logo

యోదుల చరితం.. నిత్య స్మరణం

గాంధీ విజ్ఞాన మందిరం.... తెలుగు రాష్ట్రాల్లో, విజయవాడ నగరంలో స్వాతంత్య్ర సమరయోధుల ఆధ్వర్యంలో నిర్మించిన ఏకైక భవనం ఇది. నాటి స్వాతంత్రోద్యమ పోరాటాలు, ఫలితాలను అందరికీ తెలియజెప్పేందుకు దాతలు, ప్రజల విరాళాలతో దీనిని నిర్మించారు.

Published : 10 Aug 2022 06:09 IST

విజయవాడలో ‘గాంధీ విజ్ఞాన మందిరం’
గవర్నర్‌పేట, న్యూస్‌టుడే

రూపుదిద్దుకుంటున్న భవనం

గాంధీ విజ్ఞాన మందిరం.... తెలుగు రాష్ట్రాల్లో, విజయవాడ నగరంలో స్వాతంత్య్ర సమరయోధుల ఆధ్వర్యంలో నిర్మించిన ఏకైక భవనం ఇది. నాటి స్వాతంత్రోద్యమ పోరాటాలు, ఫలితాలను అందరికీ తెలియజెప్పేందుకు దాతలు, ప్రజల విరాళాలతో దీనిని నిర్మించారు.

ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఆశీర్వాదాలతో..

1974లో విజయవాడ నగరంలో కృష్ణా జిల్లా స్వాతంత్య్ర సమరయోధుల సంఘం ఏర్పడింది. 1975లో విజయవాడకు వచ్చిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని సంఘం నేతలు కలిసి, భవన నిర్మాణంపై వినతిపత్రం సమర్పించారు. 1981, ఆగస్టు 14న అప్పటి ప్రభుత్వం 48 సెంట్ల స్థలం కేటాయించింది. నాటి ముఖ్యమంత్రి అంజయ్య ఎంతగానో సహకరించారు. 1986, మార్చి 10న నాటి రాష్ట్రపతి జ్ఞాని జైల్‌సింగ్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. స్వాతంత్య్ర సమరయోధులు అన్నే అంజయ్య, కాట్రగడ్డ మధుసూదనరావు, తంగిరాల వీరరాఘవరావు, సత్తిరాజు రామమూర్తి, బండి తిరుపతయ్య, వేములపల్లి వామనరావు, నిమ్మగడ్డ వెంకటకృష్ణయ్య, పోలవరపు వెంకట సుబ్బారావు, నూతక్కి వెంకట రంగారావులు సంఘ కార్యవర్గ సభ్యులుగా వివిధ సంవత్సరాల్లో పనిచేసి, భవన నిర్మాణంలో తమదైన పాత్ర పోషించారు. 1988, జనవరి 20, 21 తేదీల్లో విజయవాడలో ఆంధ్రప్రదేశ్‌ స్వాతంత్య్ర సమరయోధుల మహాసభ నిర్వహించారు. దీనికి నాటి రాష్ట్రపతి ఆర్‌.వెంకట్రామన్‌ విచ్చేశారు.

సాంఘిక సంస్కరణల సదస్సుల నిర్వహణ

1992 డిసెంబరు 20న కృష్ణా జిల్లా సంఘ-సంస్కరణల సదస్సు నిర్వహించారు. సమాజం ఎదుర్కొంటున్న వరకట్న దురాచారం, అవినీతి, లంచగొండితనం, అశ్లీల సినిమాలు, స్త్రీలు, దళితులపై అత్యాచారాలు, దౌర్జన్యాలు వంటి సాంఘిక రుగ్మతలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే 1996, అక్టోబరు 9న అవినీతి వ్యతిరేక ప్రదర్శన నిర్వహించారు. తరువాత చాలా కార్యక్రమాలు జరిగాయి.

స్వాతంత్య్ర సమరయోధుల సంఘం ఆశయాలు, కార్యక్రమాలు నిర్వహించేందుకు, ఈ భవనం, స్థలం పర్యవేక్షించుటకు 1995, అక్టోబరు 26న సర్వోదయ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి రిజిస్టర్‌ చేశారు.

భవిష్యత్తరాల కోసం సరికొత్తగా..

* స్వాతంత్య్ర ఉద్యమంపై భవిష్యత్తరాలకు తెలియజెప్పేందుకు ప్రస్తుతం ఉన్న ఖాళీస్థలంలో విశాలమైన మ్యూజియం ఏర్పాటు చేయాలన్నదే సర్వోదయ ట్రస్ట్‌ ఆశయమని అధ్యక్షుడు డాక్టర్‌ జి.వి.మోహన్‌ప్రసాద్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం మూడు అంతస్థుల్లో ఉన్న భవనాన్ని సరికొత్త రూపంలో తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టారు. ఆధునికీకరణ పనులు చేస్తున్నారు. భవనంపై 30 అడుగుల గాంధీజీ విగ్రహం ఏర్పాటు చేశారు.

* మూడో అంతస్తులో ప్రపంచ స్థితిగతులను మార్చిన వివిధ దేశాల విప్లవ ఉద్యమాలు, ఆయా దేశాల స్వాతంత్య్ర ఘట్టాలు ఉంచుతారు.

* రెండో అంతస్తులో దేశ స్వాతంత్య ఉద్యమంలో ప్రధాన ఘట్టాలైన ఉప్పు సత్యాగ్రహం, సైమన్‌ గో బ్యాక్‌, క్విట్టు ఇండియా ఉద్యమం, విదేశీ వస్తు బహిష్కరణ వంటి ఉద్యమ ఘట్టాలను ఉంచుతారు. మన రాష్ట్ర స్వాతంత్య్ర పోరాటాల చర్రిత ఉంచుతారు.

* ఒక అంతస్తులో సమావేశ మందిరం ఏర్పాటు చేస్తారు. కొత్తగా ఏర్పాటు చేయాలనుకున్న భవనంలో స్వాతంత్య్ర ఉద్యమ పోరాటాలను తెలియజేసేలా రూపొందిస్తారు. శబ్ద, దృశ్య మాధ్యమంలో నేటి యువతను ఆకట్టుకునేలా దీన్ని రూపొందిస్తారు. దాతలు ముందుకు వస్తే ప్రభుత్వ సహకారంతో త్వరలోనే ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తామని డాక్టర్‌ జి.వి.మోహన్‌ప్రసాద్‌ తెలిపారు.


బందరుతో పింగళికి ప్రత్యేక బంధం

గొడుగుపేట:  జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యకు బందరుతోనే అనుబంథం ఎక్కువ. ఆంధ్రజాతీయ కళాశాలలో అధ్యాపకుడిగా సేవలందిస్తున్న సమయంలోనే మువ్వన్నెల పతాకాన్ని రూపొందించి విజయవాడ భారత జాతీయ కాంగ్రెస్‌ సభలకు తీసుకెళ్లారు. కాంగ్రెస్‌పార్టీ సమావేశాల్లో కూడా బ్రిటీష్‌ యూనియన్‌ జెండానే ఎగుర వేసేవారు. 1909లో కలకత్తా కాంగ్రెస్‌ మహాసభలకు హాజరైన పింగళి అక్కడ బ్రిటీష్‌ జెండానే ఎగురవేపి వందన సమర్పణ చేయడం చూసి బాధపడ్డారు. అప్పటినుంచి పట్టువదలిన విక్రమార్కుడిలా భారతజాతీయ జెండా తయారీలో నిమగ్నమయ్యారు. చివరకు 1921 మార్చి 30, 31 తేదీల్లో బెజవాడ విక్టోరియా మ్యూజియం హాల్లో జరిగిన జాతీయ కాంగ్రెస్‌ సభల్లో బాపూజీ నమూనా జాతీయజెండా సమర్పించారు. పింగళి త్యాగాలకు గుర్తుగా మచిలీపట్నంలో పింగళి విగ్రహం ఏర్పాటు చేయడంతోపాటు కళాశాలకు ఆనుకుని ఉండే రాజుపేటలో ఓ వీదికి ఆయన పేరు పెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని