Darbhanga blast: నిందితుల ఇళ్లలో కీలక పత్రాలు

దర్భంగా పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ లోతుగా విచారణ జరుపుతోంది. ఇప్పటికే ఇద్దరు నిందితులు మహ్మద్‌ నాసిర్‌ మాలిక్‌, ఇమ్రాన్‌ మాలిక్‌లను అదుపులోకి

Updated : 02 Jul 2021 13:19 IST

హైదరాబాద్‌: దర్భంగా పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ లోతుగా విచారణ జరుపుతోంది. ఇప్పటికే ఇద్దరు నిందితులు మహ్మద్‌ నాసిర్‌ మాలిక్‌, ఇమ్రాన్‌ మాలిక్‌లను అదుపులోకి తీసుకున్న దర్యాప్తు అధికారులు ఇవాళ వారిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం పట్నా తరలించారు. నిందితులిద్దరినీ పట్నా కోర్టులో హాజరుపరిచి తిరిగి కస్టడీలోకి తీసుకోవాలని ఎన్‌ఐఏ అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్‌ మల్లేపల్లిలోని నిందితుల ఇళ్లలో తనిఖీలు చేసిన ఎన్‌ఐఏ బృందం పలు కీలక పత్రాలు, పేలుడు పదార్థాలకు సంబంధించిన పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో వీరికి ఎవరైనా సహకరించారా అనే కోణంలో ఎన్‌ఐఏ అధికారులు విచారణ చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో హైదరాబాద్‌లో నివాసముంటున్న నాసిర్‌ మాలిక్‌, ఇమ్రాన్‌ మాలిక్‌లను ఎన్‌ఐఏ బుధవారం అరెస్ట్‌ చేసింది. జూన్‌ 17న బిహార్‌ దర్భంగా రైల్వేస్టేషన్‌లో వస్త్రాల పార్సిల్‌లో పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్‌ నుంచే ఈ పార్సిల్‌ను దర్భంగా రైలులో పంపించినట్లు తేలడంతో తెలంగాణ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ పోలీసుల సహకారంతో నాంపల్లిలో ఉంటున్న వారిద్దరినీ ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసింది. వీరిని విచారించిన క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా ఉగ్రవాదులతో వీరికి సంబంధమున్నట్లు తేలింది. వస్త్రాల మూటలో పేలుడు పదార్థాలను ఉంచినట్లు వెల్లడైంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని