Kidnap: నా అనుమతితోనే జానీ తీసుకెళ్లాడు.. సిరిసిల్ల యువతి కిడ్నాప్‌ కేసులో ట్విస్ట్‌

రాజన్న సిరిసిల్ల జిల్లాలో యువతి కిడ్నాప్‌ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. తనను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదంటూ సదరు యువతి పెళ్లి చేసుకున్న వీడియోను విడుదల చేసింది.

Updated : 20 Dec 2022 16:41 IST

చందుర్తి: రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలకలం రేపిన యువతి కిడ్నాప్‌ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. జిల్లాలోని చందుర్తి మండలం మూడపల్లిలో నలుగురు యువకులు ఇవాళ తెల్లవారుజామున  కారులో వచ్చి షాలిని అనే యువతిని బలవంతంగా తీసుకెళ్లారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆమె తండ్రిని తోసేసి యువతిని కారులో తీసుకెళ్లారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్‌ కావడంతో  ఆ దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. ఇటీవల ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మన్నెగూడలో జరిగిన కిడ్నాప్‌ ఘటన మరువక ముందే అదే తరహాలో మరో ఘటన జరిగిందని అంతా భావించారు. కానీ, చివరికి కిడ్నాప్‌ ఘటనలో సీన్‌ రివర్స్‌  అయ్యింది.    తనను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదంటూ సదరు యువతి తెలిపింది. జానీ అనే యువకుడిని పెళ్లి చేసుకుని సెల్ఫీ వీడియోను విడుదల చేసింది.

‘‘నాలుగేళ్లుగా జానీ, నేను ప్రేమించుకుంటున్నాం. నా కోరిక మేరకే జానీ నన్ను తీసుకెళ్లాడు. అతడిని ఇష్టపూర్వకంగా ప్రేమ వివాహం చేసుకున్నాను. మా తల్లిదండ్రులు పెళ్లి  సంబంధాలు చూస్తున్నారు. అందుకే.. వచ్చి తీసుకెళ్లమని జానీకి ఫోన్ చేసి చెప్పాను. తీసుకెళ్లేముందు అతనికి మాస్క్‌ ఉండడంతో గుర్తుపట్టలేదు. వచ్చింది జానీ అని తెలిసిన  తర్వాత ఇష్టపూర్వకంగానే వెళ్లి వివాహం చేసుకున్నాను. మా కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉంది. పోలీసులు రక్షణ కల్పించాలని మీడియా ద్వారా వేడుకుంటున్నా’’ అని వీడియోలో పేర్కొంది. 

ఏడాది నుంచి వేర్వేరుగా ఉంటున్న ప్రేమికులు

జానీ, షాలినీ ఏడాది క్రితమే వివాహం చేసుకున్నారు. కానీ, అప్పటికి షాలిని మైనర్‌ కావడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జానీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏడాది నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ్టితో షాలినీకి మైనార్టీ తీరింది. దీనికితోడు ఆమె తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మరొకరిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని షాలిని ఇదే విషయాన్ని జానీకి చెప్పింది. తనను తీసుకెళ్లాలని కోరింది. దీంతో ఇవాళ తెల్లవారుజామున మరో ముగ్గురితో కలిసి కారులో వచ్చిన యువకుడు ఆమెను తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని