logo

నిర్మాణాలు కుంగదీశావ్‌.. బతుకులు కూల్చేశావ్‌!

భవన నిర్మాణ రంగం ఉపాధికి పెద్ద దిక్కు.   లక్షలాది మంది కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు.

Updated : 10 May 2024 04:57 IST

ఇసుక కొరత, సిమెంటు ధర పెంపుతో పడకేసిన కట్టడాలు
సంక్షేమ పథకాలను నిలిపేసిన వైకాపా సర్కారు
ఈనాడు, పాడేరు, న్యూస్‌టుడే, పాయకరావుపేట

భవన నిర్మాణ రంగం ఉపాధికి పెద్ద దిక్కు.   లక్షలాది మంది కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరి జీవన ప్రమాణాల మెరుగు కోసం తెదేపా ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇచ్చింది. ఉచిత ఇసుక విధానం తెచ్చి నిర్మాణ రంగానికి ప్రోత్సాహానిచ్చింది. భవన నిర్మాణ కార్మికులకు నిత్యం పనులు కల్పించింది. వారి సంక్షేమానికి పథకాలను అందించి ఆర్థికంగాను ఆదుకుంది. వైకాపా సర్కారు వచ్చాక ఒక్కసారిగా భవన కార్మికుల బతుకులు రివర్స్‌ అయ్యాయి. ఉచిత ఇసుక ఎత్తేశారు.. సిమెంటు ధరలు పెంచేశారు.. నిర్మాణ రంగం స్తంభించిపోయింది. వారి సంక్షేమ పథకాలను నిలిపేసింది. కూలీలకు పనులు దొరక్క వలసలు పోయే పరిస్థితి వచ్చింది. అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో 62 వేల కుటుంబాలు భవన నిర్మాణం, అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరంతా గత  అయిదేళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తెదేపా హయాంలో మేలు

తెదేపా ప్రభుత్వంలో కార్మిక శాఖ ద్వారా పలు సంక్షేమ పథకాలు అందుబాటులో ఉండేవి. భవన నిర్మాణ బోర్డుకు ఏడాదికి రూ.12 కార్మికులు చెల్లిస్తే సరిపోయేది. మేస్త్రి కుమార్తె వివాహానికి రూ.10 వేలు ఆర్థికసాయం వచ్చేది. వారి కుటుంబంలో భార్య, కుమార్తె ప్రసవ ఖర్చుల కింద రూ.20 వేలు ఇచ్చేవారు. ప్రమాదబీమా వర్తించేది. రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు బీమా సొమ్ము చెల్లించేవారు. గాయపడిన వారికి గాయాల తీవ్రతను బట్టి వైద్యం ఖర్చులకు రూ.లక్ష వరకు సాయం అందేది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను పూర్తిగా రద్దు చేశారు. అంతేగాక బోర్డులోని సుమారు రూ.2 వేల కోట్లు నిధులు వేరే పథకాలకు మార్చేశారు. కొవిడ్‌ సమయంలో కల్యాణమస్తు పథకంలో భాగంగా కార్మికులకు రూ.5 వేలు ఖాతాల్లో వేస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించి కార్మిక శాఖ ద్వారా భవన నిర్మాణ కార్మికుల నుంచి ఆధారకార్డులు, వివరాలు తీసుకున్నారు. ఆ తర్వాత ఆ మాటే మరిచారు.

పనులు చేస్తున్న భవన నిర్మాణ కార్మికులు

ఇసుకే బంగారమాయే...

జిల్లాలో భవన నిర్మాణాలకు ఇసుక కొరత ఇప్పటికీ వేధిస్తోంది. పూర్తిస్థాయి ఇసుక నిల్వ కేంద్రాలు లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంలో సరిపడా దొరక్కపోవడంతో రాజమహేంద్రవరం నుంచి తెప్పించుకోవాల్సి వస్తోంది. ఇది కొనుగోలుదారులకు అదనపు భారంగా మారుతోంది. ఇదివరకు అనకాపల్లి, అచ్యుతాపురం, చోడవరం మండలం నారాయణపురం వద్ద నిల్వ కేంద్రాలు ఉండేవి. గత రెండేళ్ల నుంచి వీటిని ఎత్తేశారు. గతంలో రవాణా ఛార్జీలతో కలిపి ట్రాక్టర్‌ ఇసుక రూ.3 వేలకు దొరికేది. ప్రస్తుతం దాని ధర రూ.7 వేలకు చేరింది. దీనికి తోడు సిమెంటు ధరలు అంతకంతకూ పెరుగుతూనే వచ్చాయి. సిమెంట్‌ బస్తా గతంలో రూ.220 నుంచి రూ.240 ఉండేది. ఇప్పుడు రూ.370 నుంచి రూ.400 వరకు పెరిగింది. దీంతో నిర్మాణ పనులు పూర్తిగా మందగించాయి. కార్మికులకు తగినంత పని దొరకడం లేదు. 60 మందికి పని ఉంటే 40 మందికి పనులే ఉండడం లేదు. దీంతో వ్యవసాయ, ఉపాధి పనులకు వెళ్లిపోతున్నారు.

నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులు (పాతచిత్రం)


అన్నీ ఇబ్బందులే..

భవన నిర్మాణ కార్మికులకు తగినంత పనులు ఉండడం లేదు. ప్రభుత్వ విధానాల కారణంగా నిర్మాణ రంగంలో స్తబ్ధత నెలకొంది. ప్రాజెక్టులు నిర్మాణాలు జరగడం లేదు.. ఇసుక, సిమెంటు ధరలు చూసి మధ్యతరగతి వాళ్లు కూడా నిర్మాణాలకు వెనుకంజ వేస్తున్నారు. దీంతో తాపీ, వండ్రంగి, ఎలక్ట్రికల్‌ వంటి వృత్తుల వారికి పనులు దొరక్క బతుకులు భారంగా మారిపోయాయి. మా సంఘంలో 4 వేల మంది సభ్యులున్నారు. వారిలో 500 మందికి సంక్షేమ పథకాలు అందాల్సి ఉన్నా ప్రభుత్వం ఇవ్వడం లేదు.

మజ్జూరి నారాయణరావు, తాపీమేస్త్రీల సంఘం అధ్యక్షుడు, పాయకరావుపేట


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు