logo

చలికి చిరునామా.. లెక్క తెలుసుకోలేమా!

లంబసింగి.. ఇది ఒకప్పుడు మన్యంలోనే   ఎవ్వరికీ తెలియని కుగ్రామం పేరు. నేడు పొరుగు రాష్ట్రాల్లోనూ ఈ పేరు తెలియని వారు లేరు. సముద్రమట్టానికి సుమారు 3,600 అడుగుల ఎత్తులో ఉందీ గ్రామం.

Published : 06 Dec 2022 01:34 IST

లంబసింగిలో వాతావరణ కేంద్రం ఏర్పాటు ఎప్పుడో?

చింతపల్లి, న్యూస్‌టుడే

లంబసింగి.. ఇది ఒకప్పుడు మన్యంలోనే   ఎవ్వరికీ తెలియని కుగ్రామం పేరు. నేడు పొరుగు రాష్ట్రాల్లోనూ ఈ పేరు తెలియని వారు లేరు. సముద్రమట్టానికి సుమారు 3,600 అడుగుల ఎత్తులో ఉందీ గ్రామం.

భిన్నమైన భౌగోళిక వాతావరణ పరిస్థితుల  మధ్య ఉండటంతో ఇక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతంగా ప్రాచుర్యం పొందింది. దీంతోపాటు ఇక్కడ చలికాలంలో దట్టంగా కమ్ముకుని వర్షం చినుకుల్లా కురిసే పొగమంచు వంటి ప్రకృతి అందాలు, వాతావరణం పర్యటకులను ఆకట్టుకుంటున్నాయి.


ప్రసారమాధ్యమాలు, పత్రికల్లో లంబసింగి అందాల గురించి విస్తృతంగా ప్రచారం కావడంతో లంబసింగి ఆంధ్రా కశ్మీర్‌గా ఖ్యాతిని పొందింది. ఇంతకీ లంబసింగిలో ఉష్ణోగ్రత ఎంత అన్నది  శాస్త్రీయంగా తెలుసుకోవడం ఇబ్బందిగా మారింది.


...కేవలం చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలోని వాతావరణ పరిశీలనా కేంద్రంలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలను ప్రామాణికంగా తీసుకుని వాతావరణాన్ని అంచనా వేస్తున్నారు.

రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుందన్న విషయం ముందుగా తెలియడం చాలా వర్గాలకు అవసరం. ఒకప్పుడు వాతావరణ ఆధారిత వ్యవసాయం అనేది కొద్దిప్రాంతాలకే పరిమితం అయ్యేది. ప్రస్తుతం ఉన్నత పర్వతశ్రేణి గిరిజన మండలాల్లోనూ ఇది అమలవుతోంది. భారత వాతావరణ పరిశోధనా శాఖ (ఐఎండీ) గుర్తించిన వాతావరణ పరిశీలనా కేంద్రాన్ని చింతపల్లిలో 1995లో నెలకొల్పారు. గ్రామీణ కృషి మౌసం సేవ (జీకేఎంఎస్‌) ద్వారా ఈ ప్రాజెక్టు ప్రస్తుతం అమల్లో ఉంది.

లంబసింగి కూడలిలో దట్టంగా కురుస్తున్న పొగమంచు


సాధారణంగా ఉష్ణమాపకాల ద్వారా రోజూ ఉదయం, మధ్యాహ్న సమయాల్లో అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రతలను తెలుసుకుంటారు.   2010లో ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన్‌ను ఏర్పాటుచేశారు. ఇది స్వయం చాలితంగా పనిచేస్తుంది.


ముందుకు కదలని ప్రతిపాదన


 

చింతపల్లి వాతావరణ పరిశీలనా కేంద్రంలో ఉష్ణోగ్రతల నమోదు

లంబసింగిలోనూ ఆటోమెటిక్‌ వెదర్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది. 2017లో పుణెలోని ఐఎండీ అధికారులు దీని ఏర్పాటుకు సుముఖత వ్యక్తంచేశారు. అధికారికంగా దీనిని ఏర్పాటు చేస్తుండటం వల్ల రెండుసెంట్ల ప్రభుత్వ స్థలాన్ని తమకు కేటాయించాలని కోరారు. లంబసింగి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద స్థలాన్ని ఐఎండీ శాస్త్రవేత్తలు పరిశీలించి ఎంపికచేశారు. రెవెన్యూ స్థలాన్ని అధికారికంగా ఐఎండీకి అప్పగించాలంటే ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్‌ నుంచి అనుమతి తీసుకోవాలని స్థానిక రెవెన్యూ అధికారులు సూచించారు. దీంతో శాస్త్రవేత్తలు అప్పటి కలెక్టర్‌కు లేఖ రాశారు. ఏళ్లు గడిచినా అనుమతులు రాలేదు. జిల్లాల పునర్విభజన అనంతరమైనా దీనిపై చర్యలు తీసుకుంటే మేలు చేకూరుతుందని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.


ముందుగా తెలిస్తే మేలు

డాక్టర్‌ ఎస్‌.గణపతి, వాతావరణ విభాగం సహపరిశోధకులు

మన్యంలో భిన్నమైన భౌగోళిక  పరిస్థితుల కారణంగా వాతావరణం ఎప్పుడెలా ఉంటుందో తెలియదు. భిన్నమైన పరిస్థితుల ప్రభావం ప్రధానంగా గిరిజన రైతులు పండించే పంటలపై పడుతుంది. రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉంటుందన్న విషయం ముందుగా తెలిస్తే అనుగుణంగా రైతులు ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. చింతపల్లిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడల్లా లంబసింగిలో ఉష్ణోగ్రతలు ఎంత అంటూ పర్యటకులు మమ్మల్ని సంప్రదిస్తున్నారు. లంబసింగిలో వాతావరణ పరిశీలనా కేంద్రం ఏర్పాటుచేస్తే అక్కడి ఉష్ణోగ్రతలు కచ్చితంగా రాష్ట్రమంతా తెలిసే అవకాశం ఉంటుంది.


కలెక్టర్‌కు మరోసారి లేఖలు రాస్తాం

డాక్టర్‌ ఎస్‌.సురేష్‌కుమార్‌, ఏడీఆర్‌, వాతావరణ పరిశీలనా కేంద్రం నోడల్‌ అధికారి

లంబసింగికి వచ్చే పర్యటకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అక్కడకు వచ్చిన వారంతా ఎకో, అగ్రిటూరిజం అభివృద్ధిలో భాగంగా చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానానికి వచ్చి వెళ్లేలా పర్యటక శాఖతో మాట్లాడి ప్రత్యేక ప్యాకేజీ టూర్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాం. అక్కడ వాతావరణ పరిశీలనా కేంద్రం ఏర్పాటుకు అప్పట్లో. రెవెన్యూ అధికారులను సంప్రదిస్తే కలెక్టర్‌ అనుమతి కావాలన్నారు. ఇప్పుడు అల్లూరి జిల్లా ఏర్పాటైన నేపథ్యంలో మరోసారి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాస్తాం. అనుమతులు వస్తే ఐఎండీని సంప్రదించి కేంద్రం ఏర్పాటుకు మావంతు సహకరిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని