logo

పుస్తకాలు మిగిలాయి

మైలవరం మండలానికి ఈ ఏడాది విద్యాశాఖ ద్వారా మొత్తం 62,190 పాఠ్యపుస్తకాలను సరఫరా చేయగా, విద్యార్థులకు పంపిణీ పూర్తయ్యాక అందులో 6 వేల పైగా పుస్తకాలు మిగిలిపోయాయి.

Published : 03 Dec 2022 04:52 IST

విద్యార్థుల తగ్గుదలకు తార్కాణం

మైలవరం మండల వనరుల కార్యాలయంలో పాఠ్య పుస్తకాలు

న్యూస్‌టుడే- మైలవరం, తిరువూరు: మైలవరం మండలానికి ఈ ఏడాది విద్యాశాఖ ద్వారా మొత్తం 62,190 పాఠ్యపుస్తకాలను సరఫరా చేయగా, విద్యార్థులకు పంపిణీ పూర్తయ్యాక అందులో 6 వేల పైగా పుస్తకాలు మిగిలిపోయాయి. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 800 మందికి పైగా తగ్గటమే దానికి కారణమైతే, అన్ని మండలాల్లోనూ ఇవే పరిస్థితులు ఉన్నాయి.

ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా లక్షకు పైగా పుస్తకాలు ఆయా మండల వనరుల కార్యాలయాల్లోనే మిగిలిపోయాయి. విద్యా సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం ఈ ఏడాది 8వ తరగతి వరకు ప్రవేశపెట్టిన సెమిస్టర్‌ విధానంతో పాఠ్య పుస్తకాల సంఖ్య భారీగా పెరిగింది. మూడు సెమిష్టర్లలో భాగంగా తరగతిని బట్టి ఒక్కో తరగతికి  10 నుంచి 16వరకు పాఠ్యపుస్తకాలు, వర్కుబుక్‌లను ప్రభుత్వమే ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలలకు సైతం అందజేసింది. గత ఏడాది విద్యార్థుల గణాంకాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం భారీగా  ముద్రించి మండలాలకు పంపింది.


లక్షకు పైగా మిగులు

ఉమ్మడి జిల్లాలో 2, 3 సెమిస్టర్లకు సంబంధించి మొత్తం 6,34,418 పుస్తకాలను ఒకే దఫాలో ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేశారు. పాఠశాలలు తెరిచిన ప్రారంభంలోనే మొదటి సెమిస్టర్‌కు సంబంధించి అదే సంఖ్యలో పది తరగతులకు కలిపి పుస్తకాలను సరఫరా చేశారు. పాఠశాలల విలీనం, కొవిడ్‌ అనంతరం పిల్లలు ప్రైవేటు పాఠశాలలకు తరలివెళ్లటంతో విద్యార్థులు బాగా తగ్గిపోయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 98 పాఠశాలలు తగ్గటంతో పాటు, విలీనం పేరిట చాలా కాలం పాటు సాగిన దోబూచులాటతో ప్రాథమిక పాఠశాలల్లోని పిల్లలను దూరం పంపటానికి ఇష్టపడని తల్లిదండ్రులు వారిని సమీప ప్రవేటు పాఠశాలలకు పంపించారు.


వచ్చే ఏడాదికి సర్దుబాటు,

సీవీ రేణుక, డీఈవో

సాధారణంగా విద్యార్థుల సంఖ్యకు అదనంగా 5 శాతం వరకు పాఠ్య పుస్తకాలను సరఫరా చేస్తారు. ఈ ఏడాది కూడా గతేడాది విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పుస్తకాలను పంపాం. అయితే గతేడాదితో పోల్చితే ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య సుమారు 12 వేల వరకు జిల్లాలో తగ్గారు. కొవిడ్‌తో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగాయి. కొవిడ్‌ తగ్గటంతో సొంత పాఠశాలలకు వెళ్లటంతోనే స్వల్ప మార్పులు వచ్చాయి. దాని మేరకు పుస్తకాలు మండలాల్లో మిగిలిపోయాయి. మండలాల వారీగా క్షేత్రస్థాయి వివరాల నివేదిక ఆధారంగా వచ్చే ఏడాదికి సర్దుబాటు చేస్తాం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని