logo

విషాదంగా ముగిసిన విహారయాత్ర

ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు వచ్చిన యువకులను లారీ రూపంలో మృత్యువు కబళించింది.

Published : 04 Feb 2023 02:59 IST

మారేడుమిల్లి- చింతూరు ఘాట్రోడ్డులో లోయలో పడిన లారీ

మారేడుమిల్లి, రంపచోడవరం, న్యూస్‌టుడే: ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు వచ్చిన యువకులను లారీ రూపంలో మృత్యువు కబళించింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి- చింతూరు ఘాట్రోడ్డులో లారీ అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. మారేడుమిల్లి సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ఆరుగురు యువకులు మారేడుమిల్లి పర్యాటక ప్రాంతాల సందర్శనకు వచ్చారు. శుక్రవారం ఉదయం ఘాట్రోడ్డులోని అమృతధార జలపాతాన్ని సందర్శించారు. తిరిగి మారేడుమిల్లి వచ్చేందుకు రాజమహేంద్రవరం నుంచి చింతూరు వెళ్తున్న రేషన్‌ బియ్యం లారీ ఎక్కారు. మారేడుమిల్లి మండలం వాలమూరు వద్ద ప్రమాదకర మలుపులో లారీ లోయలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో దర్శికి చెందిన పిచ్చాల నారాయణరెడ్డి (28), గుమ్మడి నాగసురేశ్‌ (23) ఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. కోనసీమ జిల్లా మండపేటకు చెందిన లారీ డ్రైవర్‌ వెంకటేశ్వరస్వామితోపాటు దర్శికి చెందిన హర్షవర్ధన్‌రెడ్డి, సుబ్బారెడ్డి, చెన్నారెడ్డి గాయపడ్డారు.

అప్పటివరకు ఆనందంగా..

మన్యం అందాలు తిలకించేందుకు ఆరుగురు స్నేహితులు గురువారం ఉదయమే గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో రాజమహేంద్రవరం వచ్చి అక్కడి నుంచి గండిపోశమ్మ ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి బోటులో పాపికొండల విహారయాత్రకు వెళ్లి ఆనందంగా గడిపారు. సాయంత్రానికి మారేడుమిల్లి చేరుకుని ఇక్కడే బస చేశారు. శుక్రవారం ఉదయమే మారేడుమిల్లి- చింతూరు ఘాట్రోడ్డులోని అమృతధార జలపాతం అందాలు తిలకించేందుకు ఆర్టీసీ బస్సులో వెళ్లారు. అక్కడ గడిపిన తర్వాత తిరిగి మారేడుమిల్లికి లారీలో బయలుదేరారు. కొద్దిసేపటికే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. లారీ చెట్టుకు ఢీకొట్టడంతో అద్దాలు పగిలిపోయి నారాయణరెడ్డి రహదారిపై పడిపోగా, అతనిమీదుగా వాహనం వెళ్లిపోయింది. నాగసురేశ్‌ లారీతోపాటు లోయలో పడిపోయాడు. ఆయన మృతదేహాన్ని తీయడం కష్టతరంగా మారింది.

ఒకరు రైల్వే టీసీ.. మరొకరు ఎంసీఏ విద్యార్థి

మృతుల్లో ఒకరు రైల్వే టీసీ కాగా, మరొకరు ఎంసీఏ విద్యార్థి. నారాయణరెడ్డి క్రీడాకారుడి కోటాలో రైల్వేలో ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం ఒడిశాలో రైల్వే టీసీగా పనిచేస్తున్నారు. ఈ వేసవిలో ఈయనకు వివాహం చేయడానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారని స్నేహితులు తెలిపారు. నాగసురేశ్‌ ప్రస్తుతం ఎంసీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. మిగిలిన నలుగురు స్నేహితులు చిన్నచిన్న పనులు, ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

అతివేగమే కారణం

లారీ అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాదకర మలుపుల్లోనూ వాహనాన్ని వేగంగా నడపడంతో అదుపు తప్పినట్లు ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన కాశిరెడ్డి తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో చెట్టును ఢీకొట్టుకుంటూ లారీ లోయలోకి దూసుకుపోవడం గమనిస్తే వాహనం చాలా వేగంగా ప్రయాణించినట్లు అర్థమవుతోంది.

హుటాహుటిన సహాయక చర్యలు

ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే మారేడుమిల్లి పోలీసులు అప్రమత్తం అయ్యారు. సీఐ అద్ధంకి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మారేడుమిల్లి, గుర్తేడు ఎస్సైలు ఎన్‌.రాము, డి.జ్వాలాసాగర్‌ సిబ్బందితో ప్రమాద ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో రంపచోడవరం ఆసుపత్రికి తరలించారు.

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని