logo

ధోని రాకకు.. నిలువెల్లా కనులై..!

మహేంద్ర సింగ్‌ ధోని.. ఈ పేరులోనే ఒక వైబ్రేషన్‌ ఉంది. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ అభిమానించే క్రికెటర్లలో ఒకరు. ధోని కోసమే స్టేడియానికి వచ్చే అభిమానులు ఎందరో.. ఐదేళ్ల తర్వాత విశాఖకు ఐపీఎల్‌ మ్యాచ్‌లు కేటాయించడం..

Updated : 30 Mar 2024 07:29 IST

నగర అభిమానుల ఎదురుచూపులు
31న దిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే: మహేంద్ర సింగ్‌ ధోని.. ఈ పేరులోనే ఒక వైబ్రేషన్‌ ఉంది. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ అభిమానించే క్రికెటర్లలో ఒకరు. ధోని కోసమే స్టేడియానికి వచ్చే అభిమానులు ఎందరో.. ఐదేళ్ల తర్వాత విశాఖకు ఐపీఎల్‌ మ్యాచ్‌లు కేటాయించడం.. అందులో సీఎస్‌కే మ్యాచ్‌ ఉండడంతో నగర వాసుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ధోని ఆటను కళ్లారా చూడాలని అభిమానులు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వారి కల నెరవేరనుంది.

ఐపీఎల్‌ మ్యాచ్‌ల కోసం పీఎంపాలెం ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మైదానం అంతా పచ్చని తివాచీలా తయారైంది. గ్యాలరీల్లో అభిమానులు కూర్చునేందుకు అనువుగా సీట్లు సిద్ధమయ్యాయి. డ్రెస్సింగ్‌ గదులు అద్భుతంగా ఉన్నాయి. మరో వైపు ఉల్లాసినులు (ఛీర్‌ గర్ల్స్‌) నృత్యాలకు ప్రత్యేకంగా స్టేజీలు ఏర్పాటు చేశారు. ఈనెల 31న దిల్లీ క్యాపిటల్స్‌- చెన్నై సూపర్‌కింగ్స్‌, ఏప్రిల్‌ 3న దిల్లీ క్యాపిటల్స్‌- కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు ఇక్కడ తలపడనున్నాయి. ఇక్కడ సీఎస్‌కే ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది.

ఆ మ్యాచ్‌ను మరిచిపోలేరు..

ఆదివారం జరగనున్న దిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ మ్యాచ్‌లో ధోని ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. విశాఖ పిచ్‌ ధోనీకి అన్ని విధాలుగా కలిసొచ్చిందని చెప్పవచ్చు. ఇక్కడ గతంలో పాక్‌పై చేసిన వీర విజృంభణను అభిమానులు ఎప్పటికీ మరిచిపోరు. విశాఖలో రెండు ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరుగుతుంటే సీఎస్‌కే మ్యాచ్‌కే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. దీనికి కారణం ధోనియే. ముందుగా 31న జరిగే సీఎస్‌కే మ్యాచ్‌ టికెట్లు విక్రయిస్తే ఏప్రిల్‌ 3న జరిగే మ్యాచ్‌కు ఆదరణ ఉండదని భావించిన నిర్వాహకులు ముందుగా 3వ తేదీ టికెట్లు విక్రయించడం గమనార్హం. అభిమానుల్లో అత్యధిక మంది ధోనీ 7వ నెంబరు జెర్సీని కొనుక్కొని స్టేడియంలో సందడి చేయడానికి సిద్ధమయ్యారు.

మూడు జట్లు ఇక్కడ ఆడినవే: దిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు గతంలో విశాఖ పిచ్‌పై ఆడినవే. ఆయా జట్లలోని క్రీడాకారులు కొందరు ఇతర ప్రాంఛైజీలకు వెళ్లగా, కొందరు ఆ జట్టుకే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నగరానికి చెందిన రిక్కీ భుయ్‌ దిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు ఆడుతుండగా, టెస్టు క్రికెటరు కె.ఎస్‌.భరత్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో ఉన్నాడు. గుంటూరుకు చెందిన ఆంధ్రా క్రీడాకారుడు రషీద్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని