మహిళల బాత్‌రూమ్‌లో కెమెరా.. ఆ ఫోన్‌లో సిమ్ కార్డ్ లేదట

జూబ్లీహిల్స్‌లోని వన్‌డ్రైవ్‌ ఫుడ్‌ కోర్టులో మహిళల బాత్‌రూమ్‌లో సెల్‌ఫోన్‌తో రహస్య చిత్రీకరణ జరిపిన ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ..

Updated : 23 Sep 2021 22:42 IST

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లోని వన్‌డ్రైవ్‌ ఫుడ్‌ కోర్టులో మహిళల బాత్‌రూమ్‌లో సెల్‌ఫోన్‌తో రహస్య చిత్రీకరణ జరిపిన ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. బాత్‌రూమ్‌ క్లీనర్‌గా పని చేసే బాలుడు ఫోన్‌ కెమెరా అమర్చినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై జూబ్లీహిల్స్‌ సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. ‘‘ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు మైనర్. మరో రెండు వారాలు గడిస్తే మైనారిటీ తీరుతుంది. నిందితుడు ఆరు నెలల క్రితమే పనిలో చేరాడు. వారం రోజుల క్రితమే స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశాడు. బాత్‌రూమ్‌లో వీడియో చిత్రీకరించే సమయంలో ఫోన్‌లో సిమ్ కార్డ్ లేదు. తన ఫోన్ నుంచి ఎవరికీ ఆ వీడియోలు పంపినట్లు మేం గుర్తించలేదు. హోటల్ యజమాని, సెక్షన్ ఇంఛార్జ్‌ని విచారిస్తున్నాం. అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌, హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నాం. తమ ఫుటేజ్‌ ఉందా అనే విషయాన్ని తెలుసుకునేందుకు బాధితులు ఎవరూ ఇంతవరకు స్టేషన్‌కు రాలేదు. ఇప్పటివరకు ఒక్కడే ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటన జరిగినప్పుడు కేశవ్‌ అనే వ్యక్తి అక్కడే ఉన్నాడు. ఈ విషయంలో అతని ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో విచారిస్తున్నాం. బాలుడు ఒక్కడే చేశాడా? లేదా ఎవరి ప్రోద్బలంతోనైనా చేశాడా? అనే విషయాలను తెలుసుకుంటాం. నిందితుడు మైనర్‌ కావడంతో జువైనల్‌ హోమ్‌కు తరలిస్తాం. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వన్ డ్రైవ్ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేస్తాం’’ అని సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.

ఘటనపై ఫుడ్‌కోర్టు యజమాని చైతన్య స్పందిస్తూ.. ‘‘ఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్న కేశవ్‌ను పోలీసులు విచారించాలి. అతను మా దగ్గర నుంచి డబ్బు గుంజాలని ప్రయత్నించాడు. రూ.15 లక్షలిస్తే ఈ వ్యవహారాన్ని సెటిల్‌ చేస్తానని కేశవ్‌ చెప్పాడు. ఘటనపై మేమే పోలీసులకు చెబుతామని అన్నాం’’ అని పేర్కొన్నారు.

జూబ్లీహిల్స్‌లోని వన్‌డ్రైవ్‌ ఫుడ్‌ కోర్టులోని మహిళల బాత్‌రూమ్‌లో సెల్‌ఫోన్‌తో రహస్య చిత్రీకరణ జరపడం కలకలం రేపింది. బాత్‌రూమ్‌లో కెమెరా ఆన్‌చేసిన సెల్‌ఫోన్‌ను ఓ యువతి గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. నిన్నంతా ఫోన్‌ కెమెరా ఆన్‌లోనే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. బాత్‌రూమ్‌ క్లీనర్‌గా పని చేసే బాలుడు ఫోన్‌ కెమెరా అమర్చినట్టు దర్యాప్తులో తేలింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని