిళ మేనమామ

అదనపు కట్నం తేవాలంటూ ఊర్మిళను భర్త వేధించేవాడని ఆమె మేనమామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిత్యం భార్యాపిల్లల్ని కొడుతూ చిత్రహింసలు పెట్టేవాడని చెప్పాడు. కక్ష పెంచుకొని భార్యాపిల్లల్ని అతడే హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపించాడు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా ఆత్మహత్య చేసుకున్నట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఊర్మిళ మెడ చుట్టూ గాయాలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని