Andhra News: రేపల్లె అత్యాచార కేసును ఛేదించిన పోలీసులు.. ముగ్గురి అరెస్టు

బాపట్ల జిల్లాలోని రేపల్లె రైల్వేస్టేషన్‌లో మహిళపై సామూహిక అత్యాచారం కేసును పోలీసులు ఛేదించారు.

Updated : 01 May 2022 15:38 IST

రేపల్లె: బాపట్ల జిల్లాలోని రేపల్లె రైల్వేస్టేషన్‌లో మహిళపై సామూహిక అత్యాచారం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను బాపట్ల పోలీసులు అరెస్టు చేశారు. విజయ్‌కృష్ణ, నిఖిల్‌తో పాటు మరో మైనర్‌ బాలుడిని అరెస్టు చేసినట్లు బాపట్ల ఎస్పీ వకుల్‌ జిందాల్‌ వెల్లడించారు.

ఎస్పీ మాట్లాడుతూ.. ‘‘అవనిగడ్డలో పనుల కోసం భార్యభర్తలిద్దరూ నిన్న అర్ధరాత్రి సమయంలో రేపల్లే రైల్వేస్టేషన్‌లో దిగారు. ఆ సమయంలో అవనిగడ్డ వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో స్టేషన్‌లోని బల్లలమీద పడుకున్నారు. ఇదే సమయంలో ముగ్గురు వ్యక్తులు అక్కడకు వచ్చారు. టైమ్‌ అడిగి బాధితురాలి భర్తతో కావాలనే వివాదం పెట్టుకున్నారు. వాచీ లేదనడంతో ఆమె భర్తను కొట్టి రూ.750 లాక్కున్నారు. ఆ తర్వాత బాధితురాలి జుట్టు పట్టుకొని లాక్కెళ్లారు. బల్లపై నిద్రిస్తున్న మహిళను పక్కకు లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. వారికి అడ్డుపడ్డ మహిళ భర్తపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. రైల్వే స్టేషన్‌లో కొంత మంది మహిళలు ఉన్నారు. బాధితురాలి భర్త వారి సాయం కోరగా.. మేమేం చేయగలం అని అనడంతో స్టేషన్‌ బయటకు వెళ్లి కొంత మంది సాయం కోరాడు. 200 మీటర్ల దూరంలో పోలీసు స్టేషన్‌ ఉందని చెప్పడంతో వెంటనే వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పాడు. స్పందించిన స్టేషన్‌ సిబ్బంది రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. పోలీసు సైరన్‌ వినపడడంతో నిందితులు అక్కడ నుంచి పారిపోయారు. సంఘటనా స్థలానికి వెళ్లి చూసే సరికి.. ఆమెపై అత్యాచారం జరిగినట్లు గుర్తించాం. వారి నుంచి వివరాలు తీసుకొని బాధితురాలిని వెంటనే రేపల్లె సీహెచ్‌సీకి తరలించాం. మెరుగైన చికిత్స కోసం బాధితురాలనికి ఒంగోలు రిమ్స్‌కు తరలించాం.

కేసు నమోదు చేసిన వెంటనే దర్యాప్తు ప్రారంభించాం. రేపల్లె నుంచి జిల్లాలోని ఇతర ప్రాంతాలకు వెళ్లే అన్ని మార్గాల్లో వాహనాల తనిఖీలు చేపట్టాం. పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా నిందితులను గుర్తించాం. వెంటనే సీన్‌ ఆఫ్‌ క్రైంకి వెళ్లి చూడగా.. గాజులు, చెప్పులు గుర్తించాం. నేరం చేసిన తర్వాత నిందితుల్లో ఒకరు షర్ట్‌ మార్చుకున్న ప్రదేశాన్ని డాగ్ స్క్వాడ్‌ బృందం గుర్తించింది. లభించిన ఆధారాల ప్రకారం ముగ్గురు నిందితులకు ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. వారిని అరెస్టు చేశాం. కోర్టులో హాజరుపరిచిన తర్వాత నిందితులను రిమాండ్‌కు తరలిస్తాం. వారిలో ఒకరు గతంలో పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. బాధితురాలి భర్త ఇచ్చిన వివరాల ఆధారంగా కొన్ని గంటల వ్యవధిలోనే నిందితులను అదుపులోకి తీసుకున్నాం. ఈ కేసుకు సంబంధించి సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నాం. త్వరలోనే ఛార్జిషీట్‌ దాఖలు చేస్తాం. ఈ కేసులో బాపట్ల డీఎస్పీని విచారణ అధికారిగా నియమించాం’’ అని ఎస్పీ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని