logo

‘అవగాహన లేని సిబ్బందితో భూసర్వే సరికాదు’

అవగాహన లేని సిబ్బందితో భూ సర్వే చేయడం సరైందికాదని, ఫలితంగా ఎన్నో అవకతవకలు జరిగి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి ఎదురవుతుందని పూర్వ జె.డి.లక్ష్మీనారాయణ అన్నారు.

Published : 01 Dec 2022 06:12 IST

మాట్లాడుతున్న పూర్వ జె.డి.లక్ష్మీనారాయణ, పక్కన మాజీ మంత్రి వడ్డే, రైతు సంఘం నాయకుడు నాగేంద్రనాథ్‌

ఉయ్యూరు, న్యూస్‌టుడే: అవగాహన లేని సిబ్బందితో భూ సర్వే చేయడం సరైందికాదని, ఫలితంగా ఎన్నో అవకతవకలు జరిగి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి ఎదురవుతుందని పూర్వ జె.డి.లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం ఉయ్యూరులో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టెక్నాలజీ తీసుకువచ్చినప్పుడు గ్రామీణ స్థాయి సిబ్బందితో కాకుండా విశిష్టమైన అవగాహన కలిగిన వారితో సర్వే నిర్వహించాలన్నారు. ఇంజినీరింగ్‌ కళాశాలలు, జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయం వంటివి ఉన్నాయని వాటిని ఎందుకు వినియోగించుకోరని లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. స్టాండర్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ పుస్తకం ఆంగ్లంలో ఉన్నా తెలుగులో లేకపోవడం దురదృష్టకరమన్నారు. జీవోలు, పాలసీలు కాగితాల్లో ఉంటాయని అమలు విషయంలో అనేక అవకతవకలుంటాయన్నారు. సర్వే జరుగుతున్నప్పుడు రైతులు పక్కన ఉన్నారా? లేరా? అనేది చూడటం లేదని, దీనివలన భవిష్యత్తుల్లో ఎన్నో వివాదాలకు అవకాశం ఉంటుందన్నారు. కోర్డులకు వెళితే ఎన్ని ఏళ్లు పడుతుందోనని, అందుకే మండల ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలన్నారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ భూసర్వే విషయంలో ప్రభుత్వ తొందరపాటు విధానంతో ముందుకెళుతోందన్నారు. రెవెన్యూ శాఖలో ఖాళీలను భర్తీ చేయడం లేదన్నారు. ఈ భూ సర్వే ప్రక్రియ అస్తవ్యస్తంగా తయారైందన్నారు. కేంద్రం ఖర్చుతో ఈ విధానం అమలవుతోందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం తగిన సిబ్బందిని ఏర్పాటుచేసి అమలు చేయాల్సి ఉందన్నారు. రైతుల సమక్షంలోనే భూసర్వే జరిగి తీరాలని డిమాండ్‌ చేశారు. తక్కెళ్లపాడులో సీఎం జగన్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మూడేళ్లవుతున్నా ఇప్పటికీ అక్కడ సర్వే పూర్తిగా జరగలేదన్నారు. రాష్ట్ర రైతాంగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు యేర్నేని నాగేంద్రనాథ్‌ మాట్లాడుతూ వీఆర్వో రాసే రాతతో రైతుల రాతలు మారిపోతున్నాయి. సాగునీటి వినియోగదారుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, ఏకాంబరం తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని