logo

బరులకు బారులు..!

సంక్రాంతి సంబరాలకు నెల రోజులు ముందే కోడి పందేలు, జూద శిబిరాల నిర్వహణకు కసరత్తు ప్రారంభించారు.

Published : 08 Dec 2022 05:07 IST

కోడి పందేలు, జూద శిబిరాల నిర్వహణకు భారీ కసరత్తు

కంకిపాడు, న్యూస్‌టుడే

సంక్రాంతి సంబరాలకు నెల రోజులు ముందే కోడి పందేలు, జూద శిబిరాల నిర్వహణకు కసరత్తు ప్రారంభించారు. ప్రధానంగా గత కొన్నాళ్లుగా  ఈడుపుగల్లు, ఉప్పలూరు, గొడవర్రు, గండిగుంట, ఆకునూరు, బోళ్లపాడు, యనమలకుదురు, తాడిగడప, పోరంకి, పెనమలూరు కేంద్రాలుగా ఉన్నాయి. కొత్తగా కంకిపాడు చేరింది. లాభనష్టాలతో బేరీజు లేకుండా ‘బరి’ నిర్వహణే ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.  డిసెంబరు రాగానే పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరికలు చేయడం, పండగకి రెండు రోజులు ముందు చేతులెత్తేయడం షరామామూలైంది.

వాటాల్లో వివాదాలు

కంకిపాడు శిబిరం నిర్వహణకు ఇప్పటికే రూ.5 లక్షల మేర ధరావతు వసూలు చేశారనే ప్రచారం జరుగుతోంది. ఇదే విషయమై ఎమ్మెల్యే సమక్షంలోనే తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకోవడాన్ని ప్రస్తావిస్తున్నారు.  గత ఏడాది భాగస్వాములకు వసూళ్లలో వాటా ముట్టలేదనే విషయమూ దుమారం లేపింది.

శిబిరాల నిర్వహణకు ఆజ్యం పోసిన ఈడుపుగల్లుపై ప్రధాన నాయకులు కన్నేశారు.  కోలవెన్ను, ఈడుపుగల్లు నాయకులతో పాటు ప్రధాన ప్రజాప్రతినిధి సన్నిహితులు దీనిలో వాటా కోసం పట్టుపడుతున్నారు. రెండు వర్గాలూ శిబిరంపై పట్టుకోసం ప్రయత్నిస్తున్నాయి. ఇక్కడ పరోక్షంగా తెదేపా శిబిర నిర్వహణకు లోపాయికారిగా సహకరిస్తుందని చెబుతున్నారు.

‘హైక్లాస్‌’ జూదం నిర్వహించే ఉప్పలూరు బరిలో మంతెన, వేల్పూరు, పునాదిపాడు తెన్నేరు నాయకులు వాటాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేకి ప్రధాన అనుచరులు ఇద్దరు అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. దీంతో తమకు అన్యాయం జరుగుతోందని మంతెన/తెన్నేరు సరిహద్దుల్లో శిబిరం ఏర్పాటుపై కరసత్తు మొదలైంది.

గొడవర్రులో రైతువారీగా పందేలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గత ఏడాది వర్షానికి శిబిరం బురదమయమవ్వడంతో లంక గ్రామాలకు నిర్వాహకులు తరలారు. ఈ ఏడాది పెద్ద ఎత్తున ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ మాత్రం ఒకరి నాయకత్వంలోనే జరుగుతోంది. స్థానిక నాయకులు ఆశించినా ‘పట్టాల’కే పరిమితమవుతుందని చెబుతున్నారు. ఇక్కడా తెదేపా నాయకుల పరోక్ష మద్దతు లభిస్తోంది.

గండిగుంట, బోళ్లపాడు, తాడిగడప, యనమలకుదురులో వాటాల పంపిణీ పక్రియ పూర్తయినట్లు సమాచారం. గోసాల, వణుకూరు మధ్యన శిబిరం ఏర్పాటుపై సమీక్ష చేస్తున్నారు. పోరంకి, కానూరుల్లో కోడి పందేల స్థానే గుట్టు చప్పుడు కాకుండా వ్యవస్థీకృత జూదశాలలు గత కొన్నేళ్లుగా కొనసాగుతున్నాయి. కోలవెన్నులో నిత్యం రూ.కోట్లలో చేతులు మారుతున్నాయనే ఆరోపణలున్నాయి.

గత ఏడాది చలివేంద్రపాలెం, ప్రొద్దుటూరు, కుందేరు, నెప్పల్లికి చెందిన నాయకులు కలిసి శిబిరం ఏర్పాటుకు సిద్ధం కాగా, నిర్వహణపై అవగాహనలేమితో వెనుకడుగు వేశారు. లక్షల్లో పెట్టుబడి.. వరుస కుదిరితే అందకుమించి రాబడి జూద గృహ నిర్వహణకు పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. దీనికి భిన్నంగా కోడి పందేల శిబిరానికి రూ.లక్షల్లో పెట్టుబడి, మందీ మార్భలం అవసరం ఉంటుంది. వర్షం లేదా, ఇతర కారణాలతో రద్దయితే నష్టం భారీగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది కొత్తగా ‘ధరావతు’ పథకాన్ని అమల్లోకి తీసుకు వచ్చారు. పెద్దబజార్‌-చిన్నబజార్‌, మూడు ముక్కలాల, నంబర్లాట, దమాకా.. ఇలా కొత్తకొత్త ఆటలు రంగ ప్రవేశం చేశాయి. పట్టాకు రోజుకు రూ.2-3 వేలు చొప్పున రూ.6-9వేల వసూలు చేస్తున్నారు. మద్యం, బిర్యానీ, సిగరెట్టు, తినుబండారాల దుకాణాలకు డిమాండ్‌ను బట్టి ముందస్తు వసూళ్లు ప్రారంభించారు.


గుత్త మొత్తంగా..

కొన్ని శిబిరాల్లో మూడు నాలుగు విభాగాలను గుత్త మొత్తంగా లీజుకు ఇస్తున్నారు. నిర్వహణ, పెట్టుబడికి అనుగుణంగా లీజు ధర నిర్ణయిస్తున్నారు. రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే కనీసం రూ.20 లక్షలకు సబ్‌-లీజు ద్వారా వచ్చే విధంగా చూస్తున్నారు. అదనపు రూ.10 లక్షల్లో పోలీసులు, రెవెన్యూ ‘మామూళ్లు’ 50 శాతం ఉంటున్నాయి. పొలం ఇచ్చిన రైతుకు ఎకరానికి రూ.20 వేల వరకు రెండో పైరు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇదంతా సవ్యంగా జరగాలంటే ఎమ్మెల్యే, ఎంపీల అండదండలు చాలా అవసరం. ఇంత రిస్క్‌ తీసుకుని శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారంటే ‘లోగుట్టు’ ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సంక్రాంతి నెల ముందే జిల్లాలో పెనమలూరు నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొనడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని