logo

ఇసుక అక్రమాలు ఇన్నిన్ని కావయా!

తెదేపా ప్రభుత్వ పాలనలో గిరిజన ప్రాంతంలో ఉచితంగా లభించిన ఇసుక వైకాపా హయాంలో ప్రియమైంది.

Published : 10 May 2024 01:55 IST

తెదేపా పాలనలో ఉచితంగా లభ్యం
వైకాపా హయాంలో రెట్టింపు ధర
పెదబయలు, న్యూస్‌టుడే

తెదేపా ప్రభుత్వ పాలనలో గిరిజన ప్రాంతంలో ఉచితంగా లభించిన ఇసుక వైకాపా హయాంలో ప్రియమైంది. కొత్త ఇసుక విధానమంటూ రెట్టింపు ధరలు వసూలు చేసి ప్రజల నడ్డి విరిచారు. దీంతో ఏజెన్సీలోనే అతిపెద్ద ఇసుక క్వారీల్లో ఒకటైన మంగబంద క్వారీ అక్రమ తవ్వకాలకు నిలయంగా మారింది. అక్రమార్కులు కింది స్థాయి నుంచి పైస్థాయి నాయకుల వరకు మామూళ్లు ముట్టజెప్పినట్లు ఆరోపణలున్నాయి. నాలుగేళ్లపాటు అక్రమ తవ్వకాలు చేపట్టారు. ఏడాది క్రితం పంచాయతీలకు అనుమతుల పేరిట తాత్కాలిక రుసుం వసూలు చేయడంతో ధరలు మరింత అధికమయ్యాయి.

మంగబంద క్వారీలో ఇసుక తవ్వకాలు

వైకాపా ప్రభుత్వం మన్యంలో డిపోలు లేకుండా పారదర్శకంగా ఇసుక పంపిణీ చేస్తున్నట్లు ప్రకటనలు ఇచ్చింది. ఇది కేవలం ప్రకటనలకే పరిమితమైంది. ఎక్కడా ఇసుమంత ఇసుక లభించిన దాఖలాలు లేవు. ఈ పరిస్థితుల్లో పెదబయలు మండలంలోని మంగబంద క్వారీపై ప్రజాప్రతినిధుల కన్ను పడింది. అక్రమ తవ్వకాలకు ఇది నిలయంగా మారడం, కొంతమందికి మామూళ్లు అందకపోవడం, జిల్లాల పునర్విభనజన జరగడంతో వైకాపాలోనే ముసలం మొదలయింది. నాడు-నేడు మొదటి దశలో మైదాన ప్రాంతం ఇసుక వినియోగించడంతో ఖర్చు తడిసిమోపెడైంది. గత్యంతరం లేక ఇక్కడ ఇసుకనే ఆ పనులకు వినియోగించారు. డిమాండ్‌ పెరగడంతో అక్రమ తవ్వకాల జోరందుకున్నాయి. దీనిపై జిల్లా కలెక్టర్‌కు వైకాపా నాయకులే ఫిర్యాదు చేయడంతో కొద్ది రోజులు తవ్వకాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అనంతరం కొరత ఏర్పడడంతో జిల్లా కలెక్టర్‌, ఉప కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌, ఐటీడీఏ పీవోలు కలిసి ఎవరికీ ఇబ్బంది లేకుండా పంచాయతీలకు ఆదాయం వచ్చేలా అనుమతులు ఇచ్చారు. ఈ అనుమతులతో ఒకే బిల్లుతో రోజుకు రెండు, మూడు లోడ్లు తరలిస్తున్నారని, ప్రతి రోజూ వందల వాహనాల్లో లోడ్లు వెళుతున్నాయని ఆరోపణలు వచ్చాయి. కొంతమంది అధికారులతోపాటు మధ్యవర్తులు, నాయకులు లాభాలు ఆర్జిస్తున్నారు. మన్యంలో ఎప్పుడూలేని విధంగా వైకాపా హయాంలో ఇసుక ఇక్కట్లు ఎదురయ్యాయని పలువురు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని