logo

అప్పన్న నిజరూపం.. నేడే సాక్షాత్కారం

సింహాద్రి అప్పన్న స్వామి నిజరూప దర్శనం శుక్రవారం సాక్షాత్కారం కానుంది. ఆలయంలో ఒంటి గంటకే అర్చకులు స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలుపుతారు.

Published : 10 May 2024 02:00 IST

చందనంలో సుగంధ ద్రవ్యాలు మిళితం చేస్తున్న అర్చకులు

సింహాచలం, న్యూస్‌టుడే: సింహాద్రి అప్పన్న స్వామి నిజరూప దర్శనం శుక్రవారం సాక్షాత్కారం కానుంది. ఆలయంలో ఒంటి గంటకే అర్చకులు స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలుపుతారు. విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, విసర్జన పూజలు చేస్తారు. అనంతరం వెండి బొరిగెలతో అత్యంత సున్నితంగా స్వామి దేహంపై ఉన్న చందనాన్ని వేరు చేస్తారు. నిజరూపంలోకి వచ్చిన స్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహిస్తారు. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌ గజపతిరాజు, కుటుంబ సభ్యులకు తొలుత స్వామివారి నిజరూప దర్శనం కల్పిస్తారు. ఆ తర్వాత వేవకుజామున 4గంటల నుంచి సాధారణ భక్తులకు దర్శనాలు కల్పిస్తామని ఈవో పేర్కొన్నారు.

చందన సమర్పణకు సర్వం సిద్ధం: సింహాద్రినాథుడి నిజరూప దర్శనం అనంతరం తొలి విడత చందన సమర్పణకు వైదికులు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే సిబ్బంది అరగదీసిన మూడు మణుగుల చందనంలో (సుమారు 125 కిలోలు) గురువారం సుగంధ ద్రవ్యాలు మిళితం చేశారు. శుక్రవారం రాత్రి పవిత్ర గంగధార జలాలతో స్వామికి సహస్ర ఘటాభిషేకం జరుగుతుంది. సహస్ర ఘటాభిషేకం జరుగుతుండగా సాధారణ భక్తులకు దర్శనాలు కొనసాగనున్నాయి. చందన సమర్పణ అనంతరం పవళింపు సేవ జరుగుతుంది.

కశింకోట, న్యూస్‌టుడే: కశింకోటలో శ్రీవరాహలక్ష్మీ నరసింహస్వామి (సింహాద్రి అప్పన్న) చందనోత్సవాన్ని శుక్రవారం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఉదయం 4 గంటలకు పాత చందనాన్ని తొలగించి భక్తులకు నిజరూప దర్శనం కల్పిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు అత్తిలి కోదండపాణి ఆధ్వర్యంలో వేదపండితులు క్షీరాభిషేకం, పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు స్వామివారికి కొత్త చందనాన్ని అలంకరిస్తారు. భక్తుల రద్దీని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని