logo

స్మార్ట్‌ బాదుడుకు రంగం ‘సిద్ధం’!

‘దేశంలో నాలాగా సంక్షేమ పథకాలు అమలుచేసే ముఖ్యమంత్రి ఎవ్వరూ ఉండరు. బటన్లు నొక్కుతున్నాను.. నే..రుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు పడతా ఉన్నాయి.’

Updated : 10 May 2024 06:14 IST

తొలుత వాణిజ్య, పరిశ్రమల కేటగిరీలకు ప్రీపెయిడ్‌ మీటర్ల ఏర్పాటు
రెండోదశలో 200 యూనిట్లు దాటినవారికి తప్పనిసరి చేసే యోచన
ఒక్కొక్కరిపై రూ.13 వేల వరకు భారం.. నెలవారీ వసూళ్లు
ఈనాడు, పాడేరు

‘దేశంలో నాలాగా సంక్షేమ పథకాలు అమలుచేసే ముఖ్యమంత్రి ఎవ్వరూ ఉండరు. బటన్లు నొక్కుతున్నాను.. నే..రుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు పడతా ఉన్నాయి.’

జగన్‌ నోటి వెంట తరచూ వినిపిస్తున్న మాటలివి..

ఆయన బటన్‌ నొక్కితే అందే సాయం కంటే విద్యుత్తు వినియోగదారులు స్విచ్‌ నొక్కితే సర్కారు ఖజానాకు పోయే సొమ్ములే ఎక్కువగా ఉంటున్నాయి. వాడుతున్న కరెంటు ఛార్జీలకు మించి ట్రూఅప్‌, ఎఫ్‌పీపీసీఏ-1, 2 పేర్లతో అదనపు వడ్డింపులే భారీగా ఉంటున్నాయి. ఇప్పుడు వీటికి అదనంగా సార్మ్‌ మీటర్ల భారాన్ని వినియోగదారుల నెత్తిన పెట్టబోతున్నారు.

ప్రస్తుతం వినియోగిస్తున్న విద్యుత్తు మీటర్ల స్థానలో ప్రీపెయిడ్‌ మీటర్లను అమర్చనున్నారు. ఈ మీటర్ల కొనుగోలు నుంచి ఇన్‌స్టాలేషన్‌ వరకు అయ్యే వ్యయం సుమారు రూ.13 వేలను నెలవారీ బిల్లుల ద్వారా ఈఎమ్‌ఐ రూపంలో ఒక్కో వినియోగదారుడి నుంచి వసూలు చేయనున్నారు.

ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 17.66 లక్షల విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో వాణిజ్య, పరిశ్రమ, ప్రభుత్వ సంస్థల కేటగిరీ కనెక్షన్లు కలిపి 2.05 లక్షలున్నాయి. తొలుత ఈ మూడు కేటగిరీల మీటర్లను మార్చి స్మార్ట్‌ కమ్‌ ప్రీపెయిడ్‌ మీటర్లను అమర్చనున్నారు. వారు నెలవారీ వినియోగించే విద్యుత్తు, ఇతర సుంకాలకు అదనంగా ఈ మీటర్ల ఖర్చుని బిల్లులో కలిపి ఇవ్వనున్నారు. ఇప్పటికే కరెంటు బిల్లులు చూస్తేనే షాక్‌ కొట్టేలా ఉన్నాయి. వాటికి స్మార్ట్‌ బాదుడు కూడా తోడైతే జగనన్న ఇచ్చిన తోడు, చేదోడు పథకాల సాయానికి మించి మూడు నాలుగు రెట్లు ఎక్కువ తిరిగి చెల్లించే పరిస్థితి వస్తుంది. మొదటి విడత స్మార్ట్‌ బాధితుల్లో చిరు వ్యాపారులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లను షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌కు, మిగతా కేటగిరీలవి అదానీ సంస్థకు కేటాయించారు.

ప్రతినెలా రూ.130 అదనంగా .. వ్యవసాయ మీటర్ల ఖర్చును తామే భరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మిగతా కేటగిరీల మీటర్లకు అయ్యే వ్యయం వినియోగదారులే భరించాల్సి ఉంటుంది. ఒక్కో స్మార్ట్‌మీటర్‌పై సుమారు రూ.13 వేలు వరకు ఖర్చుచేయబోతున్నారు. నెలనెలా వినియోగించిన కరెంటు ఛార్జీలకు అదనంగా మీటర్ల ఏర్పాటుకు అయ్యే వ్యయం సుమారు రూ.130 ఈఎంఐగా బిల్లులో కలిపే ఇవ్వనున్నారు. ఇలా 93 నెలల్లో మీటరు సొమ్మును వినియోగదారుడి నుంచి రాబట్టుకోనున్నారు. ఉమ్మడి జిల్లాలో తొలివిడత 2.05 లక్షల మంది నుంచి సుమారు రూ.266 కోట్లు నెలవారీ వాయిదాల్లో వసూలు చేయనున్నారు.

గృహ విద్యుత్తు వినియోగదారులపైనా స్మార్ట్‌ కత్తి.. ఉమ్మడి జిల్లాలో 15 లక్షలకు పైగా గృహ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 200 యూనిట్ల పైబడి వాడిన కనెక్షన్లు సుమారు 8 లక్షల పైగా ఉన్నాయి. ఈ కేటగిరీ వినియోగదారుల మెడపై స్మార్ట్‌ కత్తి వేలాడే ఉంది. మొదటిదశలో వాణిజ్య, పరిశ్రమ కేటగిరీ కనెక్షన్లకు అమర్చిన తర్వాత రెండో దశగా గృహ విద్యుత్తులో ఎక్కువ కరెంటు వినియోగించే వారికి ప్రీపెయిడ్‌ మీటర్లు ఏర్పాటు చేయనున్నారు. వీరు కూడా స్మార్ట్‌ మీటర్లకు అయ్యే సొమ్మును నెలవారీ బిల్లుల రూపంలో చెల్లించాల్సిందే. ఇప్పటికే ట్రూఅప్‌, ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో గత మూడేళ్లలో రూ.946 కోట్లు విద్యుత్తు వినియోగదారుల నుంచి పిండుకున్నారు. ఇప్పుడు స్మార్ట్‌ మీటర్ల రూపంలో మరో రూ. వెయ్యి కోట్లపైగా వసూళ్లకు సిద్ధమవుతున్నారు.
ఎన్నికల నేపథ్యంలో ఈనెల 11 నుంచి 13వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు, జిల్లా ఎక్సైజ్‌ అధికారి అబ్దుల్‌ ఖ్వాదిర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఎక్సైజ్‌ నేరాలకు సంబంధించి 78159 08949 నంబరుకు ఫిర్యాదు ఇవ్వాలని కోరారు.

పాడేరు, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని