logo

గంటన్నదొర శత వర్ధంతి రేపు

విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు ప్రధాన అనుచరుడైన గాం గంటన్నదొర శత వర్ధంతిని ఈనెల 7న ఆయన స్వగ్రామం కొయ్యూరు మండలం బట్టపనుకుల పంచాయతీ లంకవీధిలో నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Published : 06 Jun 2023 05:50 IST

గాం గంటన్నదొర

కొయ్యూరు, న్యూస్‌టుడే: విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు ప్రధాన అనుచరుడైన గాం గంటన్నదొర శత వర్ధంతిని ఈనెల 7న ఆయన స్వగ్రామం కొయ్యూరు మండలం బట్టపనుకుల పంచాయతీ లంకవీధిలో నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గంటన్నదొర స్వగ్రామంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. అల్లూరి సీతారామరాజు జాతీయ యువజన సంఘం ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా కృష్ణదేవిపేటలోని అల్లూరి స్మారక ఉద్యానంలోని సమాధి వద్ద నివాళులు అర్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు తెలిపారు.

అల్లూరి కుడి భుజంగా గుర్తింపు

దేశానికి స్వాతంత్య్రం కోసం అల్లూరితో కలిసి పోరాటం చేసినవారిలో ముఖ్యులు గాం గంటన్నదొర, మల్లుదొర. వీరిద్దరూ అన్నదమ్ములు. తండ్రి బొగ్గుదొర, తల్లి అక్కమ్మ. గంటన్నదొర విలువిద్యలో మంచి నేర్పరి. బ్రిటీష్‌ సేనతో జరిగిన పోరాటాల్లో ధైర్యంగా పాల్గొన్నారు. మన్యంవీరుడితో కలిసి 1922 నుంచి 1924 వరకు బ్రిటీష్‌సేనపై జరిగిన వివిధ పోరాటాల్లో పాల్గొన్నారు. అల్లూరికి గంటన్నదొర కుడి భజంగా ఉంటూ కీలకపాత్ర పోషించేవారు. అల్లూరి మరణానంతరం బ్రిటిష్‌ పాలకులు అతని అనుచరులపై విరుచుకుపడ్డారు. 1924 జూన్‌ 7న వల్సంపేట సమీప మకరం మట్ట కాలువపైనున్న సింగధారలో తెల్లదొరలతో జరిగిన పోరాటంలో గంటన్నదొర వీర మరణం పొందారు. ఈయన మృతదేహాన్ని కృష్ణదేవిపేటలో ఖననం చేశారు. కృష్ణదేవిపేట అల్లూరి స్మారక ఉద్యానంలో అల్లూరి సీతారామరాజు సమాధి పక్కనే గంటన్నదొర సమాధి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని