logo

పేరు సర్కారుకు..అప్పులు ఉద్యోగులకు

ఏరు దాటకముందు ఏటి మల్లయ్య.. ఏరు దాటాక బోడి మల్లయ్య అన్నట్టుగా ఉంది జిల్లా ఉన్నతాధికారుల తీరు. జిల్లాస్థాయిలో అట్టహాసంగా ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించి, అందుకు మండల స్థాయి ఉద్యోగులతో లక్షలు ఖర్చు చేయించి..

Updated : 07 Jun 2023 05:40 IST

సదరం శిబిరం బిల్లులు రాక లబోదిబో!

సదరం శిబిరం ఏర్పాట్లపై సమీక్షిస్తున్న అప్పటి ఐటీడీఏ పీఓ గోపాలకృష్ణ, సబ్‌కలెక్టర్‌ అభిషేక్‌

చింతపల్లి, న్యూస్‌టుడే : ఏరు దాటకముందు ఏటి మల్లయ్య.. ఏరు దాటాక బోడి మల్లయ్య అన్నట్టుగా ఉంది జిల్లా ఉన్నతాధికారుల తీరు. జిల్లాస్థాయిలో అట్టహాసంగా ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించి, అందుకు మండల స్థాయి ఉద్యోగులతో లక్షలు ఖర్చు చేయించి.. బిల్లులు చెల్లించాల్సిన తరుణంలో పత్తా లేకుండాపోయారు. అప్పు తెచ్చి లక్షలు ఖర్చుపెట్టిన ఉద్యోగులు వడ్డీలు కడుతూ... తమకు బిల్లులు చెల్లించాలంటూ ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

గిరిజనులతో మమేకం అయ్యేందుకు పోలీసు శాఖ పలు సామాజిక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గతేడాది నవంబరు నెలలో చింతపల్లి ఏఎస్పీ ప్రతాప్‌ శివకిషోర్‌ ప్రత్యేకంగా సదరం శిబిరాన్ని నిర్వహించాలని భావించారు. ప్రభుత్వ అనుమతితో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను ఇందులో భాగస్వాములను చేశారు. వీరి ఆదేశాల మేరకు నవంబరు 4, 5 తేదీల్లో చింతపల్లి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమోన్నత పాఠశాల ఆవరణలో శిబిరం ఏర్పాటు చేశారు. వందల సంఖ్యలో వచ్చే దివ్యాంగులకు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అప్పటి ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి గోపాలకృష్ణ, సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ (ప్రస్తుత ఐటీడీఏ పీఓ) అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ శిబిరానికి అయ్యే ఖర్చు మొత్తం ఐటీడీఏ భరిస్తుందని హామీ ఇచ్చారు. ఉన్నతాధికారులు భరోసా ఇవ్వడంతో చింతపల్లి సహాయ గిరిజన సంక్షేమాధికారి జయలక్ష్మి, సీఏహెచ్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామరాజు పడాల్‌ సుమారు రూ. మూడు లక్షల మేర వ్యయాన్ని భరించారు. శిబిరం జరిగే పాఠశాల ప్రాంగణాన్ని పొక్లెయిన్‌తో చదును చేయడం దగ్గరనుంచి రెండు రోజులపాటు సదరం శిబిరానికి వచ్చిన వారికి  భోజనాలు వంటివి సమకూర్చారు. చింతపల్లి మండల పరిషత్తు కార్యాలయ సీనియర్‌ సహాయకుడు ఎన్‌.టి.రామారావు అప్పటి ఇన్‌ఛార్జి ఎంపీడీఓ రమేష్‌ సూచనతో సదరం శిబిరానికి పెట్టుబడి పెట్టారు. తనకున్న పరిచయాలతో తెలిసిన వారి దగ్గరనుంచి రూ. మూడు లక్షలు అప్పు చేశారు. ఆ డబ్బును టెంట్లు, ఇతరత్రా పనులకు వెచ్చించారు. ఇలా చింతపల్లిలో అధికారులంతా కలసి సుమారు సదరం శిబిరానికి రూ. 6 లక్షలకు పైగా ఖర్చు చేశారు. చింతపల్లి, గూడెంకొత్తవీధి, కొయ్యూరు మండలాల నుంచి పెద్దఎత్తున దివ్యాంగులు ఈ శిబిరానికి హాజరయ్యారు. సుమారు 15 మంది వైద్య నిపుణులు హాజరయ్యారు ఒకవైపు పరీక్షలు జరుగుతుండగానే వచ్చిన దివ్యాంగులతోపాటు వారి వెనుక సహాయకులుగా వచ్చిన వారందరికీ భోజన సదుపాయాలు కల్పించారు.


అధికారుల చుట్టూ ప్రదక్షిణలు

ఇంతవరకు బాగానే ఉన్నా పెట్టుబడి పెట్టిన ఉద్యోగులకు మొండిచెయ్యి ఎదురైంది. శిబిరం నిర్వహణకు అయిన బిల్లులు నెలలో అవుతాయనుకుంటే... ఎనిమిది నెలలు కావస్తున్నా నేటికీ అతీగతీ లేదు. మీరు ముందు ఖర్చుచేసి బిల్లులు పెట్టండి... ఐటీడీఏ నుంచి బిల్లులు చెల్లిస్తాం అంటూ చెప్పిన అప్పటి ప్రాజెక్ట్‌ అధికారి గోపాలకృష్ణ బదిలీపై వెళ్లిపోయారు. ఇన్‌ఛార్జి ఎంపీడీఓగా రమేష్‌ సైతం వేరేచోటకు వెళ్లిపోయారు. బిల్లులు చెల్లించేందుకు ఐటీడీఏలో నిధులు లేవు. దీంతో వీటిని ఎలా చెల్లించాలనే దానిపై ఇప్పుడు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఒకే కార్యక్రమానికి సంబంధించి రూ. లక్షల్లో బిల్లులు చెల్లించేందుకు నిబంధనలు అంగీకరించకపోవడంతో చెల్లింపు ప్రక్రియ ఆగిపోయింది. మండల పరిషత్‌ సాధారణ నిధుల నుంచి ఇవ్వాలన్నా అక్కడా సరిపడా నిధులు లేవు. బిల్లుల కోసం అధికారులను కలిస్తే ఉద్యోగి అయిన మీరు ఇంతెందుకు ఖర్చుచేశారన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

* అప్పులు చేసి పెట్టుబడులు పెట్టినా బిల్లులకు అతీగతీ లేకపోవడంతో చింతపల్లి ఎంపీడీఓ కార్యాలయ సీనియర్‌ సహాయకులు రామారావు కలెక్టర్‌, ఐటీడీఏ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. తీసుకున్న అప్పులకు తన జీతం నుంచి ఎనిమిది నెలలుగా వడ్డీ కట్టాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇదే విషయంపై స్పందనలోనూ కలెక్టర్‌కు వినతులు ఇచ్చినట్టు తెలిపారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని