న్యాయమూర్తులపై దుష్ప్రచారం.. వ్యక్తి అరెస్టు

న్యాయమూర్తులపై అబాండాలు వేస్తూ... వారి తీర్పులను తప్పుబడుతూ సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారనే అభియోగాలపై కడప పట్టణానికి..

Updated : 11 Jul 2021 12:20 IST

అమరావతి: న్యాయమూర్తులపై అబాండాలు వేస్తూ... వారి తీర్పులను తప్పుబడుతూ సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారనే అభియోగాలపై కడప పట్టణానికి చెందిన లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డిని సీబీఐ, ఏసీబీ (విశాఖ) విభాగం పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులతో పాటు సుప్రీంకోర్టుకు చెందిన పలువురు న్యాయమూర్తులపై ఫేస్‌బుక్, ట్విటర్, యూట్యూబ్, వాట్సాప్‌లలో అభ్యంతరకర పోస్టింగ్‌లు పెట్టడం, వారి తీర్పులపై అనుచిత వ్యాఖ్యలు చేయటంతో ఏపీ హైకోర్టు కేసును సుమోటోగా స్వీకరించింది. విచారణను సీబీఐకు అప్పగించింది.

ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వుల మేరకు ఏపీ సీఐడీ(సైబర్ క్రైం) పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీబీఐ, ఏసీబీ విశాఖ విభాగం డీఎస్పీ, కేసు విచారణాధికారి సంజయ్ కుమార్... నిందితుడు రాజశేఖర్ రెడ్డిని శుక్రవారం కడపలో అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఐపీసీ సెక్షన్లు 153ఏ, 504, 505, ఐటీ యాక్ట్‌ 67 ప్రకారం 16 మంది ప్రైవేటు వ్యక్తులతోపాటు మరికొందరు గుర్తు తెలియని వ్యక్తులపై 12 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. వీరిలో రాజశేఖర్ రెడ్డిని 15వ నిందితుడిగా ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. రాజశేఖర్ రెడ్డి కువైట్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడ నుంచే సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులపై పోస్టింగ్‌లు పెడుతున్నట్లు సీబీఐ గుర్తించింది. అతనిపై నిఘా పెట్టిన అధికారులు శుక్రవారం కడపకు రాగానే అదుపులోకి తీసుకున్నారు. తిరిగి కువైట్ వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారని తెలుసుకుని అతని పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు. 

న్యాయమూర్తుల తీర్పులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం, వారికి దురుద్దేశాలు ఆపాదించటం, అసభ్యంగా మాట్లాడి వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారనే నేరారోపణలపై సీబీఐ పోలీసులు కేసు నమోదు చేశారు. రాజశేఖర్‌రెడ్డిని ఇవాళ గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొంత మంది వివరాలు నిందితుడికి తెలుసునని.. లోతైన దర్యాప్తు చేయాల్సి ఉన్నందున నిందితుడిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం ఈనెల 12కు వాయిదా వేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని