logo

రూ.‘కోటి’.. చీకటి పాలు

ఒకవైపు రహదారి విస్తరణ లేక, మరోవైపు సిర్పూరు కాగితం మిల్లు(ఎస్పీఎం)కు నిత్యం ముడిసరకు లారీల రాకపోకల కారణంగా.. ఏడాదిలోపే రూ.కోటితో ఏర్పాటు చేసిన వెలుగులు విరజిమ్మే సెంట్రల్‌ లైటింగ్‌ వ్యవస్థ చీకటి పాలవుతోంది.

Published : 29 Mar 2024 05:40 IST

లారీలు ఢీకొని ధ్వంసమవుతున్న సెంట్రల్‌ లైటింగ్‌ స్తంభాలు
కాగజ్‌నగర్‌, న్యూస్‌టుడే

ఫారెస్టు ఆఫీసు సమీపంలో వంగిపోయిన సెంట్రల్‌ లైటింగ్‌ స్తంభం

  • ఎన్టీఆర్‌, లారీ చౌరస్తా క్రాసింగ్‌ల వద్ద ఓవర్‌లోడ్‌తో వస్తున్న లారీల నుంచి కర్రలు కింద పడిపోతున్నాయి. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. గత నెలలో ఓ లారీలోని కర్రలు సమీపంలోని ద్విచక్రవాహనదారుడిపై పడి అతను గాయపడ్డాడు.

  • 2000-02 లో రూ.1.50 కోట్ల వ్యయంతో కాగజ్‌నగర్‌ పురపాలిక పరిధిలోని తెలంగాణ తల్లి చౌరస్తా నుంచి రైల్వేగేటు వరకు డివైడర్‌, సెంట్రల్‌ లైటింగ్‌ను ఏర్పాటు చేశారు. అప్పట్లో నాసిరకంగా విద్యుత్తు స్తంభాలు, లైట్లు ఏర్పాటు చేయడంతో.. బిగించిన ఏడాదికే లైట్లు ఊడిపోయాయి. మరికొన్ని లారీలు తగిలి వంగిపోయాయి. ఇటీవలే పాత స్తంభాలను తొలగించి, కొత్తవి బిగించినప్పటికీ    మళ్లీ అదే పరిస్థితి నెలకొంది.

కవైపు రహదారి విస్తరణ లేక, మరోవైపు సిర్పూరు కాగితం మిల్లు(ఎస్పీఎం)కు నిత్యం ముడిసరకు లారీల రాకపోకల కారణంగా.. ఏడాదిలోపే రూ.కోటితో ఏర్పాటు చేసిన వెలుగులు విరజిమ్మే సెంట్రల్‌ లైటింగ్‌ వ్యవస్థ చీకటి పాలవుతోంది. గతేడాది కాగజ్‌నగర్‌ పురపాలిక పరిధిలోని తెలంగాణ తల్లి చౌరస్తా(పెట్రోల్‌పంపు) నుంచి రాజీవ్‌గాంధీ చౌరస్తా వరకు రూ.కోటి వ్యయంతో సెంట్రల్‌ లైటింగ్‌ను ప్రారంభించారు. రహదారి విస్తరణ లేక నిర్మాణాలు చేపట్టడంతో అనతికాలంలోనే ఆ స్తంభాలు ధ్వంసమవుతున్నాయి. ఆ రహదారికి ఇరువైపులా ఎస్పీఎం క్వార్టర్లు ఉన్నాయి. వాటిని తొలగించి రహదారి విస్తరణకు అప్పట్లో మిల్లు యాజమాన్యం నిరాకరించింది. దాదాపు 60 ఫీట్ల వెడల్పులో సెంట్రల్‌ లైటింగ్‌ విద్యుత్తు స్తంభాలు నిర్మించాలి. కానీ 45 నుంచి 50 ఫీట్లు వెడల్పు మాత్రమే ఉంది. ఆ రహదారిలోనే డివైడర్‌, సెంట్రల్‌ లైటింగ్‌ నిర్మాణం చేపట్టారు.

ప్రస్తుతం మిల్లుకు వివిధ రాష్ట్రాల నుంచి 10, 12 టైర్ల లారీలు ఓవర్‌ లోడ్‌(కర్ర)తో రాకపోకలు సాగిస్తుంటాయి. ఓవర్‌ లోడ్‌ కర్ర ఈ స్తంభాలకు తగలడంతో విద్యుత్తు దీపాలు ఊడిపోతున్నాయి. మరి కొన్ని వంగిపోతున్నారు. వారం రోజుల కిందట ఓ లారీ ఢీకొనగా.. ఒక స్తంభం వంగిపోయింది. మళ్లీ అదేరోజు సాయంత్రం మరో స్తంభాన్ని ఢీకొట్టింది. ఆ సమయంలో ఓ ఆటో, ద్విచక్ర వాహనదారుడిపై పడటంతో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఏడాదిల్లోపు 8 సెంట్రల్‌ లైటింగ్‌ స్తంభాలు వంగిపోగా.. మరో నాలుగు దీపాలు ఊడిపోయాయి. సత్వరమే రహదారిని విస్తరించి, సెంట్రల్‌ లైటింగ్‌కు లోడ్‌ లారీలు తగలకుండా చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు.

ఓవర్‌ లోడ్‌తో వస్తున్న ముడిసరకు లారీ

భారీ వాహనాలను నిషేధించాలి

ఎన్టీఆర్‌ చౌరస్తా నుంచి రాజీవ్‌గాంధీ చౌరస్తా వరకు రహదారి ఇరుకుగా ఉంది. ట్రాఫిక్‌ సమస్య నేపథ్యంలో మిల్లుకు నిత్యం లోడ్‌ లారీలను ఎన్టీఆర్‌ చౌరస్తా నుంచి సర్‌సిల్క్‌ ప్రధాన రహదారి గుండా లోపలికి అనుమతించాలి. బల్దియా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రత్యామ్నాయ మార్గంలో రాకపోకలు సాగాలి: అంజయ్య, కమిషనర్‌

ఎస్పీఎంకు నిత్యం వచ్చే లోడ్‌ లారీల వల్లే పురపాలిక సెంట్రల్‌ లైటింగ్‌ స్తంభాలకు తగిలి వంగిపోతున్నాయి. సత్వరమే ఈ రహదారి గుండా కాకుండా మరో రహదారి నుంచి ముడిసరకు లారీలు వచ్చే విధంగా యాజమాన్యం చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో యాజమాన్యానికి నోటీసు జారీ చేస్తామన్నారు. సెంట్రల్‌ లైటింగ్‌ స్తంభాలను ఢీకొన్న లారీలపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని